
స్నపన తిరుమంజనం సందర్బంగా గంధాలంకారం, యాలకల మాలతో శ్రీవారు. దేవేరులు
సూర్యప్రభ, సింహ వాహనాలపైన ఊరేగిన కడపరాయడు
దేవుని కడప: శ్రీలక్ష్మీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన గురువారం కడపరాయడు సింహవాహనం, సూర్యప్రభ వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు.
ఉదయం లోకకల్యాణం కోసం నిత్యహోమాలు జరిగాయి. అనంతరం సూర్యప్రభ వాహనంపైన స్వామి దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు.
మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయమూ, సాయంత్రం శ్రీనివాసునికి భక్తుల సమక్షంలో వూంజల్‌సేవ నిర్వహించినారు. మంగళహారతుల అనంతరం స్వామి సింహవాహనంపై కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలి వచ్చారు.
కడపరాయని బ్రహ్మోత్సవాలలో భాగంగా తితిదే ధర్మప్రచారపరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణం బుర్రకథ భక్తులను ఆకట్టుకుంది. బుర్రకథను జి.సత్యవతి చెప్పగా వంతలుగా సీతామహలక్ష్మి, అంజనీదేవి సహకరించారు.
