సోమవారం , 23 డిసెంబర్ 2024
AnjaliDevi

ఆడుకోవడమంటే ఎంతిష్టమో… అంజలీదేవి

‘సీతాదేవి ఎలా వుంటుంది?.. ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవిలా వుంటుందా…!’

‘ ఏమో..! అలాగే వుంటుందేమో…!’

1963 నాటి ‘లవకుశ’ సినిమాను చూసిన వారెవరైనా పై ప్రశ్నకు సమాధానం ఇలాగే చెబుతారు. ఎందుకంటే అందులో అంజలీదేవి ధరించిన సీత పాత్ర ఆమెకు అంత పేరును తెచ్చి పెట్టింది.

పెద్దాపురంకు చెందిన అంజనీ కుమారి నటన, నృత్యం వంటి పలు అంశాలలో తనదైన ముద్రను వేసుకున్నారు. చిన్నప్పటి నుండి నాటకాలతో సహజీవనం సాగించిన అంజనీకుమారి అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించారు. అంతే ఆ పైన ఆమె పరిశ్రమలో తిరిగి చూడాల్సిన పనే లేకపోయింది.

8 దశకాల పైచిలుకు జీవితంలో సుమారు 500లకు పైగా చిత్రాలలో నటించిన అంజనీకుమారి సినీరంగ ప్రవేశంతో తన పేరు మార్చుకుని అంజలీదేవిగా మారారు. ఆరు దశకాల సినీ జీవితంలో అందరి మన్ననలు పొందిన అంజలీదేవి విభిన్న పాత్రలలో నటించారు. పాత్రలో ఇమిడిపోవాలన్న తపనే ఆర్టిస్టులను అందలమెక్కిస్తుందనడానికి ఉదాహరణగా నిలిచిన ఈ ప్రతిభామూర్తి రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు పలు అవార్డులను కూడా అందుకున్నారు. ప్రస్తుతం చెన్నయ్‌లో ప్రశాంతజీవనం గడుపుతున్న అంజలీదేవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన  ‘నా బాల్యం’ శీర్షిక కోసం  ఆమె మనసు విప్పి తన చిన్ననాటి సంగతులను ఇలా స్మరించుకున్నారు…

‘మాఊరు ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం. 1928లో నేను అక్కడే పుట్టాను. నాన్న నూకయ్య, అమ్మ సూరమ్మ. నాలుగవ తరగతి వరకు ఊర్లోని ముప్పనాస్ స్కూల్లో చదివాను. ఆ రోజుల్లోనే మా నాన్న నాకు సంగీతం, డ్యాన్స్ నేర్పేందుకు మాస్టార్లను పెట్టారు. నాన్న ఇంట్లో అప్పుడప్పుడు తబలా వాయించేవారు. నాకు ఇటు సంగీతం, డ్యాన్సుల మీదకానీ, అటు చదువుపైన కానీ పెద్దగా ఇంట్రస్టు ఉండేది కాదు. పిల్లలతో ఆడటమంటే నాకు బాగా ఇష్టంగా ఉండేది. ఎక్కువగా పిల్లలతో కలసి రకరకాల ఆటలు ఆడేదాన్ని. నా స్నేహితులంతా బ్రాహ్మల పిల్లలే. వారిలో వకీలు గారి కూతురు జగదాంబ నాతో బాగా స్నేహంగా ఉండేది. మేమిద్దరం కలిసి కొత్త కొత్త ఆటలు ఆడేవాళ్ళం.

చదవండి :  'నారాయణ' మరణాలకు నిరసనగా చేపట్టిన బంద్ విజయవంతం

అలనాటి మేటి నటి, అంజలీ దేవి (86) ఇక లేరు. అనారోగ్యంతో సోమవారం (13.1.2013) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె కన్నుమూశారు. చెన్నైలో స్థిరనివాసం ఏర్పరచుకున్న అంజలీ దేవి కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్యం కారణంగా శరీరం చికిత్సకు సహకరించక పోవడంతో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. శ్రీరామచంద్ర ఆసుపత్రికి ఆమె అవయవాలను దానం చేశారు. అంత్యక్రియలు గురువారం చెన్నైలో జరగనున్నాయి.

పెద్దాపురంలో మేమున్న వీధిలో ప్లీడర్‌లుండేవారు. అందుకేనేమో మా వీధిని ప్లీడర్ వీధి అనే వాళ్ళు. అక్కడ మాకో పెద్ద ఇల్లుండేది. ఇప్పటికీ నా పేర పెద్దాపురంలో చిన్న స్థలం అలాగే ఉంది. చిన్నప్పుడు ఫ్రెండ్సంతా కలిసి డబ్బులు కలెక్ట్ చేసి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం. బొమ్మల పెళ్ళి చేసేటప్పుడు ‘చెంగల గౌరి…’ మొదలైన పాటలు పాడేవాళ్ళం. ఇలా చిన్నప్పుడు పెద్దాపురంలో చాలా సరదాగా గడిపాను. అప్పట్లో మా ఊర్లో ముప్పనాస్ వారి థియేటరుండేది. ఇందులో సినిమాలు, డ్రామాలు వేసేవారు. ఇందులో భద్రాచారి గారు ఒకసారి సత్యహరిశ్చంద్ర డ్రామా వేశారు. అందులో ‘లోహిదాసుడు’ వేషం వేయాల్సిన అబ్బాయి రాకపోవడంతో నాటకం వారొచ్చి ‘మీ అమ్మాయిని ఆ వేషం కోసం పంపమని’ నాన్ననడిగారు. అప్పటికి నా వయసు 9 సంవత్సరాలు. అప్పటికీ నాకు డ్రామాల గురించి ఏమీ తెలియదు. నాన్నగారు నన్ను చేయి పట్టుకుని లాక్కెళ్ళి డ్రామా రిహార్సల్ గది వద్ద వదలిపెట్టారు. అది మగవేషం కాబట్టి వాళ్ళు నా జుత్తు కట్ చేశారు. అంతే! ఒకటే ఏడుపు. తరువాత రెండు రోజులు రిహార్సల్ చేయించారు. చివరకు డ్రామా వేసేటప్పుడు లోహిదాసుడు చనిపోయిన సీన్‌లో నేను నిద్రపోతున్నాను. ఆ సీన్‌లో చంద్రమతి పాత్రధారి వచ్చి నా చేతిలో కర్పూరం వెలిగించి నా మీద పడి ఏడుస్తోంది. అప్పుడు అమ్మో! కాలిపోతానేమోనని బాగా భయమేసింది. నేను ఈ విషయాన్ని ఎవరికీ తెలీకుండా సైగ చేస్తే చంద్రమతి పాత్ర వేసినావిడ కదల వద్దని నా చేయి నొక్కింది. చివరకు సీన్ పూర్తయిపోగానే లేచి పెద్దగా ఏడ్చాను.

చదవండి :  కిటకిటలాడిన దేవునికడప

నాన్న నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసేవారు. ఒకే ఒక్కసారి అన్నం తినలేదని ఆయన నన్ను తుండుతో కొట్టారు. తరువాత ఆయనే దగ్గరకు తీసుకుని అన్నం తినిపించారు. ఈ విషయం జ్ఞప్తికి వచ్చినప్పుడు చెప్పలేని అనుభూతికి లోనవుతుంటాను. అప్పట్లో కాకినాడలో నటనలో శిక్షణ ఇచ్చేందుకు ‘యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్’ అనే సంస్థ ఉండేది. 9 సంవత్సరాల వయసపుడు నాన్న నన్ను అక్కడ చేర్పించారు. అక్కడ నేను హాస్టల్‌లో ఉండేదాన్ని. రూముకు ముగ్గురు పిల్లలుండేవారు. ప్రతి నెలా డాక్టర్ వచ్చి మమ్మల్ని పరీక్షించేవారు. క్లబ్‌లో మాకు యాక్టింగ్‌పై శిక్షణ ఇచ్చేవారు. ఈ క్లబ్‌లో ఆదినారాయణరావు గారు అప్పుడు మ్యూజిక్ చేసేవారు. నేను అక్కడ బాగా అల్లరి చేసేదాన్ని. అక్కడున్న సైకిళ్ళకు గాలి తీసేయడం, ఆడాళ్ళను ఆటపట్టించడం లాంటివి నా అల్లరి చేష్టలకి గుర్తులు. అప్పట్లో కాకినాడలో ‘మెజిస్టిక్’ అని ఫేమస్ థియేటరుండేది. అందులో డ్రామాలు వేసేవారు.

ఒకసారి క్లబ్‌కు వచ్చిన బర్మాషెల్ కంపెనీ దొరలు నన్ను చూసి వారు వేసే డ్రామాలో ఒక పాత్రకు నన్ను నటించమన్నారు. ఆ దొరలు నన్ను ‘బేబి’ అని పిలిచేవారు. 1939లో క్లబ్‌లో ‘కుచేల’ డ్రామా వేశారు. అందులో నేను ‘రాఘవ’ వేషం వేశాను. అయితే డ్రామాలో నటించాల్సిన రుక్మిణి పాత్రధారి హఠాత్తుగా రాకపోవడంతో నాకే ఆ వేషం వేసి కృష్ణుని పక్కన నుంచోబెట్టారు. అప్పటికి నేను చిన్నపిల్లను కదా! అందుకని నా కాళ్ళ కింద బాగా ఎత్తైన చెక్కలు పెట్టి నిలబెట్టారు. ఆ విషయం గుర్తొచ్చినప్పుడు బాగా నవ్వొస్తుంటుంది. ఆ డ్రామాలో అక్కినేని నాగేశ్వరరావు సత్యభామ వేషం వేశారు. క్లబ్‌లో ఉండగా మమ్మల్ని అప్పలసామి ఒంటెద్దు బండిపై దగ్గర్లో ఉన్న గుళ్ళకు తీసుకువెళ్ళేవాడు. నేను క్లబ్‌లో ఉన్న సమయంలో నాన్న అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళుతుండేవారు.

చదవండి :  'ఏముండయన్నా కడపలో'? : కడప పర్యటన - 1

నా 13వ ఏట రెడ్‌క్రాస్ వారి డ్రామాల్లో నటించే అవకాశం వచ్చింది. తరువాత కొంత కాలానికి ఆదినారాయణరావు గారితో నాకు పెళ్ళైంది. ఆదినారాయణగారు రూపొందించిన ‘్రస్టీట్ సింగర్స్’ అనే డ్రామాలో నా నటనను చూసిన సి.పుల్లయ్య గారు నాకు 1946లో ‘గొల్లభామ’ చిత్రంలో మోహిని పాత్రలో నటించే అవకాశం కల్పించారు. దీంతో 1946లో నేను, ఆదినారాయణగారు కలిసి మద్రాసుకు వచ్చాం. ఆ సమయంలో మేము తేనాంపేటలో ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఆ ఇంటికి అద్దె నెలకు 20 రూపాయలు. తరువాత పలు సినిమాలలో భిన్న పాత్రలలో నటించే అవకాశం లభించింది. కొంతకాలం తరువాత తేనాంపేట నుండి సెనెటాఫ్ రోడ్డులోని అద్దె ఇంటికి మారాం. తరువాత అంజలి పిక్చర్స్‌ను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాం. నేను ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ భాషలలో 500 చిత్రాలలో నటించాను.

అంజలి పిక్చర్స్ బ్యానర్‌లో 1962లో అనుకుంటా! అశోక్ కుమార్, మనోజ్‌కుమార్, వైజయంతిమాల వంటి మేటి తారలతో ‘ఫూలోంకి సేజ్’ (పూలపాన్పు) అనే సినిమా తీశాం. విడుదలయ్యే సరికి అది కాస్తా ‘కాంటోంకీ సేజ్’ (ముళ్ళ పాన్పు) లా తయారయ్యింది. ఆ సినిమా కారణంగా చాలా నష్టపోయాం. ఇండ్రస్టీలో ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోలేదు. తరువాత బాబాగారి దయతో ఆ కష్టాలనుండి గట్టెక్కాం. 1960లో రాజా అన్నామలైపురంలో స్థలం కొనుక్కుని ఒక ఇంటిని కట్టుకున్నాం. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను.

1990లో ఆదినారాయణరావు గారు దూరమైనప్పటి నుండి భక్తిమార్గంలో కాలం వెళ్ళదీస్తున్నాను. నాకు ఇద్దరబ్బాయిలు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ వయస్సు 75 సంవత్సరాలైతే నా సినీ జీవితం వయసు 60 సంవత్సరాలు. పరిశ్రమకు ప్రాణం పోసిన ప్రముఖ దర్శకులు సి.పుల్లయ్య, బిఎన్ రెడ్డి, హెచ్ఎం రెడ్డి లాంటి వారికి నేడు మనం ఇస్తున్న గౌరవం ఏపాటిది? అసలు వారిని ఏ మాత్రం గుర్తు చేసుకుంటున్నామన్నది నేటి సినీతరం ఆలోచించాలి.’

– తవ్వా విజయభాస్కర రెడ్డి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: