మంత్రి డిఎల్.రవీంద్రారెడ్డిపై ముఖ్య మంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బర్తరఫ్ వేటు వేశారు. ఇప్పటి వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిగా డిఎల్ బాధ్యతలు నిర్వర్తించారు.
డిఎల్‌ను బర్తరఫ్ చేస్తూ శనివారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి సిఫార్సు చేయగా, ఆ వెనువెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగి పోయాయి. కిరణ్ కుమార్ రెడ్డితో విభేదాల కారణంగానే డిఎల్‌ని మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం. డిఎల్ మంత్రిగా ఉంటూనే పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆయనపై వేటుకు అనుమతి పొందినట్లుగా సమాచారం. రాజీనామా కోరకుండా డి ఎల్ ను ఏకంగా బర్త్ రఫ్ చేయడం సరికాదని కొందరు కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం
దీంతో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయనపై వేటు వేయడం గమనార్హం. గతంలో తనను వ్యతిరేకించిన శంకరరావుపై కూడా ముఖ్యమంత్రి వేటు వేసిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అధినాయకత్వానికి గతంలోనే డిఎల్ లేఖలు రాసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ విషయంలో మంత్రివర్గ సమా వేశంలోనే డిఎల్ సిఎంను ఎదిరించిన విషయం విదితమే. ముఖ్య మంత్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ డిఎల్ తప్పులను ఎంచారు. రూపాయికి కిలో బియ్యం, అమ్మహస్తం, బంగారుతల్లి పథకాలపై విమర్శలు గుప్పించారు.
డిఎల్ రవీంద్రారెడ్డి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 4న రాష్ట్రానికి చేరు కోనున్నట్లు సమాచారం. డిఎల్ నిర్వర్తించిన బాధ్యతలను మరో మంత్రి కొండ్రు మురళికి అప్పగించారు.
(చిత్ర సహకారం: ఈనాడు దినపత్రిక)