‘సాక్షి’ బ్యాంకు ఖాతాలు తెరవండి

సిబిఐ స్తంభింపచేసిన సాక్షి మీడియా సంస్థల బ్యాంకు ఖాతాలను తెరవాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే కొన్ని షరతులు విధిస్తూ ఈ సడలింపునిచ్చింది. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్‌ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి చంద్రకుమార్‌ బుధవారం వెకేషన్‌ కోర్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తూ ఇటీవల సిబిఐ ఉత్తర్వులిచ్చిన విషయం విదితమే.

బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడాన్ని సవాల్‌ చేస్తూ సాక్షి యాజమాన్యం సిబిఐ కోర్టును ఆశ్రయించగా స్తంభనను తొలగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సాక్షి మీడియా దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్‌ చంద్రకుమార్‌ షరతులతో కూడిన ఉత్తర్వులిచ్చారు. బ్యాంకు ఖాతాలోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముట్టరాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సిబ్బంది వేతనాలు, ఇతరత్రా రోజువారీ చెల్లింపులను చెక్కుల రూపంలో మాత్రమే చెలించాలని షరతు విధించారు. లావాదేవీలకు సంబంధించిన రోజువారీ వివరాలను ప్రతి నెలా పదో తేదీలోగా సిబిఐకి సమర్పించాలని ఆదే శించారు. బ్యాంకు ఖాతాల బదిలీలు, నిధుల మళ్ళింపు జరపరాదని ఆదేశించారు. బ్యాంకు ఖాతాల స్తంభనకు సంబంధించిన సిబిఐ నోటీసులను హైకోర్టు కొట్టివేసింది.

చదవండి :  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9 రాసేవి, చూపేవే వార్తలా? - జగన్

బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ సిబిఐ నిర్ణయం తీసుకోవడానికి సహేతుక కారణాలు కన్పించడంలేదని కోర్టు అభిప్రాయపడింది. వేలాదిమంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా బ్యాంకు ఖాతాల స్తంభనను కోర్టు సమర్థించజాలదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: