పాడె (కథ) – సొదుం జయరాం

పాడె (కథ) – సొదుం జయరాం

పాడె

చిన్నపురెడ్డి కాలమైపోయాడు. పుట్టినవాళ్లు గిట్టక తప్పదు కదా? మంచానా కుంచానాపడి, తాను ఇబ్బందిపడీ, ఇతర్లను ఇబ్బంది పెట్టకుండా చాలా సుఖమైన చావు చచ్చాడు.

చావడమైతే సుఖంగానే చచ్చాడు కానీ, చచ్చిన తర్వాత ఆయన శవానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన్ని కడసారిగా చూడవచ్చిన వాళ్లూ ఇబ్బంది పడిపోతున్నారు.

చిన్నపురెడ్డి బ్రతికి వుండగా, ఆయన మూలంగా ఏ ప్రాణీ ఇబ్బంది పడలేదు. గ్రామంలో అందరికి తలలోని నాలుకలాగా మసలుకున్నాడు. చదువుకున్నది వీధిబళ్లోనే అయినా, ప్రబంధాలూ, కావ్యాలూ కూలంకషంగా చదువుకున్నాడు. “కవిత చెప్పెను చిన్నప్ప కడలితెప్ప” అనే మకుటంతో ఒక శతకం రాసి పడేశాడు. ఆ మహానుభావుడు తన్ను తాను కడలికి తెప్పనని ఎందుకనుకున్నాడో ఏమో — ఆయనను మోసే పాడె శ్మశానానికి వెళ్లే తెప్పలాగా ఉదయం నుంచి రెడీగా వుంది.

ఆయన్ని… కానీ ఆ పాడె మీదికి ఆయన్ను చేర్చే మార్గం కనిపించడం లేదు.

ఆయన నిన్న ఉదయం ఏడింటికి హాస్పిటల్లో చనిపోయాడు. పదింటికి శవం జీపులో ఇంటికి చేరింది. కొడుకులూ, కూతుళ్లూ, అల్లుళ్లూ అంతా సాయంత్రానికి చేరుకున్నారు. చుట్టుప్రక్కల పల్లెల్లో వున్నవాళ్లూ వచ్చారు. మొత్తానికి చీమలబారుల్లా జనం వచ్చారు. బుడిబుడి ఏడ్పులు కొందరివైతే, గుండెపట్లు పడలే ఏడ్పులు కొందరివి. ఏది ఏమైతేనేం, అంతిమ దర్శనం పూర్తయ్యేసరికి బాగా చీకటిబడింది. సరే మరుసటిరోజు ఉదయం భూస్థాపితం చేద్దాంలెమ్మన్న నిర్ణయానికి వచ్చారు.

రాత్రి అయ్యేసరికి వర్షం మొదలయింది. ఆయన చావుకు ప్రకృతి కూడా చలించిపోయిందా అన్నట్లు, ఆకాశం కళ్లనుండి ఏకధారగా వర్షం కురుస్తోంది.

అంతవర్షంలోనూ, శవయాత్రకని ఊరూ ఊరంతా కదిలి వచ్చింది. ఐదు నిమిషాల్లో పాడె తయారయింది. దారిపొడుగునా వెదజల్లడానికి చిల్లర డబ్బులు, బొరుగులు గంపలతో సిద్ధమయ్యాయి. స్టేట్స్లో వున్న కొడుకు రాజిరెడ్డి వస్తూ వస్తూ గంపలతో గులాబీ పూలు పట్టించుకొని వచ్చాడు. ఇక పూలదండలకు లెక్కేలేదు. శవానికి స్నానం చేయించి, అలంకరించి, పాడెమీద గులాబీలు పరిచి పడుకోబెట్టడమే తరువాయి.

ఆ కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది.

“వర్షం వస్తే వస్తుంది. కార్యక్రమం కానివ్వండి. నేను ఈ సాయంత్రమే వెళ్లిపోవాలి” అన్నాడు రాజిరెడ్డి తన చుట్టూ మూగిన జనాన్ని ఉద్దేశించి.

శవాన్ని చూడవచ్చిన వాళ్లలో చాలామంది రాజిరెడ్డినీ చూచి వెడుతున్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన ప్రతివాడికీ అతను త్రిబుల్ ఫైవ్ సిగరెట్టు ఆఫర్ చేస్తున్నాడు. స్టేట్స్ నుంచి చాలా సిగరెట్ పాకెట్లు తెచ్చినట్టుంది. పొగతాగేవారికి అదొక అపూర్వ అవకాశం.

రాజిరెడ్డి మాటకు ఎవరూ సమాధానం చెప్పలేదు. ఉదయం నుంచి చాలా విసుగ్గా వుంది అతనికి. ఈ కార్యక్రమం ఎప్పుడయిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఎందుకనో అది ఎంతకీ తెమలడం లేదు.

“వాటిస్ ది ప్రాబ్లం? ఏమిటి సమస్య?” అన్నాడు రాజిరెడ్డి మళ్లీ.

ఇంగ్లీషులో మాట్లాడడం, మళ్లీ దాన్ని తెలుగులో చెప్పడం అతనికి అలవాటు.

“వర్షం. మాలవాళ్లు ఎవరూ గుంత తవ్వడానికి వీలు లేదంటున్నారు” అన్నాడు పిచ్చిరెడ్డి.

ఉదయం నుంచీ అంతా అతనే అజమాయిషీ చలాయిస్తున్నాడు.

“వాట్ నాన్సెన్స్. పేదెం హేవీ అమౌంట్ అడిగినంతా డబ్బివ్వండి, ఎందుకురారు?” అన్నాడు రాజిరెడ్డి.

పిచ్చిరెడ్డి తలగోక్కున్నాడు తప్ప సమాధానం చెప్పలేదు.

“మామూలుగా అయితే గుంత తవ్వడానికి ఎంతిస్తున్నారు ఈ ఊళ్లో?” అడిగాడు రాజిరెడ్డి.

అతను ఊరు ఎప్పుడో వదిలాడు. ఊరి అనవాయితీలు అతనికి తెలియవు.

“ఎంతున్నా ఎంతిస్తారు? నలుగురు మనుషులు గుంత తీయడానికి వెళ్తే నాలుగిరవైలు సారాయికిస్తారు. పీనుగుమీది సైను గుడ్డ మరొకటో వాళ్లే తీసుకుంటారు. మళ్లీ దివసం రోజు ఎక్కి తొక్కేంత పప్పన్నం — అంతే” అన్నాడు పిచ్చిరెడ్డి.

“పేదెం తౌజండ్ రూపీస్. వెయ్యి రూపాయిలు కాలబెట్టండి” అంటూ జేబులో నుంచి నోట్ల కట్ట తీశాడు రాజిరెడ్డి.

పిచ్చిరెడ్డి తలగోక్కుంటున్నాడు.

జనంలోంచి ఎవరో అన్నాడు:

“మీ డబ్బున్నవాళ్లు ఎంత డబ్బంటే అంతా మంచినీళ్ల ప్రాయంగా ఇస్తారు. రేపు ఇదే అలవాటవుతుంది. ఆచారం అడుగంటిపోతుంది. ఫలానా రాజిరెడ్డి ఇంత ఇచ్చాడు అంటారు, డబ్బు లేనివాళ్లు ఏ చావు చావాలి. ఇది ఆచారం. డబ్బుతో ముడిపెట్టకూడదు రాజిరెడ్డన్నా.”

ఆచారం, సంప్రదాయం చట్టంకన్నా, డబ్బుకన్నా బలవత్తరమైనవి అని రాజిరెడ్డికి అర్థమయ్యేలా చెప్పాలని అతని ఆరాటం.

“దెన్ వాటీస్ ది సొల్యూషన్? దీనికి పరిష్కారమేమిటి?” అన్నాడు రాజిరెడ్డి రుసరుసలాడుతూ, వెలికితీసిన నోట్లకట్ట మళ్లీ జేబులో ఉంచుకుంటూ.

పరిష్కారం దొరక్కనే ఉదయం నుంచి ఎంతగా మల్లగుల్లాలు పడ్డా మార్గం కనిపించలేదు. రాజిరెడ్డి ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు.

చదవండి :  చనుబాలు (కథ) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

“పోనీ గుంత తవ్వడం మన చేతగానిపని కాదుగదా — మనమే చేసుకోవచ్చు గదా” అన్నాడు రాజిరెడ్డి సమస్యకు పరిష్కారం సూచిస్తూ.

జనంలోంచి ఎవడో పకాలున నవ్వాడు. పడిపడి నవ్వాడు. ఆ నవ్వును అనుకరిస్తూ మరో ముగ్గురు నలుగురు నవ్వారు.

“వై డూ యు లాఫ్? నవ్వుతారెందుకు?” అన్నాడు రాజిరెడ్డి చిరాగ్గా.

“ఆచారం, సంప్రదాయం అంత తేలిగ్గా వదులుకునేవేనా రాజిరెడ్డీ. మన చేతనయినపనే గనుక ఇవాళ గుంత తవ్వుకుంటాం. రేపు ఇంట్లో ఎనుమో, ఎద్దో చచ్చిందనుకో దాన్ని మీరే పారేసుకోండి అంటారు. అలగా జనానికి అలుసిస్తే ఏమవుతుందో నీకేం తెలుసు” అన్నాడు పిచ్చిరెడ్డి త్రిబుల్ ఫైవ్ సిగరెట్టు రెండోది అంటించుకుంటూ.

ఈ ఆచారంలో ఇన్ని తిరకాసులున్నాయని రాజిరెడ్డికి తెలియదు. ఈ సమాధానం విన్న తర్వాత ఇక నోరెత్తలేదు. డబ్బుతో ఏ పనైనా చెయ్యవచ్చునని అతని అభిప్రాయం, ఈ ఆచారం దానికన్నా బలీయంగా వున్నట్టుంది. రాజిరెడ్డి చుట్టూ కాసేపు నీరవ నిశ్శబ్దం అలుముకుంది.

ఈలోగా సర్పంచ్ క్రిష్ణారెడ్డిగారు వచ్చారు. ఆయన గొడుగు బయట పెట్టి సరాసరి శవం దగ్గరికి వెళ్లాడు. ముసుగుతీసి ముఖం చూశాడు. ఆయన్ను చూడగానే ఆడవాళ్లు మళ్లీ శోకాలు మొదలు పెట్టారు. క్రిష్ణారెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఆడవాళ్లు ఏడవటం చూస్తే ఆయనకూ ఏడుపు వచ్చింది. ఏడుపు దిగమింగి ఏడవకూడదని అందర్నీ గదురుకున్నాడు. అంతా నోళ్లు మూశారు.

క్రిష్ణారెడ్డి బయటకు రాగానే రాజిరెడ్డి మంచం మీదనుంచి లేచి నిలబడి,

“రా చిన్నాన్నా” అన్నాడు.

క్రిష్ణారెడ్డి కూచోగానే రాజిరెడ్డి కూచున్నాడు. శవయాత్రలో జరుగుతున్న జాప్యానికి కారణాలు, ఎవరో ఆయనకు దారిలోనే చెప్పినట్టుంది.

“ఇంతకూ వంతెవరిదిరా పిచ్చిరెడ్డీ?” అడిగాడు క్రిష్ణారెడ్డి.

ఊర్లో అన్ని కుటుంబాల వాళ్లనీ మాలవాళ్లు వంతువారీగా విభజించుకుంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరివంతు అయితే వాళ్లు చెయ్యాలి. అదీ క్రిష్ణారెడ్డి అడిగిన వంతు విషయం.

“వంతేమో మరియమ్మది. దానికి మగదిక్కులేదు, వంతుకాని వాళ్లని మనం బలవంతం చెయ్యలేం గదా? మామూలుగా అడిగితే ఒకడు జ్వరమంటే మరొకడు పులకరమంటూ ఏవేవో సాకులు చెబుతున్నారు. జ్వరమూ లేదు, పులకరమూ లేదు. గుడిసెల్లో కూచొని చీట్లపేకలూ, పులిగీతలూ ఆడుకుంటున్నారు” పిచ్చిరెడ్డి చెప్పాడు.

“మీరే ఏదో మార్గం ఆలోచించాలి” అన్నాడు రాజిరెడ్డి క్రిష్ణారెడ్డితో.

ఎందుకనో ఆయన నోటంట ఈసారి ఇంగ్లీషు దొర్లలేదు.

“ఒకటే మార్గం. ముల్లుగర్ర” అన్నారు ఆ మూలనుంచి ఎవరో.

క్రిష్ణారెడ్డి అటువైపు చూడకుండానే ఆ కంఠస్వరం గుర్తించాడు. అది తన ప్రత్యర్థి వర్గానిది.

“ఆ రోజులు పోయినై” అన్నాడు క్రిష్ణారెడ్డి గంభీరంగా.

“మాలవాన్ని మాట్లాడించకుండా కొట్టాలని ఊరికే అనలేదు పెద్దలు. ఓట్లు వచ్చినాయిదా. ఆ రోజులు పోక ఏం చేస్తాయి” అన్నాడు మళ్లీ క్రిష్ణారెడ్డి ప్రత్యర్థి ఎత్తిపొడుపుగా.

భయంతో వేశారో, భక్తితో వేశారో, డబ్బుకే అమ్ముడుపోయారో హరిజనవాడంతా క్రిష్ణారెడ్డికే కట్టకట్టుకొని ఓట్లేసింది. ముళ్లుగర్రను ఒకరు సపోర్టు చేయడానికీ, మరొకరు వ్యతిరేకించడానికీ అసలు కారణం అది.

“పదరా నేనొస్తున్నాను పిచ్చిరెడ్డీ” అంటూ క్రిష్ణారెడ్డి పిచ్చిరెడ్డిని వెంటేసుకొని బయలుదేరాడు.

బయలుదేరడమైతే బయలుదేరాడుకానీ వాడలో తన మాట వింటారో వినరోనన్న సందేహం పీకుతూనే వుంది. తనకు అరవైఐదు ఏండ్లు. ఒకప్పుడు నత్తనడక నడిచిన కాలం ఇప్పుడు శరవేగంతో పరుగెడుతున్నది. ఆచారాలూ, సంప్రదాయాలూ అన్నీ అడుగంటిపోతున్నాయి. మాటవాడకూ ఊరికీ మధ్య సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి.

పాతరోజులు వేరు. ఉత్తరకార్తెలోనూ, హస్తకార్తెలోనూ ఒకటే దడివాన కురిసేది. వాడలో బీదా బిక్కీ తిండిగింజల కోసం నానా యాతనా పడేవారు. ఊర్లోని రైతుల చుట్టూ మూగేవారు. వాళ్లు ఆస్తులూ పాస్తులూ పడకుండా రైతు ఆదుకునేవాడు. కొట్టినా తిట్టినా తమ కడుపు కొట్టడనే భావం వాడలో వాళ్లకుండేది. ఒక పేడపుటికెడు జొన్నకంకులు దొంగిలిస్తే కాలాచేతా పడదన్నేవాళ్లు. ముల్లుగర్ర తీసుకొని తాటవలిచేవాళ్లు. వాడలో వాళ్లకి కిక్కురుమనే ధైర్యం ఉండేదికాదు. దెబ్బలు తిని మూడోరోజు మళ్లీ అదే రైతు పంచన కూర్చునేవారు. రైతు కాల్చిపారేసే ఎంగిలి బీడీకి చేతులొగ్గేవారు. తాము నికృష్టంగా బ్రతుకుతున్నామనే భావన వాళ్లకు వచ్చేది కాదేమో.

ఇక ఆడవాళ్లు సరేసరి. రెడ్డిసాని చెమటను తడిసిన పాతచీరెకు, పాతరవికెకు నానా ఊడిగం చేసేవాళ్లు. అంతమాత్రమే అయితే ఫరవాలేదు. తెల్లారగట్ల రెడ్డి వాడలోకి వెళ్లి జీతగాళ్లను పనిలోకి పంపి, వాళ్ల స్థానంలో తను పడుకొనేవాడు. మగవాళ్లే బానిసలై బతుకుతుంటే, వాళ్ల ఆడవాళ్లకి ఇక వ్యక్తిత్వం ఎక్కడుంటుంది? పాతివ్రత్యం ఎక్కడ కాపాడుకుంటారు? కిక్కురుమనకుండా సహించేవాళ్లు. క్షోభపడడానికీ, మధనపడడానికీ వాళ్లకు ఒక ఆత్మ అంటూ వున్నదీ లేదో ఆ పరమాత్మకే తెలియాలి!

చదవండి :  'మురళి వూదే పాపడు'ని ఆవిష్కరించిన రమణారెడ్డి

క్రిష్ణారెడ్డి వడివడిగా నడుస్తున్నాడు. దారిదారంతా బురదమయమైపోయింది. కాలు గిరిగిలలోతు దిగబడిపోతున్నది. ఇలా వర్షం వస్తే రోతాపీతా కాకుండా బజార్లన్నీ బండచప్పట్లు వేయిద్దామనుకున్నాడు క్రిష్ణారెడ్డి. కానీ గ్రామంలో ఐకమత్యం లేదు. రకరకాల అబ్జక్షన్లు తెచ్చారు.

“మనకెప్పుడూ ఈ బండచప్పట్లే వున్నవా? ఇప్పుడెందుకు?” అని కొందరన్నారు.

“ఎడ్లు జారి కిందపడిపోతాయి అవెందుకు?” అన్నారు మరికొందరు.

“ఊరు బాగుకోసమా పాడా? కాంట్రాక్టులో మిగిలించుకోవచ్చని ప్లాను” అని మరికొంతమంది చాటుమాటుగా విమర్శించారు.

ఊరు బాగుపడకపోయినా సరే ఇతరులు బాగుపడకూడదన్నది వారి మతం. క్రిష్ణారెడ్డి ఆ పని మానుకున్నాడు.

“వర్షంలో బయలుదేరినారు. ఎందాకా?”

క్రిష్ణారెడ్డి చివుక్కున తలపైకెత్తి చూచాడు. చినమస్తాన్. గొడుగు పట్టుకొని ఆ బురదలో కాళ్లీల్చుకొని తనలాగే కిందామీదా పడి వస్తున్నాడు.

“వాడదాకా” అన్నాడు క్రిష్ణారెడ్డి.

“మరి నన్ను పిలవరేం. నేనురానా?” అన్నాడు చినమస్తాన్.

“పరాచికాలతో ఏంగానీ వాడలో ఏం పని?”

క్రిష్ణారెడ్డి విషయం చెప్పాడు.

“ఎవర్నయనా పంపవచ్చనుకో. పని సానుకూలమవుతుందో లేదోనని నేనే స్వయంగా పిచ్చిరెడ్డిని వెంటేసుకొని బయలుదేరాను.”

“బాగుంది. కొండ మహమ్మద్ దగ్గరకు రాకపోతే మహమ్మదే కొండ దగ్గరికి వెళ్లాలి అంటారు. ఔనా?” అన్నాడు చినమస్తాను.

“ఔను.”

“ఏమిటి ఔనండి. రౌతు మెత్తనయితే గుర్రం మూడుకాళ్ల నడుస్తుంది. చేటుకాలం వచ్చిపడింది. పనిబాటల వాళ్లకు కళ్లు నెత్తిమీదికి వచ్చాయి. నిన్నూ నన్నూ ఎవర్నీ లెక్క చెయ్యడంలేదు. మనమే వాళ్లని పైకెత్తుతున్నాం. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అనుభవించక తప్పదు. వెళ్లిరండి” అంటూ విసవిసా ముందుకు దాటుకొని వెళ్లాడు.

క్రిష్ణారెడ్డి వాడవైపు నడక సాగించాడు. చినమస్తాన్ మాటల్లోని ఆగ్రహం క్రిష్ణారెడ్డికి నవ్వు తెప్పించింది. పనిబాటలవాళ్ల పేరెత్తితే ఈ మధ్య అతను ఆగ్రహోదగ్రుడై పోతున్నాడు. ఆ ఆగ్రహానికి కుదురు ఎక్కడ వున్నదో క్రిష్ణారెడ్డికి తెలుసు.

ఆ మాటకొస్తే నిన్నమొన్నటిదాకా చినమస్తాన్ స్థితి పనిబాటల వాళ్ల స్థితికంటే అధ్వాన్నంగా ఉండేది. కానీ ఆ విషయం అతను మర్చిపోయాడు. అతని తప్పేం లేదు. స్థితి మారితే ఎవరైనా అంతేనేమో! చినమస్తాన్‌కు పిత్రార్జితం ఒక పూరి కొంప తప్పితే చెప్పుకోదగ్గ ఆస్తి మరొకటి లేదు. అర్ధరూపాయా, రూపాయా కూలి పనులకు వెళ్లేవాడు.

యుద్ధాలప్పుడూ, దేశం అభివృద్ధి చెందే దశలోనూ సంపాదనకు విస్తృతావకాశాలు ఏర్పడుతాయి. చినమస్తాన్ వున్న ఊరికి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం ప్రారంభమయింది. అవకాశాల్లేక ఊరుకున్నాడుగాని చినమస్తాన్ గడన తెలిసినవాడు. నిర్మాణం జరిగేచోట మొదట లేబర్ సప్లైకి కుదురుకున్నాడు. ఊర్లోనుంచీ, వాడనుంచీ నలభై యాభై మందిని రోజు పట్టుకెళ్లి ఫ్యాక్టరీ వాళ్లకి అప్పగించేవాడు. కూలి మనిషికి రోజుకి ఇరవై రూపాయలు గిట్టేది. ఇస్త్రీ బట్టలు నలగకుండా చినమస్తాన్‌కు కూలీల మీద కమీషన్ నూరుయాభై గిట్టేది. దాంతో అతనికి తృప్తి కలగలేదు. లేబర్ సప్లై ద్వారా పెట్టుబడికి కొంత డబ్బు సమకూరింది. చిన్న చిన్న కాంట్రాక్టు వర్కులు మొదలు పెట్టాడు. సిమెంటూ, ఇనుమూ ట్రాక్టర్లకూ ట్రాక్టర్లకు బయటకు తరలించి అమ్ముకున్నాడు. ఈ పనులన్నీ ఒకవిధంగా బాహాటంగానే చేశాడు. కాకపోతే సెక్యూరిటీ గార్డులకు, ఇంజనీర్లకూ, ఎమ్.డీలకు కొంత వాటా ఇచ్చాడు. అంతా ఒకడే తింటే ఆ సొమ్ము అరగదు! రెండేళ్లలో పదిలక్షలకు పైగానే సంపాదించాడు. అతనికిప్పుడు రెండు లారీలు ఉన్నాయి. ఒక ట్రాక్టరు వుంది. వడ్డీ వ్యాపారం వుంది. ఊరి గుడిసేవాడో మేడగా మారింది.

“పనిబాటల వాళ్లమీద మనపట్టు సడలడానికి చినమస్తాన్లాంటి వాళ్లే కారణం” అన్నాడు పిచ్చిరెడ్డి.

క్రిష్ణారెడ్డి ఆలోచనలు ఎక్కడో వున్నాయి. అతను వెళ్లే పనినే గురించే ఆలోచిస్తున్నాడు. ఐనా, పిచ్చిరెడ్డి అన్నమాట అతను చెవిలో వేసికోకపోలేదు.

“ఎందుకని?” అన్నాడు పరధ్యానంగా.

“ఎందుకంటే చినమస్తాన్ లారీలూ, ట్రాక్టరూ ఊళ్లోదించాడు. అతణ్ని చూచి మరికొంతమంది ట్రాక్టర్లు తెచ్చారు. ఈ బండ్లతో కూలీలకు అరవై, డెబ్బై రోజుకు కూళ్లు గిడుతున్నవి. రైతుమీద ఆధారపడటం పోయింది. ఇక ఆచారాలూ, అనవాయితీలూ పడుబాటుగాక ఏం చేస్తాయి?” అన్నాడు పిచ్చిరెడ్డి ఎంతగానో దిగులుపడిపోతూ.

“కడంతకాలం ఎడ్లబండ్లే ఎక్కడ వుంటాయి? కాలం మారింది. ట్రాక్టర్లూ, లారీలూ వచ్చినై. కాలంతోపాటు మనం మారడం నేర్చుకోవాలి” క్రిష్ణారెడ్డి అన్నాడు.

పిచ్చిరెడ్డికి క్రిష్ణారెడ్డి చెబుతున్నది మింగుడుపడటం లేదు. ముఖమంతా మాడ్చుకున్నాడు తప్ప మారుమాట చెప్పలేదు.

“పలకవేం?” అన్నాడు క్రిష్ణారెడ్డి.

“ఆచారాలు వదులుకోవాలా?” అన్నాడు పిచ్చిరెడ్డి పెడసరంగా.

“ముందీ సంగతి సెప్పరా పిచ్చిరెడ్డీ. మన ఆచారాలు మనం సక్రమంగా పాటిస్తున్నామంటావా? మాసూలు కాలంలో ఇంటిమాల కళ్లంలోకి వచ్చి ధాన్యం రాసికి పొలి చుట్టితే రాశి అడుగు వాళ్లకే వదిలేవాళ్లం. ఒక రాశి కింద ఏదుము గింజలుండేవి. మూడురాశులకు పొలిచుడితే వానికి సంవత్సరం పొడుగునా బత్తెం దొరికేది. అవన్నీ ఇప్పుడెక్కడున్నాయో చెప్పరా?” అన్నాడు క్రిష్ణారెడ్డి.

చదవండి :  తాతాచార్ల కథలు - సిపి బ్రౌన్

“ధాన్యం గిట్టుబాటుగాక అవి పండించడమే మానుకుంటిమి. మనకే లేనప్పుడు ఇక వాళ్లకెక్కడ నుంచి వస్తాయి?”

“గిట్టుబాటు కాదని వ్యాపారపు పంటలు పండించుకుంటున్నాం. వ్యవసాయాన్ని వ్యాపారం చేశాం. ఇక షబ్బందు కులాలవాళ్లు వాళ్ల వృత్తుల్ని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక ఆచారం ఎక్కడ చచ్చింది?” అన్నాడు క్రిష్ణారెడ్డి.

పిచ్చిరెడ్డి బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉండిపోయాడు. కాని క్రిష్ణారెడ్డి నోరు మూతపడలేదు. దారిపొడుగునా చెబుతూనే ఉన్నాడు.

“మన పనులు మనం చేసికోవడం మనకు నామోషి. ఆ పనులు మనకు ఎవరో చేసిపెట్టాలి. శవాలకు గుంతలు తీయడానికి ఒక కులం వాళ్లు కావాలి. గుడ్డలు ఉతకడానికి మరొకరు కావాలి. ఇంట్లో పశువు చస్తే తీసుకెళ్లడానికి మరొక కులం వాళ్లు కావాలి. మనకు ఈ పనులు చేస్తున్నందుకు వాళ్లను నీచంగా చూడటం తప్ప మనుషులుగా గౌరవించడం మనకు చేతగాదు. షబ్బందు కులాలలోనూ ఆత్మాభిమానం పెరిగింది. ఆచారాలను అడ్డం పెట్టుకొని పనులు చేయించుకునే రోజులకు కాలం చెల్లిందిరా పిచ్చిరెడ్డి. అది మనం గమనించాలి.”

క్రిష్ణారెడ్డి వాగ్ధారిణి అలా ఇంక ఎంతసేపు కొనసాగేదోకాని ఇద్దరూ హరిజనవాడ చేరుకున్నారు. క్రిష్ణారెడ్డి ఒకసారి వాడంతా కలయచూచాడు. ముసలీ ముతకా, పిల్లాపీచూ ఉన్నారేతప్ప కుర్రకారు ఎవరూ కన్పించలేదు. తన్నుచూచి ముఖం చాటేసుకున్నారో ఏమో.

క్రిష్ణారెడ్డి ఒక ఇంటిముందు ఆగి—

“ఒరే ధనియాలూ” అంటూ కేకవేశాడు.

కేకవేసిన కాసేపటికి ఇంట్లోనుంచి ఒక ముసలివాడు వచ్చి క్రిష్ణారెడ్డి ముందు నిలబడ్డాడు. నిజానికి వాని పేరు దనియాలు కాదు. తల్లిదండ్రులు పెట్టిన శుభ్రమైన పేరు డేనియల్. ఆ పేరు అలా అపభ్రంశం అయింది. రైతులు కావాలనే వాళ్ల పేర్లను అపభ్రంశం చేస్తారు.

“పిల్చినారా అయ్యా” అన్నాడు ధనియాలు.

“అవున్రా. నీతో పనిబడింది.”

“చెప్పబ్బా పనేందో. నా చేతనయిందయితే సేచ్చాను” అన్నాడు.

“చిన్నపురెడ్డి కాలమైపోయినాడు. తెల్సుకాదా? గుంత తీయాల. ఇద్దరో ముగ్గురో మనుషుల్ని పురమాయించు, అర్జంటు” అన్నాడు క్రిష్ణారెడ్డి టకటకా.

ధనియాలు నిమ్మకు నీరెత్తినట్టు నిలబడ్డాడుతప్ప ఉలకనూ లేదు పలకనూ లేదు. కాకపోతే కాసేపు తల గోక్కున్నాడు. కాసేపు పిర్రె బరుక్కున్నాడు.

“చెప్పేది నీకేరా” అన్నాడు క్రిష్ణారెడ్డి.

అప్పుడు ధనియాలు నోరు తెరిచాడు. వాడు చెప్పిన సారాంశం ఏమిటంటే — పీనుగుమీది సైనుగుడ్డకూ, దివసం రోజు పెట్టే పప్పన్నానికి గుంత తవ్వే రోజులుపోయాయి. దీనికి ఓ రేటు ఉంది. రేటు చెల్లిస్తే మనుషుల్ని పురమాయించడానికి అభ్యంతరం లేదు.

ఇక క్రిష్ణారెడ్డికి కొండ దిగిరాక తప్పలేదు.

“ఎంతిమ్మంటావు?” అన్నాడు క్రిష్ణారెడ్డి.

“వెయ్యి రూపాయలిప్పించడంబ్బా” అన్నాడు ధనియాలు.

“వెయ్యా?” అన్నాడు క్రిష్ణారెడ్డి ఆశ్చర్యంగా.

“దాంతో మేం మిద్దెలూ మేడలూ కట్టం. ముగ్గురు మనుషులం. తలా మూడొందలపై చిలుకు” అన్నాడు ధనియాలు.

తప్పదు. అవసరం అలాంటిది. సరే. క్షణాలమీద గుంతతవ్వాల. నేను ఊర్లోకి పోవడం, పాడె లేవడం ఆలస్యం — వెళ్లండి అంటూ క్రిష్ణారెడ్డి ఊరివైపు నడకసాగించాడు.

క్రిష్ణారెడ్డి ఊర్లోకి వచ్చేసరికి అంతా క్రిష్ణారెడ్డికోసమే ఎదురుతెన్నులు చూస్తున్నారు.

“ఏమైంది?” అన్నారు ఐదారు మంది ఏకకంఠంతో.

“ఇక ఆలస్యం దేనికి. సొంగ్యాలు కానిచ్చి పాడె లేవదీయండి.”

అన్ని సొంగ్యాలూ అర్ధగంటలో అయిపోయాయి. గోవిందా గోవిందా అంటూ పాడె పైకెత్తుతున్నారు. ముందు నడుస్తున్న దాసరి తంతె మీటుతూ తత్వం అందుకున్నాడు.

“ఆటన్నా పాటన్నా
తెరపై ఒక బొమ్మలాటన్నా”

పిచ్చిరెడ్డికి మట్టుకు తత్వమూ వినిపించలేదు. గోవిందలూ వినిపించలేదు. ఒక ఆచారానికి పాడె లేచినట్లుగా తెగ బాధపడిపోతున్నాడు.

సొదుం జయరాం

రచయిత గురించి

స్వర్గీయ సొదుం జయరాం గారు కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి వీరి ప్రసిద్ధ కథలు. వీరి కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. వీరు రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి. 2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్).

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: