
26 నుంచి యో.వే.వి డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు
యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి ఇన్‌స్టంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో మొదటి రెండు సంవత్సరాల్లో అన్ని పేపర్లు ఉత్తీర్ణులై ఉండి తృతీయ సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేకపోయిన అభ్యర్థులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులని తెలిపారు. పరీక్ష రాయగోరే అభ్యర్థులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.యోగివేమనయూనివర్సిటీ.ఏసీ.ఇన్, డబ్ల్యూ. డబ్ల్యూ.డబ్ల్యూ. స్కూల్స్9.కాం, మనబడి. కాం వెబ్‌సైట్‌ల నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
దరఖాస్తులను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీజు రుసుంను డీడీ రూపంలో జతచేసి ఈ నెల 22 సాయంత్రం 4 గంటలలోపు పంపాలని కోరారు. ఒక పేపర్‌కు రూ. 1250, రెండు పేపర్లకు రూ. 2500, మూడు లేక అంతకన్నా ఎక్కువ పేపర్లకు రూ. 3200లు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. డీడీలు యోగివేమన విశ్వవిద్యాలయంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లించేలా తీసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షలు జూన్ 26 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇన్‌స్టంట్ పరీక్షల్లో ప్రాక్టికల్స్ ఉండవని, రీవాల్యుయేషన్, రీటోటలింగ్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఉండవని విద్యార్థులు గమనించాలని కోరారు.