సోమవారం , 23 డిసెంబర్ 2024

9న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

23వ తేదీన కడప డివిజన్‌లో…

27న రాజంపేట డివిజన్‌లో…

31న జమ్మలమడుగు డివిజన్‌లో…

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలోని 791 పంచాయతీలకు గాను  785 పంచాయతీలకు ఈనెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 260 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఓలు) (స్టేజ్-1 ఆఫీసర్లు), 260 మంది (స్టేజ్-2 ఆఫీసర్లు) సహాయకుల నియామకాలకు కలెక్టర్ కోన శశిధర్ ఆమోదం తెలిపారు.

మొదటి విడతలో ఈనెల 23వ తేదీన కడప డివిజన్‌లో 252 పంచాయతీలకు, 2550 వార్డులకు, రెండవ విడతలో 27న రాజంపేట డివిజన్‌లో 258 పంచాయతీలు, 2574 వార్డులు, మూడవ విడతలో 31న జమ్మలమడుగు డివిజన్‌లో 275 పంచాయతీలు, 2600 వార్డులకు కలిసి మొత్తం జిల్లా వ్యాప్తంగా 785 పంచాయతీలు, 7724 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

చదవండి :  26నుంచి యోవేవి పీజీ కౌన్సిలింగ్

పోలింగ్ ఆయా తేదీలలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు.

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. జిల్లాలో పోలింగ్ సిబ్బంది, పోలింగ్‌స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో పంచాయతీ అధికారులతోపాటు సీఈఓ, డీఆర్వో, ఆర్డీఓ తదితర ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

7804 మంది పీఓలు, 9988 మంది సహాయకులు..

జిల్లాలో 10 వేల లోపు జనాభా కలిగిన మూడు, నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి 260 మంది రిటర్నింగ్ అధికారులు, 260 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. వీరికి గురువారం శిక్షణ ఇవ్వనున్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటినుంచి వీరు పోలింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

చదవండి :  జీవిత బీమాపై సేవా పన్నును తొలగించాలి

200లోపు ఓట్లు కలిగిన వార్డులకు ఒక పీఓ, ఓ సహాయకుడు, 200 నుంచి 400లోపు ఓటర్లు కలిగిన వార్డుకు ఒక పీఓ, ఇద్దరు పోలింగ్ సహాయకులు, 400 ఓటర్లకు పైన ఉన్న వార్డులకు ఒక పీఓ, ముగ్గురు పోలింగ్ సహాయకులను నియమిస్తున్నారు.

రాజంపేట డివిజన్‌లో 2596 మంది పీఓలు, 3252 మంది పోలింగ్ సహాయకులు, జమ్మలమడుగు డివిజన్‌లో 2640 మంది పీఓలు, 3420 మంది పోలింగ్ సహాయకులు, కడప డివిజన్‌లో 2558 మంది పీఓలు, 3316 మంది పోలింగ్ సహాయకులు ఇలా మొత్తం జిల్లా వ్యాప్తంగా 7804 మంది పీఓలు, 9988 మంది సహాయకులను వినియోగిస్తున్నారు.

చదవండి :  రెండు రోజుల్లో కడప, పులివెందుల ఉప ఎన్నికల షెడ్యూల్‌

రాజంపేట డివిజన్‌లో 2586, జమ్మలమడుగు డివిజన్‌లో 2640, కడప డివిజన్‌లో 2558 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిలుపుదల

రాజంపేటలో విలీనమైన పెద్దకారంపల్లె, కె.బోయినపల్లె, ఎంజీపురం, తాళ్లపాక, కూచివారిపల్లె పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడలేదు. దీంతోపాటు నందలూరు మండలం చామలూరు పంచాయతీ ముంపు ప్రాంతంగా ఉండటంతో ఆ పంచాయతీకి కూడా ఎన్నిక జరగడం లేదు. దీంతో 791 పంచాయతీలకుగాను 785 పంచాయతీలకే ఎన్నికలు జరగనున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: