
బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్
బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు
7 మే 2007 : 2017 నాటికి 25 వేల కోట్ల పెట్టుబడితో 10 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఏర్పాటు చేయనున్నట్లు బళ్లారిలో గాలి జనార్ధనరెడ్డి ప్రకటన.
21 మే 2007 : ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.
6 జూన్ 2007 : బ్రాహ్మణికి భూకేటాయింపులను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ భవన్లో తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం. తన అనుయాయులకు లబ్ది చేకూర్చడం కోసమే ముఖ్యమంత్రి బ్రాహ్మణికి భూములు కట్టబెట్టారంటూ ఆరోపించారు. ఇందుకోసమే పోతిరెడ్డిపాడు నుండి పులివెందులకు నీళ్ళు తీసుకుపోతున్నారన్నారు. ఒకే పరిశ్రమ కోసం అన్ని ఎకరాల భూమిని కేటాయించడం వెనుక గల కారణాలను కడప జిల్లా కలెక్టర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు.
7 జూన్ 2007 : బ్రాహ్మణికి భూకేటాయింపులను ముఖ్యమంత్రి దుశ్చర్యగా పేర్కొంటూ హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెదేపా (ఈ సమావేశంలో తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, ఆ పార్టీ సీనియర్ నేత వేణుగోపాలాచారి మాట్లాడారు. అదే రోజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సంగారెడ్డిలో విలేఖరుల సమావేశం పెట్టి బ్రాహ్మణి భూకేటాయింపులను అనైతికమైన చర్యగా అభివర్ణించారు.
10 జూన్ 2007 : జమ్మలమడుగు మండలంలోని వేముగుంటపల్లి వద్ద బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ 2009 నాటికి బ్రాహ్మణి తొలిదశ పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
30 జూన్ 2007 : 20 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న బ్రాహ్మణి కర్మాగారాన్ని అడ్డుకోవడానికి తెదేపా ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా జమ్మలమడుగులో అప్పటి కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి (ఇప్పుడు తెదేపా ప్రభుత్వంలో మంత్రి) ధర్నా చేశారు. స్థానిక తెదేపా భాద్యుడుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆనాటి రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి బ్రాహ్మణికి వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలను ఆది ఖండించారు.
23 జులై 2007 : ఓబులాపురం మైనింగ్ కంపెనీ గనుల పరిశీలనకు వెళ్ళిన తెదేపా నాయకులపై ఆం.ప్ర పోలీసులు లాఠీచార్జి చేశారని ఆరోపిస్తూ శాసనసభ సమావేశాలను అడ్డుకున్న ప్రతిపక్షాలు. ఘటనపై సభలో ముఖ్యమంత్రి, మంత్రుల వివరణ. (ఆధారం: )
24 జులై 2007 : బ్రాహ్మణి విషయంలో విపక్షం (తెదేపా) ఆందోళనను, మీడియా తప్పుడు కథనాలను ఖండిస్తూ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటన చేసిన ముఖ్యమంత్రి. ఓబులాపురం, బ్రాహ్మణి,రఘురాం సిమెంట్స్ సంస్థలకు కేటాయించిన భూములను పరిశీలించేందుకు అఖిలపక్షానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం (ఆధారం: 24 జులై 2007 నాటి శాసనసభ ప్రొసీడింగ్స్). ఓబులాపురం మైనింగ్ కంపెనీ లీజు బదలాయింపు, రెనివల్ 2002లోనే జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణను మీడియా సమావేశంలో అంగీకరించిన విపక్ష నేత చంద్రబాబు.
సెప్టెంబర్ 2011 : బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ మరియు సదరు సంస్థకు కేటాయించిన భూములను, గనులను కొనుగోలు చేయటానికి ఆసక్తిని వ్యక్తీకరించిన సెయిల్. ఈ మేరకు సెయిల్ ఆం.ప్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు కేంద్ర ఉక్కు మంత్రి బేనీ ప్రసాద్ వర్మ రాజ్యసభకు జనవరి 20, 2013న తెలియచేశారు. ఇందుకు సంబంధించి ఆం.ప్ర ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు మంత్రి సభకు తెలియచేశారు. (ఆధారం: https://www.business-standard.com/article/companies/sail-offers-to-acquire-brahmani-steel-in-andhra-112032200185_1.html)
25 ఏప్రిల్ 2013 : ముఖ్యమంత్రి కిరణ్ ఆదేశాలను అనుసరించి బ్రాహ్మణి ఉక్కు కర్మాగారానికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆం.ప్ర ప్రభుత్వం (ఆధారం: https://www.thehindubusinessline.com/news/national/ap-cancels-land-allotment-to-brahmani-steels-terminates-mou/article20606144.ece1)