
‘కడప జిల్లా వారికి విహార కేంద్రంగా మారినట్లుంది’
కడప: రాష్ట్ర మంత్రులకు కడప జిల్లా విహార కేంద్రంగా మారినట్లుందని.. ప్రైవేటు కార్యక్రమాలకు, మేమున్నామన్నట్లు ప్రెస్‌మీట్‌ల కోసం వస్తున్నారే కానీ అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని డీసీసీ అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు.
స్థానిక ఇందిరాభవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి పీతల సుజాతకు రాష్ట్రవిభజన గురించి సరిగా తెలిసినట్లులేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవిభజనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆమె మరచినట్లుందన్నారు.
మంగంపేటలో 130 మిల్లులను మూసివేయించారని.. దీంతో 30వేల మంది కార్మికులు వీధినపడ్డారన్న విషయం ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. ఆ విషయం తెలిసి ఉంటే సంబంధిత యజమానులతో, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఉండేవారన్నారు.
రాష్ట్రంలోని మంత్రులంతా కడప జిల్లాను విహార కేంద్రంగా, వనభోజనాలకు నిలయంగా వూహించుకుని విహారయాత్రలు చేస్తున్నట్లున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ ఏర్పాటై ఎనిమిదినెలలు పూర్తవుతున్నా ఇంత వరకు ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టకుండా ఉన్న పథకాలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తూ పబ్బం గుడుపుకుంటున్నారని విమర్శించారు.