శుక్రవారం , 22 నవంబర్ 2024

యీటి రంగే పచ్చనేమో సామీ! (కథ) – యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి

మాయింట్లో నువాక్రాను, మోనోక్రోటోపాసు, ఎండ్రీను డబ్బాలు శానా వుండేటియ్యి. వంకాయలు, బెండకాయలూ పండిస్తా వున్యాములే. వాఁటితోపాటు జాలాట్లో నాలుగు టమాటాచెట్లు, గెనాల మింద గోగాకు, చిన్న పెడలో మిరపజెట్లు గూడా. అప్పుడు మాయింట్లో కూరలేం జేచ్చాన్యామో మల్లా జెప్పాల్నా! నూనొంకాయ, వంకాయపులుసు, బెండకాయపులుసు, వంకాయ్ తాళింపు, బెండకాయ్ తాళింపు, వంకాయ-బెండకాయ-టమాటా పుల్లగూర, టమాటాగుజ్జు, గోగాకు ఊరిమిండి, అన్నీ కలిపికొట్టి యింగో పుల్లగూరా, యిట్ట యెన్నిజేసినా నాకు మాత్రం యిష్టంగా ముద్ద దిగేదిగాదు. అన్నిట్లో వం, బెం, టం, గోం.

యింట్లో ఎవురికీ బువ్వ మాత్రం సగించేదిగాదు. ఆ చెట్లల్లో తిరిగి, పుచ్చులు యేరేసి, పండుగాయలు పారేసి, మల్లా అయ్యే తినాలన్యా తింటారేమోగానీ, కాయలు కోసి మూటగట్టి గంపలకెత్తి, బస్సులో మనుషులకూ లగేజికీ చార్జీలు బెట్టి రాయచోటికి యేసకపొయ్యి మండీల్లో అమ్ముకోని యింటికొచ్చి లెక్కజూసుకుంటే, కూలీలు బోఁగా యాభై నష్టమని వొగరోజు, పద్నాల్రూపాయిలు లాభమని యింగోరోజు తేలేటప్పుటికి ఎవురికైనా తిండి సగిస్తాదేమో నువ్వేజెప్పు!

సీలకూర తినాలని గెట్టిగా అనిపిచ్చింది. మా నాయన, పండ్లు ల్యాకపొయ్‌నా మా తాత – సీల కూరకు ఎప్పుడైనా సై. ఇట్టాటి బాగుపడే చేష్టాల్ జెయ్యాలంటే ఆడోళ్లు చెయ్యనీరు గదా! రెండ్రోజులు చూసినాము. తీ ఇట్టగాదన్జెప్పి వొగరోజు రాత్రికి మాంచి గుడ్లకోడిపెట్టను కోసి పులుసు జేసి, అందరం ముక్కులు చీదుకుంటా ఫుల్లుగా తిన్న్యాం. చప్పబడిపొయిన జివ్వకు మల్లా రోంత రుచి తగలంగానే, బయట నులకమంచాలు వాల్చుకొని, అందరం కుశాలగా నాలుగు మంచిమాటలు మాట్లాడుకొంటాం వుండాం. నేనూ మా గోపీగాడూ మా నాయన మింద పండుకోనుండాం.

 

వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన యర్రపు రెడ్డి రామనాధ రెడ్డికి కథలు రాయటమంటే ఇష్టం. కడప జిల్లా వీరబల్లికి చెందిన వీరు మంచి బ్లాగు రచయితగా పేరు పొందారు. వీరు బాల్యం, కుటుంబం నేపధ్యంగా పలు కథలు రాశారు.

 

మమ్మల్నిద్దరినీ మంచం మిందనుంచి పడిపోకండా రెండుచేతల్తో పట్టుకోని మా నాయన చెప్తా వుండాడు, “ఈ మాదిరిగా రోజూ తిన్లేం రోయ్. ముందుముందు మనం కూలీలు యీలేం. యిచ్చినా మనకు కూలోళ్లు పలకరు. పలికినా వాళ్లతో వొళ్లొంచి కూలిపని చేయిచ్చలేం. బాయిలో యిప్పుటి మాదిరిగానే ఎల్లకాలమూ నీళ్లుండవు, మోటర్లు కాలిపోతాంటాయ్, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతాంటాయ్, సేద్యాన్ని నమ్ముకున్యారంటే ఇప్పుడు బతుకుతాండామే ఈ మాత్రం బతుగ్గూడా బతకలేం. మట్టంగా సదువుకోవాల్సిందే. యేదైనా ఉద్యోగం జూస్కోవాల్సిందే”. సదువుల్లో మేమిద్దరమూ ఫరవాలా. శ్రీ శ్రీనివాసా కాన్వెంట్లో నేనే ఐదులో క్లాసుఫస్టు. ఉద్యోగాలు మాకు రాక యింగెవరికొస్సాయి అని నా యిమ్మత్తు. ఐనా ఆ మాటలు యింటా యింటా మేమే బయపణ్ణామో, మమ్మల గురించి మా నాయనే బయపడతాండాడోగానీ రోంచేపు ఎవ్వరమూ యేమీ మాట్లాళ్లా.

చదవండి :  వానరాయుడి పాట (కథ) - వేంపల్లి గంగాధర్

అప్పుడు యింట్లోనుంచి బయటికొచ్చినాడు మా తాత. పందిట్లో బండల మీద ఊతకట్టెను టకా టకామని పొడుస్తా, వొక కాలు యెత్తెస్తా, వొకో అడుగుకూ ‘భైరవా’ అనుకుంటా ఈవారకూ ఆవారకూ తిరగబట్టినాడు. రోంత సేపటికి ఊతబెత్తం టకాటకామనడం మానేసిందే, ఏమా! అని చూస్తే ఒక చేత్తో పట్టుకోని, గిరగిరా తిప్పుతా నడుస్తాండాడు. ‘భైరవా’ మెల్లగా ‘ఐరవా’గా మారిపొయ్యింది. ‘పవమానా సుతుడుబట్టూ – పాదారా విందములకూ…’ అని మాంఛి కుశాలగా పాటకూడా పాడి యింట్లోకి పొయ్యి పండుకున్యాడు. ఎంత చలిగానీ ఎంత ఉడుగ్గావుండనీ, నిండాకూ దుప్పటి కప్పుకోందే ఆయనకు నిద్దర్రాదు.

మేంగూడా పరుపులు పరుచుకొని, దోమతెరలూ కట్టుకుని పండుకుంటా వుండంగా…
‘వొగటికి బోస్కోవాల. రోంత అట్టా పట్టకపోదువురా నాయినా’ – మా తాత.

టార్చిలైటు నా చేతికిచ్చి, నన్ను పొమ్మనె అమ్మ.

“ఇంతసేపూ పందిట్లో ఆవారకూ ఈవారకూ కసరత్తు జేసెనే …” అని నేను.

“రోంత అట్టా చెయ్యిబట్టి నడిపిచ్చిరాపో సామీ”

“మ్..” అని నసుగుతా నేను యింట్లోకిపోతే తలకాణ్ణించీ కాళ్లదాఁక నిండాకూ ముసుగుదన్ని పండుకోనుండాడాయన.

******** ******** ********

మా తాతకు యిట్టాటి కుశాలలు కొత్తగాదు. సెబితే శానా వుండాయిగానీ, మచ్చుకు వొగటి జెప్తా. చిన్నది.

మంచం మింద కుచ్చోని, “పట్టెడన్నం పెట్టకరా, పట్టెడంటే పట్టెడన్నం సాలు” అని మాయవ్వకు ఆర్డరేస్తాడనుకో. ఆయనగిన్నెలో పట్టెడన్నమూ కూరా పెట్టుకొని పోతే, “పిడికెడు పెట్టకచ్చినావే! నేనడిగింది పట్టెడు” అని చెయ్యిచూపిస్తాడు. ఆ చెయ్యి చూసినోళ్లు పట్టెడంటే యెంతో కొత్తగా నేర్చుకోవాల్సిందే. ఎక్కువ అన్నం పెట్టుకొనిపోతే యింగో మాట. నేరుగా అన్నంసట్టి తీసకపోతే దానికీ యింగో మాట.

చదవండి :  ఓడిపోయిన సంస్కారం (కథ) - రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

యింగోటి గూడా చెప్తా.

కండ్లు రెండూ బొత్తిగా కనపరాకండా బొయినాయ్…అని మంత్రం మొదలుబెట్టినాడు వొగసారి. “యెవురోళ్లు…హూడ్” అంటా మా మిందికి వూతకట్టె మారడము, రోజూ చూసే మనుషులు మాట్లాడినా “ఎవురుసామీ నువ్వు?” అనడం… యీ మాదిరిగా యాక్షను చేస్తావుంటే మేం పట్టిచ్చుకోనట్టుగా వుంటావొచ్చినాము. ఆరోజు వసారాలో కుచ్చోని చానా అత్రంగా బైటికి చూస్తా వుండాడు మా తాత. బట్టుపల్లె నుంచి యెవురైనా యీరబల్లెకు బోవాలంటే మా యింటి ముందరగానే బోతారుగదా! ఆయన ట్రంకుపెట్టెలో బీడీలన్నీ అయిపొయినట్టుండాయ్. బీడీలు, ఆయుర్వేదం మందులు, ఆయనవేదం మందులు, మాదీఫలరసాయనమూ, ఇస్త్రీగుడ్డలూ అన్నీ కలిపి వొకచోట పెట్టడంతో ఆయన పెట్టె తెరిస్తే ముక్కులుపగిలే ఘాటు. ప్రతి శనివారమూ, సంతకు పొయ్యేవాళ్లచాత రెండు పెద్దకట్టల రసూల్ బీడీలు తెప్పిచ్చి, వాటిల్లో ఎన్ని చిన్న కట్టలుండాయో, ప్రతీ చిన్నకట్టలో వుండాల్సినన్ని బీడీలూ వుండాయో లేదో వొగటికిరెండుసార్లు ఎంచుకొని భద్రంగా పెట్టెలోపెట్టుకుంటాడ్లే.

ఆ మాదిరిగా సంతకు పొయ్యేవాళ్లకోసం చూస్తావుండఁగా, ‘బెస్తోళ్ల పెద్దోడు’ ఆ దోవన పోతా ఆయన కంటబణ్ణాడు. బెస్తోళ్ల పెద్దోణ్ణి జిట్టెడంత మనిషిగా వున్నెప్పుట్నుంచి రోజూ చూస్తానే వున్నింటాడు మా తాత.

“పెద్దోడా” అని పిలిస్తే నాటకం బైటబడతాది గదా! “రేయ్..ఎవుర్రాఆడ పొయ్యేమనిషి..రోంత యిట్టొచ్చి పోదువురా” అని కేకేశ. పలికితే నిలబెట్టేస్చాడు, యేదో వొగ పనిబెడతాడని, యినబడనట్టుగా జారుకుంటాండాడు పెద్దోడు. అప్పుడు మా తాత ఎలుగెత్తి పిలిచిన పిలుపు నా కీ జన్మలో మరుపురాదు – “రేయ్..చేతిలో నూర్రూపాయలనోటు పట్టుకొని పోతాండేవోడా.. నిన్నే.. రెండడుగులు యిట్రారా నాయినా!” బీడీలు ల్యాకుండా చానాసేపు వుండాలంటే కష్టంగదా!

చేతిలో వుండే నూర్రూపాయల నోటుకల్లా చూసుకుంటా, దొంగనవ్వు నవ్వుకుంటా మా తాత దెగ్గిరికి రాక తప్పలా. రసూల్ బీడీలు త్యాకా తప్పలా.

యిట్టాటి కతలు శానా వుండాయ్. కొన్నికతలైతే, “యట్ట బతికినోడు రెడ్డి! ఆయనింట్లో ఆయనకే దిక్కు లేదీరోజు!!” అనిపిస్తాయ్ బయటనుంచి చూసే జనానికి.

పజ్జెనిమిదేండ్లన్నా నిండని కొడుక్కు అప్పులను, ఇద్దరు చెల్లెండ్రనూ మిగిల్చి, వచ్చే అరాకొరా ఆదాయాన్ని మాత్రం చాతబట్టుకొని ఇంట్లో అందర్నీ బయపెట్టి ఏడిపించడం మాత్రం కత గాదు.

చదవండి :  సెగమంటలు (కథ) - దాదాహయత్

******** ******** ********

“తాతా”

ముసుగులో నుంచే, “ఎవురోళ్లు?”

“లెయ్యి, నేను రామూను”

“ఏం నాయినా?”

“వొంటికి బోవాలంటివే, లెయ్ మడే”

“నేనా?”

“ఆహాఁ, నేను గిన్లే. రెట్టబట్టుకొని నడిపిస్చావేమోనని …”

“ముసిలోణ్ణి, నాతో యేమిటికి పో నాయినా పిల్లాటలు!”

నాకు శానా కోపమొచ్చేసింది. వస్తే మాత్రం చేసేదేముండాది! నేను గడప దాటుకుంటా వుండంగా అరనవ్వు నవ్వుతా, “తలకాయకు …” అన్న్యాడు. నాకు వొళ్లు మండిపొయ్యింది. ఆణ్ణే వుండటం మాతాతకంత మంచిదిగాదని, గమ్మున మంచాలకాడికి వొచ్చేస్తి.

“ఏమి?” అనె అమ్మ.

“కోడి పులుసులో ఎండ్రిన్ కలిపితే వాసనొస్తుందా మా?”

“ఆఁ!??”

“మోనోక్రోటోపాస్ ఎండ్రీనంత ఘాటు వుండదేమోగదా!?”

“దేనికిరా పిచ్చోడా? తాతేమన్యాడు, అదిజెప్పు ముందు” అమ్మకు అర్థమైపొయ్యింది.

జరిగింది చెప్తి నేను. అమ్మా అవ్వా పగలబడి నవ్వుకున్యారు. అవ్వయితే, “యట్టమ్మా యీనితో” అంటుంది, నాకల్లా చూస్తుంది, పొట్ట చెక్కలయ్యేటిగా నవ్వుతుంది. యీళ్లిద్దరినీ చూసి మా గోపీగాడు నవ్వుతాడు. మా నాయన ముసిముసిగా నవ్వుకుంటాండాడు. ఈళ్లందర్నీ చూసి నేనూ నవ్వేస్తి.

“రేపు మాకూ యిదే గతేనేమో!?” అనింది అమ్మ, నవ్వులు రోంత తెరపిన పడఁగానే.

“యింత అద్దుమాన్నంగా ఎందుకు చేస్తారు మీరు?”

“యేమో, ముసిలిమోపున చాదస్తం జాచ్చీ అయి, మేమూ యిట్నే జేసినామనుకో…”

“ఈ మాదిరిగా జేసినారంటే… మీకూ యింతేనేమో మ్మోవ్! ఐనా, మీరు తాత మాదిరిగా చెయ్యర్లే మా. చేసినా మీకు తిండికీ గుడ్డకూ తక్కువజెయ్యములే.”

“ఔరా కొడకా! మీ కాళ్లమింద మీరు నిలబడండ్రా, అదే మాకు తిండీగుడ్డా. మీరు పెట్టేవోళ్లూ మేం తినేవాళ్లమూనా? మీరు యంతటోళ్లయినా, మీకు బిడ్డలయినా, మీ బిడ్డలకు బిడ్డలయినా నాది పెట్టేచెయ్యిగా వుంటాదేగానీ, మీ పంచనజేరి అడిగే చెయ్యిగా మాత్రం వుండదురోవ్! ఎప్పుటికైనా గుర్తుబెట్టుకో!!”

“హీ….”

“ఆ పండ్లుజూడు పచ్చగా…” అంటా, చీరచెంగుతో నా పంటిచిగుళ్లు నొప్పిపెట్టేదాఁక తుడిసి, మురిపెంగా అనె “యీటి రంగే పచ్చనేమో సామీ!”.

ఇదీ చదవండి!

అడవి కథ

అడవి (కథ) – సొదుం జయరాం

‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది. ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: