రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ చిరునామా గల్లంతవుతున్న నేపథ్యంలో గౌరవమైన రాజకీయ ప్రస్థానం కోసం మళ్లీ తెదేపాలోకి వచ్చినట్లు వరదరాజులురెడ్డి చెబుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణం వసంతపేటలోని బుశెట్టి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన తెదేపా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి హాజరైన లింగారెడ్డి మాట్లాడుతూ.. సుస్థిరశాంతి, అభివృద్ధి కోసం చేతులు కలిపితే మా కలియిక అపవిత్రమైందంటూ రాజకీయ లబ్ధి కోసం రాచమల్లు ప్రసాద్‌రెడ్డి గొంతుచించుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఎన్నికలు పూర్తికాగానే వైకాపా అదృశ్యం కాకతప్పదన్నారు. సమైక్యాంధ్ర విభజనలో అవకాశవాదిగా వ్యవహరించిన జగన్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
సమైక్యాంధ్ర కోసం తమ అధినేత చంద్రబాబు చివరి వరకు జాతీయస్థాయిలో సర్వశక్తులను ధారపోసినా ఫలితం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి వర్గీయులతో కలిసి ఇరుపక్షాల నుంచి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను పోటీలోకి దించుతామన్నారు.
మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి చంద్రబాబు అధికారంలోకి వస్తేనే సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
ఇంతకీ వరదరాజులురెడ్డి గౌరవమైన రాజకీయ ప్రస్థానం కోసమే తెదేపాలోకి వచ్చారా?