
రూకలై మాడలై రువ్వలై తిరిగీని – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ రూకలై మాడలై రువ్వలై తిరిగీని దాకొని వున్నచోటఁ దానుండ దదివో ॥చ1॥ వొకరి రాజుఁజేసు నొకరి బంటుగఁ జేసు వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు వొకచోటనున్న ధాన్య మొకచోట వేయించు ప్రకటించి కనకమే భ్రమయించీ జగము ॥చ2॥ కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు కొందరికి పుణ్యులఁజేసుఁ గొందరి పాపులఁజేసు కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు పందెమాడినటువలెఁ బచరించు పసిఁడీ ॥చ3॥ నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు తగిలి శ్రీవేంకటేశు తరుణియై తా నుండు తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు నగుతా మాపాల నుండి నటియించు బసిఁడీ |
రాగము: గుండక్రియ రేకు: 0092-06 సంపుటము: 1-458 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ