అమానుషమయిన పరిస్థితులలో జన్మించి, ముసురుకొంటున్న అవరోధాలన్నింటినీ దోహదాలుగా మలుచుకొంటూ జీవించడమే అద్భుతమనుకొంటున్న దశలో ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం వెనుకగల కృషి, ఆ రంగంలో ఉన్నవారికి లోతుగా తెలుస్తుంది. ఇతరులకు ఉపరితల దర్శనం మాత్రమే అవుతుంది. అలాంటి ఆదర్శజీవులు, మనదేశంలోనూ ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఉన్నారు – మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూ, అఖిల భారతావనికీ – ఒక మేరకు – ప్రపంచానికి కూడా రాయలసీమ, చాలా కానుకలను ప్రసాదించింది.
ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఒక అనంతశయనం అయ్యంగారు, ఒక కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఒక రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు, ఒక పుట్టపర్తి నారాయణాచార్యుల గారు, ఒక విద్వాన్ విశ్వం గారు, ఒక బి ఎన్ రెడ్డి గారు, ఒక కె.వి.రెడ్డి గారు, ఒక నీలం సంజీవరెడ్డి గారు, ఒక దామోదరం సంజీవయ్య గారు, ఒక బాలశౌరి రెడ్డి గారూ …. వీరందరూ రాయలసీమ మనకందించిన మేలి రత్నాలు!
చాలా సామాన్యమైన కుటుంబంలో జన్మించి అసామాన్యమైన విజయాలను సాధించిన వారిలో మిత్రులు బాలశౌరిరెడ్డిగారొకరు. మన లక్ష్యం మంచిది కావాలి. దాన్ని చేరడానికి ఎన్నుకునే మార్గమూ మంచిది కావాలి. మార్గమధ్యంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోగల ఆత్మస్థయిర్యమూ, ఆత్మవిశ్వాసమూ మనకుండాలి. ఇన్నీ సమకూర్చుకొన్నాక, ఫలితం కోసం బాధపడకూడదు. అపజయం – నీకు స్ఫూర్తినివ్వాలి గానీ, నిన్ను నిరాశపరచకూడదు అంటారు బాలశౌరి రెడ్డి గారు.
ఈ హితవచనం వెనుక గల అర్థం గమనార్హం గదూ?
బాలశౌరిరెడ్డి గారు మంచి రచయిత, మంచి అనువాదకుడు, మంచి భోదకుడు, మంచి కార్యకర్త అవడం అతన్ని పైపైన చూపించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. పైకి చాలా సాదాసీదాగా చాలాచాలా మామూలుగా కనిపించే బాలశౌరి రెడ్డిగారి అంతరంగం నిండా ఆర్ద్రతానురాగాలూ, ఆప్యాయతలూ అలముకొని ఉంటాయన్న పరమసత్యం తెలిసినవారిలో నేనొకన్ని. బాలశౌరి రెడ్డి గారితో నాకున్న పరిచయం సుమారుగా 40 సంవత్సరాల నాటిది. నాలుగు దశాబ్దాల కిందటి నా జీవితం, విషాదమయ వాతావరణంతోనూ, బాధామయ గాధలతోను నిండిపోయి ఉంది. తొలిపరిచయం, తెనాలిలోనా? విజయవాడలోనా? మదరాసులోనా? గుర్తులేదు గానీ – చాలా సంక్లిష్టదశలోనిదని మాత్రం జ్ఞాపకం! నేనేదో ఆపదలో చిక్కుకొని ఉన్నప్పుడు నన్నాదరించి ఉండకపోతే నేనంత సన్నిహితున్ని అయి ఉండేవాణ్ణేకాదు.
మదరాసులో ఉద్యోగం వెలగబెడుతూ, ఆ వెలుగు ఒక పూటక్కూడా చాలక, సతమతమయిపోతున్న నన్నాదుకొన్న బహుకొద్దిమంది మిత్రులలో బాలశౌరిరెడ్డిగారున్నారు. నా కథను హిందీలోకి అనువదించి ఆ పత్రిక వారు పంపిన పారితోషికం నా ఇంటి దాకా తెచ్చి నాకిచ్చిన సన్నివేశాన్ని నేనింకా మరిచిపోలేను. బాలశౌరిరెడ్డి గారి సాహితీసేవను గురించి మదింపు చేయగల అర్హతలు నాకు లేవు. కానీ ఆయన సచ్చీల సౌరభాన్ని పదిమందికీ పంచుదామన్న ఉత్సాహాన్ని నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. ఎక్కడా నాన్పుడు లేకుండా స్పష్టంగా, మరుచిరంగా చెప్పడం ఆయనగారి అలవాటు. “ సిగరెట్లు, లిక్కర్ వాడడం వల్ల నువ్వు నష్టపోతావు. నీ కుటుంబం నష్టపోతుంది. కానీ అబద్దాలు, అక్రమాలు ప్రారంభిస్తే మొత్తం సమాజమే నాశనమవుతుంది. నీ కారణంగా నీ కుటుంబం నష్టపడకూడదు, నీ సమకాలీన సమాజం అంతకన్నా నష్టపడకూడదు” అంటారాయన.
“పక్షులుండడానికి గూళ్ళయినా ఉన్నాయి. కానీ కుక్కలకు అవి కూడా లేవు. ఏం లేకపోతె? ఏ కుక్కా తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నట్టు మనమెక్కడా చదవలేదు. ఎక్కడా వినలేదు. నిన్ను నమ్మినవారిపట్ల, నీవు నమ్మినవారిపట్ల, నీ లక్ష్యంపట్ల చెరగని విశ్వాసం – అదీ ముఖ్యం” అంటారాయనగారు.
“సాయం చేయడం – చేయగలగడం – చేసే అవకాశం లభించడం అదృష్టం. ఈ అవకాశాలన్నవి, అనుకోన్నప్పుడల్లా రావు. వచ్చినప్పుడు తప్పకుండా సాయం చేయాలి. సాయం పొందగలగడం అదృష్టమో కాదో నాకు తెలియదు కానీ, సాయపడగల అవకాశం లభించడం మాత్రం, గొప్ప అదృష్టమనే నేను భావిస్తాను.” అంటారాయన.
“ఒకపూట భోజనం తిన్నవాడు, మరుసటి భోజనాన్ని గురించి ఆలోచించడు. కానీ తరతరాల పర్యంతం ఖర్చు చేసినా తరగనంత సిరిసంపదలున్న వారు కూడా విచారపడుతుంటే వారిని చూసి జాలిపడడం కన్నా మనం చేయగలిగిందేమీ లేదు” అన్నది బాలశౌరిరెడ్డి గారి ధృడవిశ్వాసం.
కృషీ, పట్టుదల, దీక్ష, నిజాయితీల పట్ల పరమ విశ్వాసం ఉన్న బాలశౌరిరెడ్డి గారు తన వారందరకూ అదే చెబుతుంటారు. “మన వృత్తిలో మనం సమర్దులం కాకపొతే, మనం నిలబడలేం, బతకలేము కూడా!ఈ సమర్ధతను కృషితోనే సాధించవలసి ఉంటుంది. అదృష్టం కూడా కృషీవలున్ని వరిస్తుందేగానీ సోమరి చెంతకు పోనన్నా పోదు” అంటారాయన గారు.
“ఓ దట్టమయిన అరణ్యముంది. ఆ అడవిలో ఓ పూలచెట్టుంది. ఆ చెట్టు పూలు పూస్తుంది. ఆ పూల పరిమళాలను, ఆ పరిసరాలకు పంచిపెడుతుందా చెట్టు. దేవుని పాదాల మీద వాలిపోవాలని గానీ, వనితల ధమ్మిల్లాలను అలంకరించాలనిగానీ ఆ పూలు అనుకోకపోవడంవల్లనే అవి సుఖంగా ఉన్నాయి. సుఖం, దుఃఖం అన్నవి ఒకే నానేణికున్న రెండు పార్శ్వాలు. ఏ వైపు చూడడమన్నది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది.” అంటారాయన.
ఒక తాత్వికునిగా మనకు కనిపించే బాలశౌరిరెడ్డి గారిని గురించి మనకన్నా ఉత్తరాది వారికి బాగా తెలుసు. ఆయన గారి రచనలతో హిందీ సాహిత్యరంగం సుసంపంనమయిందన్న విమర్శకులెందరో ఉన్నారు. తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని ఉత్తరాది వాసులకు అందించడం ద్వారా ఉభయ భారతాలకూ మధ్య వారధిని నిర్మించిన సహృదయ శిరోమణి డాక్టర్ బాలశౌరిరెడ్డి.
– డాక్టర్ రావూరి భరద్వాజ
బాలశౌరిరెడ్డి ఫోటో గ్యాలరీ…