
విద్యార్థుల ప్రదర్శన
రాజధాని కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
రాజధానిని సీమలో ఏర్పాటుచేయడమనేది డిమాండు కాదని, తమ హక్కు అని రాయలసీమ విద్యార్థి వేదిక నినదించింది. రాజధాని విషయం కోస్తా నాయకులు, వారికి వంత పాడుతున్న సీమ ఏలికల కుట్రలను ప్రతిఘటిస్తామని విద్యార్థులు నినదించారు. సీమ మరోసారి నష్టపోకుండా రాజధానిని ఇక్కడే ఏర్పాటుచేయాలని, లేదంటే విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రతిఘటన తప్పదని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కూడలి నుంచి కోటిరెడ్డి కూడలి వరకూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆర్ఎస్ఎఫ్ కన్వీనరు భాస్కర్, కో కన్వీనరు దస్తగిరి, విశ్వవిద్యాలయ కన్వీనరు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు హుసేన్, చైతన్య మహిళా సమాఖ్య సర్తాజ్ ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా భాస్కర్, దస్తగిరి మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు ప్రతి సారి మోసపోతున్నారన్నారు. నీటి విషయంలో, పారిశ్రామికరంగ అభివృద్ధిలో అడ్డుకున్న కోస్తా నాయకులు తమ ప్రాంతంలో మాత్రం అన్నీ సమకూర్చుకొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగాక రాయలసీమకు ఏ ఒక్క ప్రయోజనమూ కల్గించే నిర్ణయం తీసుకోలేదన్నారు. రాయలసీమ ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే ఉద్యమాల్లో ఇక్కడి ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ నగర కన్వీనరు కల్యాణ్, సభ్యులు ప్రతాప్, శ్రీహరి, లోకనాథ్, మురళీకృష్ణ, సాయికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
2 Comments
తెలుగురాష్ట్రాలలో ప్రతీదానికీ కోస్తావారిని అకారణంగా నిందించడం చాలా ఎక్కువయింది. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని పెట్టడం కేంద్రప్రభుత్వ నిర్ణయమే. అది ఆల్రెడీ జరిగిపోయింది. బహిరంగంగా ప్రకటించడం ఒకటే మిగిలింది. ఈ నిర్ణయానికి రాయలసీమ నాయకుల ఆమోదం కూడా ఉంది. అందుకు కోస్తావారిని నిందించడం సరికాదు. రాయలసీమలో Winter capital కోసం ఉద్యమించండి. కోస్తావారు కూడా మీ వెంట ఉంటారు. ఊరికే పొరుగుప్రాంతాన్ని దూషించి అందరినీ దూరం చేసుకోవద్దు. వ్యక్తులకైనా ప్రాంతాలకైనా మిత్రులవసరం. మీరు గమనించని ఒక వాస్తవమేంటంటే రాజధానిని భరించేంత వనరులు గానీ మానసిక వాతావరణం గానీ రాయలసీమలో లేవు. మన అనుభవాన్ని బట్టి రాజధాని అనేది సమైక్యానికి కంచుకోటలాంటి ప్రాంతంలో ఉండాలి. రాయలసీమ సమైక్యానికి కంచుకోట కాదు, తెలంగాణలాగే! ఉదాహరణకి- ఒక ప్రాంతాన్ని నిందిస్తూ ఇంత ఓపెన్ గా బ్యానర్లు పట్టుకుని తిరగడం లాంటి పనులు కోస్తాలో కలలో కూడా చెయ్యరు. సమైక్యం కన్నా ముందు రాయలసీమవారు ముందు నేర్చుకోవలసింది- శాంతంగా చర్చాధోరణితో మాట్లాడడం.
అయ్యా! మొహజాస్ గారు రాయలసీమ వాళ్ళు గానీ అక్కడి విద్యార్థులు కానీ ఎప్పుడూ ఇతర ప్రాంతీయులను ద్వేషించలేదు, ద్వేషించరు కూడా! ఇప్పుడు కూడా విమర్శిస్తున్నది కుహనా రాజకీయనాయకులను తప్ప, సామాన్య ప్రజను కాదు. ఇది మీరు గమనించాలి. మీలాంటి వాళ్ళు రాయలసీమకు జరిగిన ద్రోహం గురించి కూడా ఆలోచించాలి, మాట్లాడాలి. ముందుగా గత చరిత్ర గురించి, దానిలో జరిగిన కుట్రలను కూడా తెలుస్కోవాలి. అంతే తప్ప సీమ ప్రజలు ద్వేషిస్తున్నారు అనే అపోహను విడనాడండి.