గురువారం , 21 నవంబర్ 2024

రాతిలో తేమ (కథ) – శశిశ్రీ

మా జిల్లాల్లో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే ముని లక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి. పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు. కానీ అదేం జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు.

అసలు చూడ్డానికి కూడా ఆఫ్రికా అడవి దున్నపోతులా ఉంటాడు. ఆరు అడుగుల ఎత్తు. తెల్ల ఖద్దరు డ్రస్సు. కనుబొమలు, చేతులపై సుడులు తిరిగిన వెంట్రుకలతో నల్లగా జడుసుకునేటట్లు ఉంటాడు. దానికి తోడు మొహం నిండా స్ఫోటకపు మచ్చలు. పోని మాట అయినా మంచిగా ఉంటుందా అంటే అదీ లేదు. నోరు తెరిస్తే చాలు మొరటు మాటలు, తిట్లు. నిత్యం కోపిష్టి మొహం.

ఆయన చుట్టూ చేరే తెల్ల పంచెలోళ్లు ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీలో కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారు. అలాంటి ఒక పంచాయితీలోనే సెంటర్‌లో ఉండే పాత సినిమా హాలు, దానిముందు కాంప్లెక్సు బలవంతంగా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆ సినిమా హాల్లో ఇప్పుడు సినిమాలు ఆడటంలేదు. సినిమాల్లో విలన్ డెన్ ఉంటుందే ఆ విధంగా మార్చేసుకున్నాడు. అతని అన్ని దుష్టకార్యకలాపాలకు అదే స్థావరం.

sasisreeకడపకు చెందిన కథకుడు షేక్‌ బేపారి రహమతుల్లా – శశిశ్రీగా సుపరిచితులు. అది ఆయన కలం పేరు. సిద్ధవటంలో జన్మించిన శశిశ్రీ ఈనాటి పాఠకులకు సామాజిక అవగాహనను కలిగిస్తూ భవిష్యత్తు మార్గపు గమ్యాన్ని నిర్ధేశించడానికి తోడ్పడే కథలను అందించారు. తెలుగు వారి సామాజిక జీవిత చిత్రణ కథలతో పాటు, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కథలను కూడా రచించారు. మానవ సంబంధాలను అభ్యుదయ దృష్టితో శశిశ్రీ చెప్పిన తీరు మెచ్చుకోదగినది. పల్లవి, శబ్దానికి స్వాగతం, జేబులో సూర్యుడు, కాలాంతవేళ, సీమగీతం, దహీజ్‌, మనకు తెలియని కడప, ట్యూన్స్‌ ఆఫ్‌ లైఫ్‌, ఇనాం, ఇజ్జత్‌ మొదలైనవి వీరి రచనలలో కొన్ని. కవి, రచయిత, వక్త,పాత్రికేయుడు మరియు రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష వర్గ సభ్యుడూ అయిన శశిశ్రీ  2012లో చాసో స్ఫూర్తి పురస్కారాన్ని  అందుకున్నారు.

అటు రాజకీయ నాయకుల్లో – ఇటు పోలీసోళ్లలో కూడా పలుకుబడి పెంచుకున్నాడు. క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయ్యాడు. అతను కాంట్రాక్ట్ ఏది తీసుకున్నా కోటి రూపాయల ఎస్టిమేషన్‌ని రెండు కోట్లుగా ముందే వేయించాస్తాడు. టెండర్లు ఎవర్నీ వేయనివ్వడు. అంతా తన గ్యాంగ్‌లోని వాళ్లతోనే వేయిస్తాడు. పని తనకే దక్కించుకుంటాడు. అది తన రౌడీయిజానికి ఉన్న కత్తి కరకు పదును.

ఇంతగా బరితెగించినాడు కాబట్టే అయిదేళ్లలో కోట్లకు ఆసామి అయి కూర్చున్నాడు. పదికి పైన సుమోలు ఉన్నాయి. వాళ్ల ఊరి వాళ్లు చెప్తారు లంకంత ఇల్లు ఉందని, వంద ఎకరాలకు పైగా భూమి ఉందని, నాలుగు ట్రాక్టర్లు, ముప్పయ్ నలభై మంది సేద్యగాళ్లు ఉన్నారని. ఈ మునిరత్నం అనే రాక్షసుని గురించి ఇంతగా చెప్పాల్సి వచ్చిందంటే కారణం ఈ రోజు పదిగంటలకంతా నన్ను తన స్థావరానికి రమ్మని ఫోను చేసి పిలవడమే. సుమో బండి కూడా పంపినాడు. ఎవరు మాత్రం చూస్తూ పులిబోనులోకి పోతారు? కాని పోకపోతే ఆ ఆలోచనే ప్రమాదం అవుతుంది. పోతే – అదీ ప్రమాదమే!

పోకుండా మునిరత్నం కోపానికి బలయ్యేదానికంటే, పిలవంగానే వచ్చాడన్న సానుభూతి అయినా ఉంటుంది. కానీ సానుభూతి… ఆ రాతిగుండెలోనా!? ఏమో… అప్పుడెప్పుడో పేర్లో రాతిలో కప్ప దాగి ఉండిందని వింత వార్త ఒకటి వెలువడింది. ఆ విధంగా ఉండవచ్చననుకుని, బయల్దేరాను సుమోలో.

నేను ఊహించినట్లే అదే స్థావరం. ఆ తెల్లపంచల మొరటు మనుష్యుల మధ్య కూర్చుని ఏదో పను పురమాయిస్తూ ఉన్నాడు మునిరత్నం. అతని ముందు వినాయకుని ముందు ఎలుకలా నుంచొని చేతులు జోడించి దండం పెట్టినాను.

“ఏం నేను పిలవంగానే అదిరిపడినావా?” అని నా మొహంలోకి చూస్తూ అడిగాడు. ఇదా పిలిచిన మనిషితో సంభాషణ ప్రారంభించే తీరు? కొంచమైనా సంస్కారం లేని విషముష్టి కొయ్య ఈ వెధవ అని కసిగా మనసులో అనుకున్నాను. కానీ పైకి మాత్రం “అబ్బే! అదేం లేదు సార్” అన్నాను. ఈ మనిషిని సార్ అని పిలవాల్సి వచ్చింది కదా అని లోలోపల కుమిలిపోతూ.

చదవండి :  ఈ రోజు రాచపాలెం అభినందన సభ

“సర్లే…ఒరే కొడకా! అవతల మనిషి వస్తే లేచి కుర్చీ ఇచ్చేది తెలియదేంరా పసరం” అన్నాడు తన పక్కన కుర్చొని ఉన్న తెల్లపంచ నడివయసు మనిషితో.

ఆ మాట అన్నాడో లేదో అతను ఒక్క ఉదుటన లేచి కుర్చీ ఖాళీ చేసి దూరం పోయాడు.

“ఇంగ కూర్చో సారు” అన్నాడు.

నన్ను కూడా ఒరే, తొరే… కొడకా అని తిట్టివుంటే ఏం చేద్దును? ఇప్పటికి ఇంత మాత్రం మాట సుఖం దొరకడమే నా భాగ్యం అనుకున్నాను. ఐతే లోపల పింయో పింయో అంటూనే ఉంది. కుర్చీలో కూర్చోబెట్టించి మాట్లాడబోతున్నాడంటే విషయం చాలా సీరియస్సే అయి ఉంటుంది. అయినా బయట పడకుండా నా మొహంలో వినయం ఎంతమాత్రం తగ్గకుండ ప్రదర్శిస్తూనే ఉన్నాను.

“కాఫీ ఏమైనా తాగుతావా సారూ…రేయ్! కాఫీ తేండ్రా!”

కాఫీ కూడా తెప్పిస్తున్నాడంట్ భయం పాలు తగ్గి, సంతోషం మనసులో పై చెయ్యి చేసుకుంటోంది. పిలిచిన సంగతి ఏదో త్వరగా చెప్పేస్తే నా మానాన నేను వెళ్లిపోతా కదా.

ఎక్కడ వీలుచిక్కుతోంది? ఒక సెల్‌ఫోను మాట్లాడి ఇస్తే, ఇంకొకరు లైన్లో ఉన్నారని మరో సెల్‌ఫోన్ చేతి కందిస్తున్నారు. ఎవరెవరో మాట్లాడుతున్నారు. అందరికీ తేదీలు, టైంలు చెప్తున్నాడు. తేదీలు టైంలు రోగులకోసం పెద్ద డాక్టర్లు…కక్షిదార్ల కోసం వకీళ్లు చెప్తుంటారు. ఈ గ్యాంగు లీడరు పంచాయితీలకోసం చెప్తున్నాడు.

కాఫీ వచ్చింది. తాగి, కప్పు కుర్చీ కింద పెట్టి, “పిలిచిన పని చెప్తారా” అన్నట్లు మునిరత్నం మొహంలోకి చూశాను.

నా మొహంలోకి అదోలా చూసి ఓ నావులాంటిది నవ్వి…”రేయ్ బండి తీండి. పోదాం దా సారు” అన్నాడు లేస్తూ.

“టైం ఎక్కువ పట్టేటట్లయితే మా ఇంటికి ఫోన్ చేస్తాను” అన్నాను నన్ను ఎక్కడికైనా దూర తీసుకెళ్తున్నాడేమో నన్న అనుమానం కొద్దీ.

“టౌన్లోనేలే సారు! ఎర్రముక్కపల్లెలోని మా ఇంటి దాకా పోయి వచ్చేద్దాం పోదాం పా” అన్నాడు. అబ్బ! ఫర్లేదు అనుకుని “దానిదేముంది వెళ్లొస్తాం లేండి సార్” అన్నాను వినయంగా.

ఇంతకూ నన్ను పిలిపించిన సంగతి ఏమిటో ఎంతగా ఆలోచించినా అంతు పట్టడం లేదు.

సుమో ఏడు రోడ్ల కూడలి నుంచి ఎన్.టి.ఆర్.సర్కిల్, సాయిబాబా హాలు, కోటిరెడ్డి విగ్రహం దిశగా పోతోంది. ముందు సీటులో గన్‌మాన్ కూర్చున్నాడు. వెనుక ముగ్గురు తెల్లపంచ అంగరక్షకులు.

“మీకు ఊర్లో అంతపెద్ద యిల్లు ఉంది కదా. మరి ఈ ఎర్రముక్కపల్లెలో ఉండటం ఎందుకు?” అనుమానంగా అయినా ధైర్యంగా అడిగేశాను.

“ఊర్లో ఇల్లు ఉంటేనే కదా మన ఉనికి. ఇక్కడంటావా… నీకు తెలియంది ఏముంది జర్నలిస్టూ…ఫ్యాక్షన్‌లు ఉండేవాళ్లకు ఊర్లో కంటే ఈ టౌన్లోనే మేలు! ఎవడి బతుకులు వాళ్లు బతుకుతుంటారు. పల్లెల్లో పక్కవాని బతుకుల్లో తొంగిచూడటమే పని కదూ” మునిరత్నం ఆసక్తికరమైన నిజాలు చెప్పాడు.

నేను ఏదో అడగబోయి మరేదో అడిగేశాను. అసలు నన్ను ఎందుకు ఏ పనికోసం పిలిపించినాడో అడగాలి కదా అని గుర్తొచ్చింది.

“ఇంతకూ నన్ను మీరు పిలిపించిన సంగతి చెప్పలేదు ఇంకా” అని వినయంగా ప్రశ్నించాను.

“చిన్నపనేలే సారూ, కంగారు పడబోకు. నీకు చేతనయిన పనే చెప్తాను కదా. బాగా ఆలోచించే నిన్ను ఎంచుకున్నాను” జవాబు చెప్పాడే కానీ పని ఏమిటో ఇంకా చెప్పలేదు మునిరత్నం. టెన్షన్ కొంచెం తగ్గింది కానీ ఆ పని ఏమిటో? తలకు చుట్టుకునేది కాకుంటే చాలు. అసలు ఈ ఫ్యాక్షన్‌లు ఉండేవాళ్లతో పరిచయాలే పెట్టుకోకూడదు. ఏం చేద్దును. విలేఖరి బతుకు అయినప్పుడు ఇలాంటోళ్లతో కూడా తప్పదు నాలుగు వార్తలు తెలుసుకోవాలంటే.

సుమో పోతూ ఉంది. సెల్‌ఫోన్ రింగైంది. అవతల గొంతు వినవస్తూనే తిట్ల పురాణం ఎత్తుకున్నాడు మునిరత్నం.

చదవండి :  రాయలసీమ సాంస్కృతిక రాయబారి

ఎదురుగా రోడ్డు మీద అడ్డంగా పరుగెత్తిన స్కూలు పిల్లోని కొట్టబోయి…సడన్ బ్రేకు వేసినాడు డ్రైవరు. మాట్లాడుతున్న సెల్‌ఫోను పక్కకు తీసి – “ఏరా కొడకా? రాత్రి కైపు ఇంకా దిగలేదా. చూసి తోలు. కొంచెం ఉంటే అన్యాయంగా న్యాదర పిల్లోడ్ని చంపివుందువే” అన్నాడు మునిరత్నం డ్రైవర్ని తనదైన శైలిలో మందలిస్తూ.

డ్రైవరు నోరు విప్పలేదు. తప్పు తనది కాదని రోడ్డుకు అడ్డంగా దౌడు తీసిన పిల్లోనిదే అని చెప్పలేక పోయాడు. ఇలాంటి యజమానుల దగ్గర ఎప్పుడు ఎలా మసులు కోవాల్నో బాగా తెలిసిన ముదురు రకం డ్రైవరు ఉన్నట్టున్నాడు.

డ్రైవరు అంటే నాకు మా బావమరిది రమేష్ గుర్తుకొచ్చినాడు. టాక్సీ స్టాండులో నెల రోజులుగా పని దొరక్క ఉండానని ఎక్కడన్నా కుదర్చమని కోరినాడు. ఈ మునిరత్నం దగ్గర ఏదో ఒక బండికి ఎక్కిద్దామనుకుని – అదే విషయం చెప్పివుంటిని వాన్తో. దానికి మా బావమరిది “వొద్దులే బావా! బతికుంటే బలుసాకు తిని ఉంటా కానీ, పోయి పోయి మునిరత్నం దగ్గర ఎక్కడ చేరేది. నేనే ఒక దోవ చూసుకుంటాలే” అన్నాడు.

“ఎందుకు అంత భయం” అంటే “డ్రైవరుగా పని చేయక పోవడానికి నా కేమైనా మదమా! ఈ ఫ్యాక్షన్ లీడర్లపై అపోజిషనోళ్లు ఎప్పుడు బాంబులేస్తారో ఎవరికి తెలుసు. బండి ఆపాలని – ముందుగా డ్రైవరుపైనే వేస్తారు. లీడర్ కంటే ముందుగా చచ్చేది డ్రైవరే బావా! అందుకే బావా! నాకు వాళ్లతో ఎందుకు” అన్నాడు.

నిజమే! ఈ ఫ్యాక్షన్ లీడర్లు ఏదో ఒకరోజు పోస్టుమార్టమ్ టేబుల్ ఎక్కాల్సిన వాళ్లే.

ఆలోచిస్తుండేలోగా ఎర్రముక్కపల్లెలో పెద్ద బంగళాముందు ఆగింది సుమో.

సువిశాలంగా ఉన్న ఆ బంగళా ఆవరణలో ఒకవైపు ఆరు సుమోలు నుంచున్నాయ్. కాంపౌండు గోడ దగ్గర బియ్యం మూటలు, బోకుల గుట్టలు, కొత్త బట్టల మూటలు ఇంకా ఎవేవో సరుకులున్నాయ్.

ఎవరిదో పంచాయితీ చేసి డబ్బులు కట్టకపోతే మొత్తం ఆ అంగళ్ల తాలూకు సామాన్లంతా తన యింటికి తోలించుకొన్నాడేమో అనిపించింది.

సుమో దిగి ఇంట్లోకి పోయాం. వంటగదిలోకి రమ్మని తీసుకెళ్లాడు. పాతాళ భైరవి సినిమాలో నేపాళ మాంత్రికుని వెంట వెళ్తున్న తోటరాముడిలా ఉంది నా పరిస్థితి.

టిఫిన్ చేసివచ్చానని చెప్పినా విన్లా. మునిరత్నం భార్య రామలక్షుమ్మ వడ్డించింది.

వడ్డించేటప్పుడు “మన సుబ్బారాయుడు సారు తెల్సు కదా” అని పరిచయం చేశాడు భార్యకి.

“ఈ అన్న తెలియకేం. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మన వూరికొచ్చి యింటర్వ్యూ కూడా చేసిండు కదా” అందామె. రామలక్షుమ్మ జ్ఞాపకం గట్టిదనుకున్నాను.

మునిరత్నం ఈ మధ్యనే ఎలక్షన్లో ఓడిపోయాడు. డబ్బు, మందు దిక్కులేకుండా చేసినాడు కానీ ఓటర్ల మనోగతం వేరుగా ఉండింది. పాతకాలంలో పల్లెల్లో కానీ పట్నాల్లో కానీ ఒక అభ్యర్థి దగ్గర డబ్బు తీసుకుంటే అతనికే కట్టుబడి ఉండి ఓట్లు వేసేవాళ్లు. ఇప్పుడు ఓటర్లూ ఆరితేరినారు. ఎంతమంది డబ్బులిచ్చినా తీసుకుంటారు. కానీ పోలింగ్ రోజున బూతులోకి పోయి ఎవరికి ఓటు వేస్తారో అంతుచిక్కదు. అసెంబ్లీలో “అధ్యక్షా నేను చెప్పేదేమంటే…” అని అన్న మాట్లాడుతుంటే టీవీల్లో చూస్తాం అనుకున్నారు మునిరత్నం గ్రూపువాళ్లు. వాళ్లే కాదు మా ప్రెస్సు వాళ్లం కూడా గట్టిగా గెలిచే క్యాండిడేటు మునిరత్నమే అనుకున్నాం. కానీ ఓటర్లు చావుదెబ్బ కొట్టి యిడిసినారు.

నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ రామలక్షుమ్మ “ఏందో అన్నా! పోయిన సంక్రాంతికాడ్నించి మా కుటుంబానికి అన్నీ సీద్రాలే పట్టుకున్నాయి. చెట్టంత మా మరిది నిద్రపోయినోడు తెల్లారితలికే పీనిగై కనిపించినాడు. ఈ ఎలక్షన్లో డబ్బులు పోయిందిగాంక పరువూ పోయింది. షుగరూ, బీపీ తెచ్చుకున్నాడు ఈయన. ఇసుక కాంట్రాక్టు పోయింది. సారాయి కాంట్రాక్టూ పోగొట్టుకున్నాం. డబ్బులు పోయిందానికేం బాధలేదు కానీ రోజు రోజుకీ మర్యాద తగ్గిపోతుండాది, ఏదో పీడ మమ్మల్ని పట్టి పీడిస్తాంది.”

చదవండి :  దాపుడు కోక (కథ) - డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

ఆమె తన బాధలు ఏకరువు పెడ్తుంటే మధ్యలోనే మునిరత్నం ఆపేసినాడు.

“సర్లేయే! ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. సుబ్బారాయుడు సారో! నిన్ను పిలవనంపడానికి కారణం ఉంది. నేను ఎన్నో పంచాయితీలు చేసినాను. నా పంచాయితీల్లో బాగుపడిన వాళ్లు కొందరు ఉంటే బాధ పడినవాళ్లు, నష్టపోయినోళ్లు చాలామందే ఉండారు. నా గ్రూపువాళ్లు నన్ను యిడ్సిపోకూడదని తెచ్చిన పంచాయితీల్నంతా నెత్తినేసుకుని చేసినాను. ఎవరి ఉసురు తగిలిందో, గోరుచుట్టుపై రోకలి దెబ్బలే అన్నీ. ఈ మధ్యన నీలకంఠరావు పేట సామిని అడిగి చూస్తిని. పెద్ద దర్గాలో హజరతయ్యని కూడా అడిగి చూస్తిని. అంతా నా కుటుంబానికి పాపం చుట్టుకుందని కరాఖండిగా తేల్చి చెప్పినారు” అని నేనేం చెప్తానోనని నాకేసి చూశాడు.

‘పాపం చుట్టుకుంది’ అనేది నేనూ నమ్ముతాను అని చెప్పాలనుకున్నాను. కానీ ధైర్యం చాల్లేదు. ఏ భావం లేకుండా మాజీ ప్రధాని పి.వి.నరసింహారవు మొహం పెట్టినాను.

“ఇప్పుడు పాప ప్రక్షళన కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాం. ఊర్లో సాయిబాబా గుడి ఎప్పుడో కట్టేసినాను. అంతకుముందే సాయిబులకోసం స్మశానానికి అయిదెకరాల భూమి రాపించినాను. మనసుకు అవేవీ శాంతి యివ్వడం లేదు. బాగా ఆలోచించే నేనూ మా ఇంటామే ఒక నిర్ణయానికొచ్చినాం. మావల్ల బాగుపడిన వాళ్ల సంగతి పక్కన బెట్తే – బాధ పడిన వాళ్ల గురించి ఆలోచిస్తూ సాయంకానీ, యింగొకటి కానీ చేస్తే గిస్తే సాటి మనుషులకే చేయాలని అనుకున్నాం.

ఇదో ఈ మధ్య వరదల్లో దిక్కులేకుండా పోయిన జనానికేమైనా చేస్తేనన్నా పాపప్రక్షాళన జరిగుతుందని మా భావన. అందుకోసం ఇరవై లచ్చలు ఖర్చు పెట్టాలనుకున్నా. మంచి ఆలోచనే చేసినాం అంటావా సారూ?” అని గ్లాసుతో నీరు తాగినాడు మునిరత్నం.

పాప ప్రక్షాళన నిజంగా జరుగుతుందో లేదో ఎవరూ చెప్పలేరు కానీ, అదొక మానసిక ఊరట. జీవితంపై కొత్త నమ్మకం కలిగిస్తుంది అని మనసులో అనుకున్నాను. పైకి మాత్రం “ఓ…దివ్యమైన ఆలోచన మీది. మానవసేవే మాధవ సేవ అని కదా పెద్దలు అంటారు. కానీ ఈ మధ్యనే వ్యాపారాలు పోయి, ఎలెక్షన్లలో ఓడిపోయి కోట్లు పోగొట్టుకున్నారు కదా మీరు. ఈ కష్టంలో ఇప్పుడు ఈ ఖర్చు పెట్టాలనుకోవడం సాహసమేననుకుంటాను” మునిరత్నంపై సానుభూతిని ప్రకటించే అవకాశం దొరికింది కదా అని అలా చెప్పాను.

“పాపంతో వచ్చింది పాపంతోనే పోయింది అనుకుంటాం గానీ ఈ 20లక్షలు ఖర్చుమాత్రం మంచికోసం పెడ్తుండాం అనుకొంటాంలే అన్నా!” అందామె ప్రశాంతంగా. అలా అంటున్నప్పుడు ఆమె కళ్లలో మెరుపులాంటి తేజం కనిపించింది.

“చూడు సుబ్బారాయుడు సారూ, నీవు నీ మనుషులు కొంచెం ఓపిక చేసుకుని కుందూ వరద ప్రాంతాలకు పోయిరాండి. నిజమైన బాధితుల్ని చూడండి. ముందుగానే మనం కూపన్లు వేసి పెట్టినాం. వాటిని వాళ్లకు ఇచ్చేయ్. వాళ్లకు బియ్యం, బోకులు, బట్టలు అంతా కలిపి ప్యాకెట్లు కట్టి పెట్టాం. ఇందా ఈ పదివేల రూపాయలు పెట్టుకో” అని డబ్బుతీసి యిచ్చాడు మునిరత్నం – పిలిపించిన పని చెప్తూ.

“డబ్బు ఎందుకు సార్” అన్నాను ఏమనాలో తెలియక. “డబ్బులేకుంటే ఎట్లా? ఖర్చులు ఉంటాయి. బండి కూడా తీసుకెళ్లు. మూడు రోజుల్లో బాధితుల పట్టీ తయారుచేయ్. తర్వాత మావాళ్లు వస్తారు. వాండ్లతో పోయి ఇచ్చేసి వద్దువు. నిన్ను ఎందుకు ఎంచుకున్నానంటే మీ పత్రికలోళ్లు ఎవరు నిజంగా అవసరం మీద ఉండారో యిట్నే కనిపెడ్తారు గదా” అన్నాడు మునిరత్నం.

మునిరత్నం ఇంటి ఆవరణలో సరుకులు ఎందుకు ఆ విధంగా పేర్చిపెట్టినారో తెలిసింది ఇప్పుడు.

మునిరత్నం చెప్పిన పని కొంచెం శరీర కష్టం, కొంచెం మెదడు ఖర్చుతో కూడింది. కాని ఈ పని చేస్తే నేనేమైనా పాపం చేసివుంటే( వార్తలు రాసి నొప్పించి ఉంటాను కదా) కొంతైనా ప్రక్షాళన అవుతుందని మౌనంగా బయల్దేరాను అక్కడ్నించి.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 29, నవంబర్, 2009 సంచికలో ప్రచురితం)

ఇదీ చదవండి!

sodum govindareddy

అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు – సొదుం గోవిందరెడ్డి

సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: