కడప విమానాశ్రయం ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రకటించి చివర్లో ఆ కార్యక్రమం వాయిదా పడినట్లు మీడియాకు లీకులిచ్చారు. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా అధికారులు ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు.
ఎయిర్‌పోర్టులో రన్‌వే 8 సీటర్ విమానం దిగేందుకు అవసరమైన స్థాయిలోనే నిర్మించారని అందువల్లే విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడిందని ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వచ్చాయి. వెంటనే మంత్రి కిశోర్ బాబు మరో మూడు నెలలలో విమానాశ్రయ అభివృద్ది పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం అని ప్రకటించేశారు కూడా.
ఇదే విషయమై కడప విమానాశ్రయ డైరెక్టర్ ను www.www.kadapa.info సంప్రదిస్తే… విమానాశ్రయం రన్ వే లో ఎటువంటి లోపాలూ లేవని, అభివృద్ది పనులు కూడా పెండింగ్ లో లేవని వివరించారు.
కేవలం ప్రారంభోత్సవ తేదీని వాయిదా వేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకే వాయిదా వేశామని స్పష్టం చేశారు. వాయిదా వెనుక గల కారణాలు తెలియదన్నారు. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందిన తర్వాత మరోసారి ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ పెద్దలు కడప విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని ఏఎఐ అధికారులను కోరడంతోనే ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
కొసమెరుపు ఏమిటంటే ప్రారంభోత్సవం వాయిదా పడ్డ తర్వాత అక్టోబర్ 15న కడప విమానాశ్రయ గోడలకు బొమ్మలు వేసేదానికి మాత్రం టెండర్లు ఆహ్వానించారు. ఈ పని విమానాశ్రయ ప్రారంభం లేదా నిర్వహణ ఆపడానికి సహేతుకమైన కారణంగా కనిపించదు!
ఇలాంటి చర్యలు కడప జిల్లా విషయంలో ప్రభుత్వం కక్ష కట్టింది అని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తాయి. దీనిని సవరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిద్దాం!