సీమ అభివృద్ధిని మరిచిపోయిన నాయకులు
రాయలసీమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి సీమకు నష్టం జరగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి అన్నారు. కడప నగరంలోని ఆర్‌జేయూపీ కార్యాలయంలో ఆదివారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్‌యూ) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దీక్షల ఫలితంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని.. అనంతరం విశాలాంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్‌ను రాజధానిగా చేశారన్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేస్తారనుకుంటే కోస్తా నేతలకు తలొగ్గి రాజధానిని కోస్తాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. ప్రభుత్వం వివక్ష చూపుతుండడంతో రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులు సీమ అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి అభివృద్ధిని సాధించుకోవాలన్నారు. లేకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవని పేర్కొన్నారు.
ఆర్ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను కాపాడుట కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అధికార, ప్రతిపక్ష నాటకాలను బయటపెట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థులకు వివరించి వారిని చైతన్య పరుస్తమని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎస్‌యూ నాయకులు సురేష్, ఆనంద్, జయవర్ధన్, రవీంద్ర, నాగరాజ, జకరయ్య, రాజేష్, మల్లికార్జున, ప్రసన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.