తితిదే నుండి దేవాదాయశాఖకు ‘గండి’ ఆలయం
తితిదే అధికారుల నిర్వాకమే కారణం
పులివెందుల: మండలంలో ఉన్న గండిదేవస్థానం ఎట్టకేలకు తితిదే నుంచి విముక్తమై దేవాదాయశాఖలోకి విలీనమైంది. శనివారం తితిదే అధికారులు స్థానిక నాయకుల సమక్షంలో దేవాదాశాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్టెం గురుప్రసాద్‌కు రికార్డులు అందజేశారు.
నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో 2007లో దేవాదాయ శాఖలో ఉన్న గండిక్షేత్రాన్ని తితిదేలోకి విలీనం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో ఆలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ చూపిన తితిదే అధికారులు 2009 తర్వాత సరైన చర్యలు తీసుకోకపోవడంతో అటు భక్తులు, ఇటు సిబ్బంది నుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో రెండేళ్ల కిందట 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తితిదే బోర్డు సభ్యులతో మాట్లాడి తిరిగి దేవాదాయశాఖకు అప్పగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు కోర్టుకు వెళ్లడం తో ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. ఇటీవల కోర్టుకెళ్లిన వారు కేసును విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఆలయాన్ని దేవాదాయ శాఖలోకి పరిధిలోకి బదిలీ కావడానికి మార్గం సుమగం అయింది.
ఇక నుంచి గండి క్షేత్రంలో నిర్వహించే ప్రతి కార్యక్రమమూ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉంటుందని అసిస్టెంట్ కమిషనర్ చెప్పారు. గండి క్షేత్రాన్ని అస్తవ్యస్తంగా నిర్వహించిన తితిదే అధికారుల నిర్వాకం ఒక వైపు, దేవుని కడప ఆలయానికి సంబంధించి ఇవే తరహా ఆరోపణలు వినిపిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని ఇటీవలే తితిదేకి అప్పగించింది.