పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?
శుక్రవారం తమిళనాడు సరిహద్దును ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీసిటీ ప్రత్యేక ఆర్ధిక మండలిలో 11 పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనక జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పరిశ్రమలు రావాలంటే శాంతిభద్రతల ఆవశ్యకత ఎంత అనేది సెలవిచ్చారు. సంతోషం, ఒక ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తల సమక్షంలో వారి మనసును రంజిపచేసే విషయాలు మాట్లాడి వారిని ఆకట్టుకున్నందుకు అభినందనలు.
ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లాను గురించి తన మనసులోని అశాంతినీ, అభద్రతనూ ఇలా బయటపెట్టేరు. ఏమనీ అంటే… ‘శాంతిభద్రతలు అదుపులో లేకపోతే పరిశ్రమలు రావని, అందుకు కడప జిల్లాయే ఉదాహరణ’ అని (ఆధారం: ఆంధ్రజ్యోతి వారి కథనం). కడప జిల్లా గురించి ఇలాటి చవకబారు ఆరోపణలు చేయటం ముఖ్యమంత్రి గారికి ఇది తొలిసారి కాదు. దురదృష్టవశాత్తూ ఇది చివరిసారి అయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన తరువాత అప్పట్లోనే హైదరాబాదును సృష్టించిన చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుడు ఇలాటి ఆరోపణ చెయ్యటం ఇది నాలుగోసారి.
పట్టిసీమను కట్టి అపరభగీరదునిగా అవతరించబోతున్న వ్యక్తీ, సింగపూరును సృష్టించబోతున్న శక్తీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తీ ఒక మాట మాట్లాడినాడు అంటే అందులో వాస్తవం లేకపోలేదు అని నమ్మే అమాయక జనాలం మేం. ముఖ్యమంత్రి గారు శుక్రవారం నాడు చెప్పిన మాటనే అంతకు కొన్నాళ్ళ ముందూ (అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు) జంకూ బొంకూ లేకుండా ఒక గౌరవ కలెక్టరు గారి నోటి వినీ నుండి తరించిన భాగ్యం కూడా మాకే సొంతం.
ముఖ్యమంత్రి కానీ, కడప జిల్లా కలెక్టరు కానీ చేసిన ఆరోపణలలో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం…
పారిశ్రామిక అశాంతి:
సహజంగా పారిశ్రామిక అశాంతి (industrial unrest) ఎక్కువగా ఉన్న చోట పరిశ్రమలు స్తాపించేదానికి పారిశ్రామికులు ఇష్టపడరు. లాకౌట్లు, కార్మికుల సమ్మెలు, కార్మిక యూనియన్లకూ యాజమాన్యాలకూ మధ్యన తలెత్తే విభేదాలు వంటి వాటిని పారిశ్రామిక అశాంతిని కలిగించే కార్యకలాపాలుగా పేర్కొంటారు. ఇటుంటి పారిశ్రామిక అశాంతి కారణంగా పరిశ్రమలలో ఉత్పత్తి ఆగిపోవడం, కొన్నిసార్లు పరిశ్రమలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూతపడడం జరుగుతూ ఉంటుంది. 2013నాటి ఆం.ప్ర సామాజిక ఆర్ధిక సర్వే ప్రకారం విశాఖ జిల్లాలో 2 , శ్రీకాకుళం జిల్లాలో మూడు , కర్నూలు జిల్లాలో రెండు చొప్పున పారిశ్రామిక అశాంతిని కలిగించే ఘటనలు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఇటువంటి ఘటన ఒక్కటీ నమోదు కాలేదు. ఈ ప్రాతిపాదికన కడప జిల్లాలో పారిశ్రామిక శాంతి మెండుగా ఉంది.
శాంతి భద్రతలు (Law and Order):
ఒక జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? లేదా? అనేదానికి కొలమానం ఏమిటి? ఆ జిల్లాలో లేదా ప్రాంతంలో జరిగే నేరాల రేటును (crime rate)ను బట్టి ఆ జిల్లాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని కొంతవరకు బేరీజు వేయవచ్చు… ఒక లక్ష జనాభాను ప్రాతిపదికగా తీసుకుని నేరాల రేటును లెక్కిస్తారు.
ఆం.ప్ర పోలీసు శాఖ వారు విడుదల చేసిన నేర గణాంకాల ప్రకారం 2013లో కడప జిల్లాలో ఐపిసి (ఇండియన్ పీనల్ కోడ్) కింద నమోదైన నేరాల రేటు 222.4 అంటే కడప జిల్లాలో సదరు సంవత్సరంలో లక్ష జనాభాకు గాను సుమారు 222 నేరాలు జరిగినట్లు లెక్క. అదే సంవత్సరం ఆం.ప్రలో సగటు నేరాల రేటు 244.5 గా ఉంటే సైబరాబాద్ (223.5), నెల్లూరు (232.6), రాజమండ్రి నగర పరిధి (239.4), కృష్ణా జిల్లా (254.1), నిజామాబాద్ (269.6), నల్గొండ (277), తిరుపతి నగరం (281.0), విశాఖ (297.3), వరంగల్ నగర పరిధి (346.9), ఖమ్మం (353.7), హైదరాబాదు నగరం (377.1), గుంటూరు జిల్లా (280.5), విజయవాడ నగరం (416.2), రంగారెడ్డి (469.6)లలో కడప జిల్లా కన్నా నేరాల రేటు అధికంగా నమోదైంది.
విభజన జరిగిన తరువాత 2014లో (01.01.2014 నుండి 25.12.2014 వరకు) ఆం.ప్రలోని వివిధ జిల్లాలలో నమోదైన కేసుల(ఎఫ్ఐఆర్) సంఖ్య ప్రకారం మొదటి ఆరు స్థానాలు ఈ జిల్లాలవి – కృష్ణా (21342) , గుటూరు (15349), విశాఖపట్నం (13859), తూర్పుగోదావరి (12203), అనంతపురం (11845), చిత్తూరు (11468) లకు దక్కుతాయి. తర్వాతి స్థానాలలో కడప, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. (ఆధారం: http://www.appolice.gov.in/jsp/distcommcontact.do?method=getRegisteredCrimesAP)
ముఖ్యమంత్రిగారు కానీ, కలెక్టరు గారు కానీ చెప్పిన దాని ప్రకారం పైన పేర్కొన్న ప్రాంతాలలో 2014లో, 2015లో పరిశ్రమలు కానీ, వాణిజ్య సంస్థలు కానీ స్థాపించే దానికి ఎవరూ ముందుకు వచ్చి ఉండకూడదు. ఎందుకంటే 222.4 నేరాల రేటు కలిగిన కడప జిల్లాలో శాంతిభద్రతలు బాలేవని పారిశ్రామికవేత్తలు భయపడుతోంటే, అందుకే అక్కడ పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రానట్లయితే పై ప్రాంతాలలో కాలు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ఎన్ని షరతులు పెట్టి ఉండాలి? మరి వారిని ఆయా ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎలా ఒప్పించగలిగారు?
ఆ ప్రాంతాలను ఎలా ఎంపిక చేశారు?
ఇక రాజధాని విషయంలో లేదా ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను నెలకొల్పే విషయంలో కానీ కడప జిల్లా కన్నా అధ్వాన్నమైన శాంతిభద్రతలను కలిగి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలను ప్రభుత్వం ఎలా ఎంపిక చేసింది? దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకోవాల్సిన విద్యాసంస్థలను శాంతిభద్రతలతో నిమిత్తం లేకుండా ఆయా ప్రాంతాలలో ఎలా ఏర్పాటు చేస్తున్నారు?
తప్పెవరిది?
ఒకవేళ 2014 నుండి మాత్రమే అనగా ప్రభుత్వం మారిన తర్వాతనే కడప జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోతే అందుకు భాద్యత ఎవరిది? ప్రభుత్వానిదా? అధికారులదా? లేక ప్రజలదా? పోనీ కడప జిల్లా ప్రజలదే తప్పు అనుకుందాం. ఇలా కడప జిల్లా ప్రజలు ఒక్కసారిగా 2014 నుండి తప్పుడు మార్గం పట్టడానికి కారణం ఏమిటి? మాకైతే అర్థం కావడం లేదు.
కడప జిల్లాలో పరిస్థితులు అంత భయానకంగా ఉంటే అదుపు చేసి పరిస్థితులను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రిగారు కానీ, సర్వోన్నతాధికారి గారు కానీ ఇంతకాలం ఏం చేసినట్టు?
కొసమెరుపు: మార్చి8న కడప జిల్లాకు రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అని చెప్పిన సర్వోన్నతాదికారి గారు అదే నోటితో జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు 44 దరఖాస్తులు వచ్చాయని మార్చి 17న చెప్పటం (https://kadapa.info/పరిశ్రమలు/)
పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?
కడప జిల్లా గురించి వాస్తవాలతో పని లేకుండా ముందే ఒక అభిప్రాయానికి వచ్చిన మాన్య ముఖ్యమంత్రిగారు, తన ఆభిప్రాయం నిజమని చెప్పి పారిశ్రామికవేత్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది.
క్రితంసారి కడప సహకార చెక్కెర కర్మాగారాన్ని, ప్రొద్దుటూరు పాల కర్మాగారాన్ని మూసివేయించిన ముఖ్యమంత్రి గారు ఈ సారి శాసనసభ సాక్షిగా కడప జిల్లాకు ఇచ్చిన హామీలను సైతం మరిచిపోతున్నట్లున్నారు. విభజన చట్టంలో కడపకు దక్కిన హామీలు వీరికి పట్టట్లేదు.
ఫలితంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో కూడా ప్రభుత్వం కడప జిల్లాకు మొండిచెయ్యి చూపుతోంది. అందుకు నిదర్శనంగా బాబు గారి ప్రభుత్వం కడపలో ఉన్న ఆం.ప్ర.పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కార్యాలయాన్ని తిరుపతికి తరలించింది. అంతిమంగా ఇది కడప జిల్లా పారిశ్రామిక ప్రగతిని మందగమనంలో నడిపిస్తోంది.
ఇవన్నీ పక్కన పెట్టిన ముఖ్యమంత్రి గారు మైకు అందుకోగానే అక్కసుతో కడప జిల్లాలో అశాంతి రాజ్యమేలుతోందని ఆరోపణలు గుప్పిస్తే ఎలా? కడప జిల్లా రక్షకులం మేమే అన్నట్లు బడాయి పోయిన నేతలకు అధికారం కావాలి తప్ప ఇలాంటి ఆరోపణలు వినిపించవూ, కనిపించవూ!
ఇక మాలాటి దగాపడిన జనాలకు బతుకు పోరాటమే బరువయితే ప్రభుత్వాలతో పోరాడే ఓపిక ఎక్కడిది? అడిగేవాడు ఎవడురా…!
ఇదే సందర్భంలో దివంగత వైఎస్ శాసనసభలో చెప్పిన ఒక మాట పదేపదే గుర్తుకు వస్తోంది… అదేమిటంటే ‘అధ్యక్షా.. చంద్రబాబు గారికి కడప జిల్లా ఆం.ప్రలో మ్యాపులో భాగమనే విషయం గుర్తుకు లేదూ!’ అని.