తొలి తెలుగు వాగ్గేయకారుడు – తాళ్ళపాక అన్నమయ్య “యోగ వైరాగ్య శృంగార సరణి” పేర మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు.
సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో “శృంగార మంజరి” అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో “వేంకటేశ్వర శతకము” ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.
ఇంత గొప్పవాడైన ఆ భక్తుడు కడప జిల్లాలోని రాజంపేట తాలూకాలో ఉన్న తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408లో జన్మించాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది.