గురువారం , 21 నవంబర్ 2024
రోంత జాగర్తగా

రోంత జాగర్తగా మసులుకోర్రి సోములారా ! (కవిత)

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది మొదలు రాయలసీమకు పాలకులు (ప్రభుత్వం) అన్యాయం చేస్తున్నా నోరు మెదపకుండా రాజకీయ పక్షాలన్నీ నోళ్ళు మూసుకున్న తరుణంలో… కోస్తా ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటును సీమ ప్రజలు వ్యతిరేఖిస్తున్న సందర్భంలో, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న భాజపా  23 ఫిబ్రవరి 2018 నాడు రాయలసీమ డిక్లరేషన్ వెలువరించింది. ఈ నేపధ్యంలో రాయలసీమ విషయంలో భాజపాతో పాటు ఇతర పార్టీల చిత్తశుద్ధిని గుర్తు చేస్తున్న తవ్వా ఓబుల్‌రెడ్డి, సీమకు జరిగిన వంచనను గుర్తు చేస్తూ ఇకనైనా నాటాకాలు కాకుండా జాగ్రత్తగా మసలుకొమ్మని ఆ పార్టీలకు ఇట్లా సూచన చేస్తున్నారు….

చదవండి :  ముక్కొండ కథ

అపుడెపుడో పాతికేళ్లప్పుడు
నీటికోసం శాంతి కోసం అంటా
మీరు చేసిన యాత్ర మేం మరిచిపోల్యా!

తుపాకులూ, పుర్రెలు అచ్చుకొట్టి
పంచిపోయిన కాయితాలు మేం పారేసుకోల్యా!

ఎడారులలో నందనవనాలు
పూయిచ్చమని బొక్కులు పంచిపోతిరి
సీమ చైతన్య యాత్ర అని ఊరేగుతా
ప్రేమ చూపిన మీరు ఏమై పోతిరి ?

మీ ప్రేమ జాబులు పెట్టెల్లో దాసిపెట్టుకోని
సందమామ కోసం చకోర పచ్చులమాదిరి
నీటిసుక్క కోసం కరువు పచ్చులమై
ఎగ జూచ్చానే ఉంటిమి గదా!

ఆ తుపాకులు ఎప్పుడో తుప్పుబట్టిపాయ
పుర్రెల్ని నెర్రెల పర్రెలు మింగేశ
ఏ పొద్దైనా ఏమర్రా ఎట్టుండారని
పలకరిచ్చిన పాపాన బోయినారా?

చదవండి :  గట్టి గింజలు (కవిత)

అధికారంతో చెట్టాపట్టాలేసుకుని
అన్నీ మరిచిపోయి తిరిగిన మీకు
తేడాలోచ్చి సిగపట్లు పట్టిన యాల
ఈ పొద్దు మల్లా కనపడ్తాండమా ?

వారానికొక రోజు ఆ అమరావతి బొమ్మలు
పేపరోళ్లు అచ్చుకొట్టరి..టీవీలోళ్లు తప్పేట గొట్టిరి
బుందేల్ ఖండ్ తరహా హామీల గురించి
అడిగిన పాపాన పోయినోడు లేకపాయ

ఇదోర్రి సీమోల్లారా ఇయి తీసుకోర్రని
నాలుగురూకలు ఇదిలిచ్చిపుణ్యం గట్టుకోకపోతిరి
మా కర్నూలు రాజధాని కాకుండా సేసిరి
మాకొచ్చే మెడికల్ సీట్లు దెంక పోయిరి

శ్రీశైలం నీళ్ళకు పాతాళం జూపిచ్చిరి
ఆసుపత్రులూ ,ఆపీసులూ
అన్నీ ఆడ్నేకట్టుకుంటాండారు
అమరావతికి పన్నుల కప్పం కడ్తాండం

చదవండి :  గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత)

హైదరాబాదుకో , బెంగుళూరుకో
కడపాత్రంబోయి అడక్క తింటాండం
సరే ..సరే మీ గుద్దులాటకో దండం బెడతం
ఇట్టనన్నా రాయలసీమ ఊసెత్తబడితిరి

పసుపు,కాషాయం,నీలం, తెలుపు,ఆకుపచ్చ,ఎరుపు,

జండాలేయైనా గాని అజెండాల్లో సీమ ఊసేది

మీయందరి ఇపిరాటలు చూసి చూసి
మాకు సాలయ్యిందిలే సోములారా ..

మాకోసం మా పిల్లోళ్ళు గొంతెత్తు తాండారు
సీమ జెండా ఎత్తుకొని శివాలెత్తు తాండారు
నాటకాల పరదాలు పక్కకు జరపి
రోంత జాగర్తగా మసులుకోర్రి సోములారా !

(భాజపా రాయలసీమ డిక్లరేషన్ వెలువరించిన నేపధ్యంలో..)

– తవ్వా ఓబుళరెడ్డి

(tavva@kadapa.info)

ఇదీ చదవండి!

సూర్య విగ్రహం

నిడుజువ్విలో సుందర సూర్య విగ్రహం!

భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ఉన్న ప్రాధాన్యత అమితమైనది. కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ఇందుకు ప్రతీకగా చెప్పుకుంటాం. మన రాష్ట్రంలో ‘అరసవెల్లి’ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: