
గ్రామోత్సవంలో భాగంగా దేవుని కడప వీధులలో ఊరేగుతున్న శ్రీవారు
శేషవాహనంపైన కడపరాయడు
దేవుని కడప: కడప రాయడు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా సాగినాయి. భక్తుల గోవింద నామస్మరణలతో దేవుని కడప మార్మోగింది. ఉత్సవాలలో భాగంగా ఉదయం తిరుచ్చి గ్రామోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమాలను నిర్వహించినారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారు శేషవాహనం పైన దేవిని కడప వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చినారు.
ఉదయం తితిదే తిరుచానూరు నుంచి వచ్చిన వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి అభిషేకోత్సవం నిర్వహించినారు. దివ్య అలంకార శోభితులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని పురవీధులలో ఊరేగించినారు. దేవేరులతో కూడి కడపరాయడు భక్తులకు దర్శనమిచ్చినారు.
వేదపండితులు ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించి నిగమాగమ పద్ధతిలో సకల దేవతాహ్వానం చేశారు. దేవీతాళం నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు భక్తులకు స్వామివారి ప్రసాదాలను అందించారు.
పెద్ద శేషవాహనంపై శ్రీవారు
సాయంత్రం శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతుడైన కడపరాయడు ఆదిశేషుని ఊరేగి దేవుని కడప వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. పీలేరుకు చెందిన సప్తగిరి నాట్య కళామండలి బృందం సంప్రదాయ నృత్యాలతో స్వామికి స్వాగతం పలికారు.
బుధవారం నాటి ఉత్సవాలలో తితిదే జేఈవో భాస్కర్, జిల్లా సంయుక్త పాలనాధికారి రామారావు, డిప్యూటీ ఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.