ఇడుపులపాయ: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రలు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు అధికారాన్ని తెచ్చిపెట్టిన దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు చూస్తుంటే బాధ కలుగుతోందని.. వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిలపై సీబీఐ దాడులు జరిపే కుట్రకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని నిప్పులు చెరిగారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు స్వయానా బావ అయిన సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ లంచగొండి అని ఆరోపించారు.
‘‘లంచాలు తీసుకుని దర్యాప్తులు చేసే ఇలాంటి అధికారులు ఎవరిని ఇరికించాలంటే వారిని ఇరికిస్తారు.. కాపాడాలనుకునే వారిని కాపాడతారు’’ అని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వివేకానందరెడ్డి పులివెందుల నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేశారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో వైఎస్‌ఆర్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగుతున్న కుట్రలను ఎండగట్టారు.
‘ప్రజల దేవుడి’పై విమర్శలా?:
వైఎస్‌ను రాష్ట్రంలో ప్రజలు దేవుడిలా ఆరాధిస్తున్నారని.. అలాంటి మహానాయకుడిని విమర్శించటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోరు ఎలా వస్తుందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోని కొందరు కుట్ర పన్ని సీబీఐ దర్యాప్తు పేరుతో వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చటాన్ని.. ఆ మహానేతపై అభిమానం ఉన్న తమ లాంటి వారు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. వైఎస్‌ను దొంగగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే.. ఆ పార్టీలో తాను కొనసాగబోనన్నారు. వైఎస్‌పై అభిమానం ఉన్న ఎమ్మెల్యేలు దాదాపు 70 మంది ఉన్నారని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ ఎమ్మెల్యేలను కూడగట్టి తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఆ 150 మంది ఎలా గెలిచినట్లు?:
వైఎస్ వల్ల ఎమ్మెల్యేలు గెలిచారంటే.. ఓడిపోయిన వారి పరిస్థితి ఏమిటని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించటం దారుణమన్నారు. ‘‘వైఎస్ బొమ్మ పెట్టుకుని పోటీచేసిన వారిలో 150 మంది ఓడిపోయారంటే.. గెలిచిన మరో 150 మంది ఎమ్మెల్యేలూ వైఎస్ బొమ్మతో గెలిచినట్లు కాదా?’’ అన్నారు.
గుణపాఠం చెప్పాల్సి వస్తుంది: సీబీఐ కేసుల విషయంలో జగన్ లక్ష కోట్లు సంపాదించారనే వారు.. తాము చేసిన తప్పులను పునరాలోచించుకోవాలని హితవు పలికారు. జగన్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, వైఎస్‌ను మాత్రం అప్రతిష్టపాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని వివేకా వ్యాఖ్యానించారు.
ఇడుపులపాయకు పాదయాత్ర:
వైఎస్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని వివేకా పులివెందులలోని రంగాపురం నుంచి ఇడుపులపాయవరకు పాదయాత్ర నిర్వహించారు. చిన్నరంగాపురంలో మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం వినాయక ఉత్సవ మండపంలో పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు. వేంపల్లి పంచాయతీ రాజీవ్‌నగర్ కాలనీ వద్ద వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. స్థానిక కందుల ఐటీఐలో కొద్దిసేపు సేద తీరారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని పాదయాత్ర మొదలుపెట్టారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తాళ్లపల్లె సమీపంలో వైఎస్ తల్లి సమాధి వద్ద నివాళులర్పించి పులివెందులకు వెళుతున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి.. పాదయాత్ర చేస్తున్న చిన్నాన్న వివేకాను చూసి వాహనాన్ని ఆపి ఆయనను కలిసి మాట్లాడారు.
ఇన్నాళ్లూ సౌమ్యుడిగా పేరు పడ్డ వివేకా తీవ్రస్థాయిలో విరుచుకుపడడం ద్వారా వై.ఎస్ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా!!