రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలోని అభివృద్ధి పథకాలను సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ విషయమై కడప జిల్లా కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తుండడం విశేషం. తరతరాలుగా వెనుకబాటుకు గురైన జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులను చిత్తూరుకు తీసుకెళ్ళే బదులు ముఖ్యమంత్రి అక్కడికి కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తే బాగుండేది. ఈ చర్యల వల్ల అంతిమంగా రాయలసీమ నష్టపోతుందన్నది నిర్వివాదాంశం. ఇదే విషయమై సాక్షి దినపత్రిక ఇవాళ ఒక కధనాన్ని ప్రచురించింది.
కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వైఎస్సార్ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో పథకాలకు రూపకల్పన చేస్తే, వాటిని గుట్టుచప్పుడు కాకుండా తన జిల్లాకు గద్దలా తన్నుకుపోతూ హైజాక్ సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసిద్ధికెక్కారు. అవసరానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ఆయన ఆశయాలను కొనసాగించాలని లేదు. పైగా అవకాశం వస్తే దివంగత ముఖ్యమంత్రిపై లేని పోని ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు.
దశాబ్దాల తరబడి వివక్షకు గురైన జిల్లా సమగ్రాభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశేషంగా కృషి చేశారు. పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్య లేకుండా చూడాలని మహానేత వైఎస్ ఆకాంక్షించారు. ఏపీఐఐసీ ద్వారా సుమారు 6500 ఎకరాల భూములు సేకరించి కడప సమీపంలో కొప్పర్తి వద్ద మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2009 సెప్టెంబరు 28న శంకుస్థాపన చేసేందుకు గ్రేమాక్స్ స్టీలు ప్లాంటు ముందుకు వచ్చింది. ఆ ఏడాది సెప్టెంబరు 2న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దివంగతులయ్యారు. దీంతో ఆ పరిశ్రమ స్థాపనకు భరోసా లేకపోవడంతో యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఆ తరువాత బీఎంఎం కంపెనీ ముందుకు వచ్చినా భరోసా కల్పించడంలో పాలకులు విఫలమయ్యారు. తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతంలో బ్రహ్మణీ స్టీల్స్ స్థాపించేందుకు అన్ని చర్యలు చేపడితే రాజకీయ కక్షతో రద్దుకు సంకల్పించారు. ఆ స్థానంలో మరో సంస్థతోనైనా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించి వెనుకబడిన జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామనే రీతిలో ప్రభుత్వం స్పందించలేదు. పైగా ఒకటో, అరో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చినా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వాటిని తన జిల్లాకు హైజాక్ చేస్తున్నారు. బీడీఎల్ కంపెనీ ప్రతినిధులు కడప పారిశ్రామికవాడను సందర్శించి ఇక్కడి పరిస్థితులు అనుకూలమని భావించి దరఖాస్తు చేసుకునే ముందు సీఎం కిరణ్‌ను కలిశారు.
అందుకు అనుమతి ఇవ్వాల్సిన ఆయన వారితో సంప్రదించి చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గానికి తరలించుకుపోయారు. కడపలో 600 ఎకరాలు అడుగుతున్నారు కదా కలికిరి వద్ద 1200 ఎకరాలిస్తామంటూ తెలియజెప్పి రక్షణ పరికరాల విడిభాగాలు, విమానాల విడిభాగాలు తయారు చేసే బీడీఎల్‌ను సీఎం హైజాక్ చేశారు. అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి రాయచోటి నియోజక వర్గ పరిధిలో రామాపురం వద్ద సైనిక్ స్కూలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరు కాగానే దీన్ని కూడా కలికిరికి తరలించుకుపోయి తన స్వార్ధ బుద్ధిని బహిర్గతపరచుకున్నారు.
అంతేకాదు.. రాయచోటి నియోజకవర్గ వాసుల దాహార్తి కోసం ఏర్పాటు చేసిన ఝరికోన ప్రాజెక్టు నీటిని కూడా సీఎం కిరణ్ తన సొంత నియోజకవర్గమైన పీలేరుకు తరలించుకుపోయిన విషయం జిల్లావాసులకు విదితమే. ఆ విధంగా జిల్లా పథకాలను ఒక్కొక్కటిగా హైజాక్ చేస్తూ సీఎం కిరణ్ హైజాక్ సీఎం అనే పేరును సార్ధకం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను పరిశీలిస్తున్న జిల్లా ప్రజలు ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు.