తనకు ప్రాప్తిలేక దాతలివ్వరటంచు
దోషబుద్ధి చేత దూరుటెల్ల
ముక్క వంకజూచి ముకురంబు దూరుట
విశ్వదాభిరామ వినురవేమ
దాత తనకు ద్రవ్య సహాయం చెయ్యటం లేదనే ఆక్రోశంతో అతన్ని నిందించటం అవివేకం. నిజానికి తనకా అదృష్టం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవడం ఎట్లా ఉంటుందంటే, తన ముక్కు వంకరగా ఉందని మర్చిపోయి, అద్దమే దానిని వంకర చేసి చూపించిందని తూలనాడినట్టు, అంటున్నాడు వేమన.
వేమన ఇంతకుముందు అనేక పద్యాల్లో దానగుణం లేనివారిని ఈసడించుకున్నాడు. పిసినారులను నోరారా ఎగతాళి చేశాడు. ఇక్కడ అర్థించేవారికి సంబంధించిన కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. దాతను కోరేటప్పుడే నువ్వు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. నీ ‘ప్రాప్తి’ అంటే గ్రహచారం ఎట్లుందో విచారించుకోవాలి. సమృద్ధిగా పండ్లున్న చెట్టు కింద నిలబడి, అవి కింద రాలి పడుతున్నాయని, నీ ఒడిలో పడటం లేదని అంగలారిస్తే ఎలా? నీ కర్మఫలాన్ని గురించి ఆలోచించనక్కరలేదా? అణిమాది అష్టసిద్ధుల్లో ప్రాప్తి కూడా ఒకటి. అలాగే అడిగినప్పుడల్లా ఇవ్వటం లేదనే కోపంతో దాతను తిట్టడం అదినీ ‘దోష బుద్ధి’ వల్లనే జరుగుతుంది. దోషం అంటే తప్పు. ఎదుటివారిని తప్పుపట్టే ద్వేష మానసికత.
ఇక ముక్కు. ముక్కు అంటే నోటికి పైభాగాన ఉండే అవయవం అని చెప్తే సరిపోదు. ముఖం మొత్తానికి ముక్కు ముఖ్యమైన అందం. Roman nose అంటారు అందుకే. ముక్కుపరంగా ఎన్నో భావచ్ఛాయలను గమనించవచ్చు. ముక్కుసూటిగా అంటే ఉన్నది ఉన్నట్లుగా అని. ముక్కుతాడు వెయ్యటం అంటే అదుపు చెయ్యడం. ముక్కున వేలిడి అంటే ఆశ్చర్యపడటం. ముక్కుపచ్చలారని వాడంటే పసివాడని. ముక్కుపట్టుకొని కూచున్నాడంటే జపం చేస్తున్నాడని. ముక్కు పిండి వసూలు చేశాడంటే బలవంతంగా అని. అలాగే ముక్కు విరుచుకొను- ఇష్టపడకపోవడం; ముక్కు మొహం తెలియనివారు అపరిచితుడని. ముక్కు చెవులు కోయడమంటే అవమానించడమని. పాపం శూర్పణఖ!
నీ ముఖం బాగలేనప్పుడు అది అద్దం దోషమెలా అవుతుంది? కొన్ని సందర్భాల్లో ఆత్మ విమర్శ చాలా అవసరం అని వేమన్న హితవు చెప్తున్నాడు.
‘దైవ నింద వెర్రితనముగాదె, కర్మజీవులు తమ కర్మంబు తెలియరు (డి.1723-290)’ అనేవి పాఠాంతరాలు.