డి ఎల్ రవీంద్రా రెడ్డి
ప్రత్యేక రాయలసీమ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయమొచ్చింది : డిఎల్
బాబు సీమపైన వివక్ష చూపుతున్నారు
ఇలాంటి కలెక్టర్ను ఎప్పుడూ చూడలేదు
ప్రొద్దుటూరు: నేటి సమకాలీన రాజకీయ పరిమణాలు దృష్ట్యా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని లేకపోతే రాయలసీమ జిల్లాలకు మనుగడ ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఆదివారం ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతం పైన వివక్ష చూపడం దారుణమన్నారు. రాయలసీమ పరిధిలోనే సీఎం చంద్రబాబు, విపక్షనేత జగన్ ఉన్నప్పుడు ఆమేరకు అభివృద్ధి జరగలేదని విచారం వ్యక్తం చేశారు.
పరిశ్రమలు, బ్రహ్మణి ఉక్కు కర్మాగారం, ఉపాధి, తదితర మెరుగైన అవకాశాలు లేకపోవడం ఆందోళనకరమని చెప్పారు. వెనకబడిన రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, వివక్షపై చట్టసభల్లో గళమెత్తే ప్రజాప్రతినిధుల లేకపోవడం బాధాకరమని తెలిపారు.
చంద్రబాబు పాలనంటే సమర్థంగా ఉంటుందనే తన వ్యక్తిగత అభిప్రాయానికి భిన్నంగా నేడు అస్తవ్యస్తంగా ఉంటోందని విచారం వ్యక్తం చేశారు.
తన ముప్పై ఐదు ఎల్ల రాజకీయ జీవితమ్లో కడప జిల్లా కలెక్టర్ రమణ లాంటి కలెక్టర్ ను ఎప్పుడూ చూడలేదన్నారు. కలెక్టర్ పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ దుయ్యబట్టారు.
ఆయా అనుకూలంగా ఉంటున్న పత్రికలను చదివేందుకు ఇష్టపడలేక ఆంగ్ల పత్రికలే చదువుతున్నట్లు డీఎల్ వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదని, అదే పార్టీలో ఉంటున్నట్లు గుర్తు చేశారు.