![విపక్ష నేత సీమ గురించి మాట్లాడారోచ్!](https://kadapa.info/wp-content/uploads/2015/04/jagan_kurnool.jpg)
కర్నూలు జిల్లాలో సాగునీటి పథకాలను పరిశీలిస్తున్న విపక్షనేత జగన్
విపక్ష నేత సీమ గురించి మాట్లాడారోచ్!
కడప: విపక్ష నేతగా ఎన్నికైన చాన్నాళ్ళ తర్వాత మొదటి సారిగా విపక్షనేత వైఎస్ జగన్ రాయలసీమకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడారు.రాజధాని ప్రకటన సమయంలో కానీ, సీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయంలో కానీ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించని జగన్ ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలోని బనుకచర్ల నీటి మళ్ళింపు పథకం పనులను పరిశీలించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ సీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గాలేరు నగరి ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపానపోలేదని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి, పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు ఎక్కువ కోట్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని, లంచాలు తీసుకుని, రైతులకు అన్యాయం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు 44 వేల క్యూసెక్కుల నీరు రావాల్సివుండగా, 3 నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల చంద్రబాబుకు 300 కోట్ల రూపాయల ముడుపులు అందాయని విమర్శించారు. పట్టిసీమ ఉత్తర్వులో సీమ గురించి ప్రస్తావన లేదని జగన్ గుర్తు చేశారు.
వైఎస్ జగన్ అంతకుముందు శ్రీశైలం కుడి కాలువ పనుల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. గండికోట జలాశయానికి 30 టీఎంసీల నీరు ఎలా తెప్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఏడాది గండికోటకు ఎన్ని టీఎంసీల నీరు అందించగలిగారని ఇంజీనీర్లను అడిగారు. ఈ ఏడాది గండికోటకు కేవలం ఒక టీఎంసీ నీరు ఇవ్వగలిగామని ఇంజినీర్లు వివరించారు. రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ఆరా తీశారు.ప్రభుత్వం సీమ నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించిన సొమ్ముతో గండికోటకు 30 టీఎంసీల నీరు చేరుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుందని వైఎస్ జగన్ అన్నారు.
సాగునీటి పథకాలపైన చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టును తన హయాంలో బాబు గాలికొదిలేశారన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీసం నీటిమట్టం 854 అడుగులు ఉండాలని వైఎస్ హయాంలో నిర్ణయించారని కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంటేనే రాయలసీమకు నీరు అందుతుందని అలాంటిది చంద్రబాబు వచ్చాక శ్రీశైలం నీటిమట్టాన్ని 803 అడుగులకు తగ్గించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారన్నారు. బాబు గారి నిర్వాకం కారణంగా శ్రీశైలం నిండినా సీమకు మాత్రం నీళ్లు రావడం లేదన్నారు. హంద్రీనీవాకు 40 టీఎంసీలు ఎందుకు.. 5 టీఎంసీలు చాలని జీవో ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మరో రూ. 1100 కోట్లు కేటాయిస్తే హంద్రీనీవా పూర్తవతుంది కానీ బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని అలాగే గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2600 కోట్లు కావాల్సివుండగా, 169 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.