గురువారం , 21 నవంబర్ 2024

‘నేను ఉన్నప్పుడు నా విలువ మీకు తెలియదు’..శ్రీమాన్ పుట్టపర్తి

తెలుగు సాహిత్యంలో ధృవతార సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆయన బహు భాషా కోవిదుడు. రాయలసీమ గర్వించదగ్గ భారతీయ సాహిత్యకారుడు.

సాహితీసేద్యంలో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ మహానుభావుని కుమార్తె నాగపద్మిని. నాన్నగారి (అయ్యగారు) జ్ఞాపకాలను ఆమె ఇలా పంచుకున్నారు …

పుట్టపర్తి నారాయణాచార్యులు

అది జనవరి 1972. రాత్రి 12 గంటల సమయం. ఇంట్లో వాళ్లందరూ మిద్దెపైన నిద్రపోతున్నారు. నేను మాత్రం బయాలజీ టూర్ వెళ్లేందుకు దుస్తులు సర్దుకుంటున్నాను. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు. ఎవరంటే- ‘టెలిగ్రాం’ అని సమాధానం. అసలే అర్ధరాత్రి. అందులోనూ అప్పుడెవరైనా వచ్చి టెలిగ్రాం అంటే సాధారణంగా ఏ ఇళ్లలోనైనా ఆందోళన చోటు చేసుకుంటుంది.

కానీ మా ఇంటి పరిస్థితి వేరు. మా అయ్యగారి (శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు) కోసం వివిధ సాహితీ సంస్థల నుంచి టెలిగ్రాములు ఎప్పుడంటే అప్పుడు రావడం మాకలవాటే. ఎలాంటి ఆందోళనా లేకుండా, టెలిగ్రామ్ తీసుకున్నాను. ‘కంగ్రాచ్యులేషన్స్ ఫర్ కన్‌ఫరింగ్ పద్మశ్రీ’ అంటూ ఇందిరాగాంధీ నుంచి టెలిగ్రాం. నా గుండె వేగం హెచ్చింది. ఆనందంతో నా కాళ్లు గాలిలో తేలిపోతున్నాయి.

రెండు మూడు అంగల్లో మిద్దెపైకి పోయి అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అయ్యగారిని ‘అయ్యా అయ్యా’ అంటూ లేపాను. మామూలుగా అయితే వారి శాంత గంభీరమూర్తిని చూస్తే మాకందరకీ కాస్త భయమే. కానీ ఆ క్షణంలో అవేవీ గుర్తు రాలేదు నాకు. అయ్య చేయి పట్టుకుని వూపేస్తూ ‘పద్మశ్రీ వచ్చినట్టు టెలిగ్రాం వచ్చిన సంగతి చెప్పాను – శుభాకాంక్షలు చెప్పి వెంటనే అమ్మనూ లేపేశాను ఈ శుభవార్త చెప్పటానికి.

చదవండి :  మార్చి 18 నుంచి కడపలో సీఆర్‌పీఎఫ్ ఎంపికలు

తను కూడా సంతోషంగా టెలిగ్రాం చదివి అయ్యగారి కేసి ఆరాధనగా చూసింది. కానీ అయ్య ‘అయ్యో! దీనికేనా ఇంత హడావిడిగా నిద్ర లేపావు? పొద్దున చెబితే ఏం కొంపలు మునిగేవి?’ అంటూ విసుక్కుని నీళ్లు తెప్పించుకుని తాగి, కాసేపు పచార్లు చేసి మళ్లీ మామూలుగా పడుకున్నారు. నిండుకుండ లాంటి వారి వైఖరి, ధీర గంభీరమైన వారి ఆలోచనాధోరణి ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎన్నెన్నో అనుభవాలను ఎదుర్కొన్న అయ్యగారు ఇలాంటి స్థితప్రజ్ఞతను అలవరచుకోవడం సహజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు.

అల్లరీ ఉంది..

ఎప్పుడూ గంభీరంగా అంతర్మథనంలో ఉన్నట్టు కనిపించే అయ్యగారు తన మలిసంజె వయసులో, చిన్నప్పటి అల్లరినంతా గుర్తు చేసుకుని తెగ నవ్వేవారు. మా అక్కయ్యల పిల్లలు వేసవి సెలవుల్లో మా ఇంట చేసే అల్లరికి అమ్మ వాళ్లు కోప్పడుతుంటే- ‘అల్లరి చేసే వయసులో అల్లరి చేయడమే ముద్దు.

ఎందుకట్లా వాళ్ళని కోపడతావు? బాగా అల్లరి చేయండి రా వెధవల్లారా!’ అని ముద్దుగా కోప్పడేవారు. వేసవిలో వాళ్ళంతా వచ్చినప్పుడు పిల్లలకు హోటల్ నుంచి టిఫిస్లు తెప్పించడం, చేతి నిండా చిల్లర నింపుకుని ఎవరు ప్రేమగా దగ్గరకొస్తే వాళ్ళకి ఆ డబ్బంతా ఇవ్వడం ఇలాంటివన్నీ ఎంతో ఉత్సాహంగా, పిల్లల్లో పిల్లవాడై చేసేవారాయన.

కూతుర్నికాదు.. శిష్యురాలిని

మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవడం ఆయనకు అలవాటు. భోజనమవగానే ‘రావే నాగా’అంటూ నన్నూ తనతో పాటు మిద్దె మీదికి తీసుకెళ్ళేవారు. అయ్య పక్కన పడుకుని పొద్దుటి నుంచీ నేను చేసిన పనులు చెబుతుండేదాన్ని. ఉ కొడుతూ ఉండేవారు ఆయన.

చదవండి :  ఎద్దుల ఈశ్వరరెడ్డి

నాకప్పుడు పది, పదకొండు సంవత్సరాలుంటాయేమో! నా మాటలు వింటూ ఉ కొడుతున్నారంటే మేల్కొని వున్నారనీ, మౌనంగా వున్నారంటే నిద్రలోకి జారుకున్నారనీ అర్థమయ్యేది నాకు. అయ్య రచనా వ్యాసంగమంతా ఆ గదిలోనే జరిగేది. అక్కడున్న చెక్క బీరువాలలో కాళిదాసు మొదలు కార్ల్‌మార్క్స్ వరకూ అందరూ కొలువుదీరి ఉండేవాళ్లు. తనను తాను నిత్య విద్యార్థి గానే పరిగణించుకునేవారాయన.

అరవై యేళ్ళ వయసులోనూ, ఎదురింటి భాస్కర భట్ల కృష్ణమూర్తి (ఆకాశవాణి కడపలో నిలయ కళాకారుడు)వద్ద మృదంగ జతులు నేర్చుకునేవారు! ఎన్ని భాషలు నేర్చినా ఉర్దూ లిపిని రాయడం, చదవడం నేర్వలేకపోయానని తరచూ అంటూ ఉండేవారు! తన డెభ్భై ఏళ్ళ వయసులో, పలకపై ఉర్దూ అక్షరాలను రాయడం ఉర్దూ పుస్తకాలను చదివే ప్రయత్నం చేసే అయ్యగారిని చూస్తుంటే ఆశ్చర్యం వేసేది నాకు? ఈ అవిశ్రాంత సాహితీ కృషీవలత్వం అయ్యగారికి ఎలా అబ్బిందా? అన్నది ఇప్పటికీ అవగతం కాదు మరి! మా ఇంట్లో మా అమ్మ పట్టుబట్టి కొన్న రెండు మూడు చెక్క కుర్చీలు, టేబుళ్లే ఫర్నీచర్. ఎవరొచ్చినా అవే ఆసనాలు. ఎక్కువ మంది వస్తే చాపలు ఉండనే ఉన్నాయి.

అయ్య తన గదిలో మిద్దెపైన రాసుకుంటున్నారంటే చనువుగా అక్కడికే వెళ్లి వారితో మాట్లాడేవారు. పెద్దలంతా అయ్యగారితో పాటు చాపల పైన కూర్చునేవారు. వాళ్లొచ్చినప్పుడు తన దగ్గరున్న గంట మోగించేవారు. కింద అమ్మకు వినబడేలా. ఇక వచ్చినవారికి కాఫీలు తయారుచేస్తే.. పైకి అందించే తంతు నాది. నాకూ ఈ పనులు చేయటంలో ఆనందమే ఆనందం. కాఫీలందించి అక్కడే కూర్చునేదాన్ని, వాళ్ల సంభాషణలు వింటూ.

చదవండి :  శ్రీభాగ్ ఒప్పందం లేదా ఒడంబడిక

నా ఈ ఆరాధనకు కారణం నేనో రకంగా వారి శిష్యురాలిని కావటమే. నా పదమూడు, పదునాలుగేళ్ళ వయసు నుంచే అయ్యతో పాటూ, ఆయన సన్మాన సభలకు నేనూ వెళ్ళేదాన్ని. గుంటూరు, శ్రీశైలం, కర్నూలు, హైదరాబాద్, ఇలా వెళ్ళిన చోటల్లా ఆత్మీయ స్వాగతాలు, ఆరాధనా పూర్వక సత్కారాలు. హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్‌లో ప్రాకృతోపన్యాసాలు మాలికలు, తిరుప్పావై వ్యాఖ్యాన ధారావాహికలు. వీటన్నింటిలోనూ మా అయ్యగారిగానే కాక, వారి అసంఖ్యాక అభిమానుల్లో ఒకదానిగా వినేదాన్ని.

ఆయన విలువ ఎవరికి తెలుసు?

‘నా భార్య కనకమ్మ తానూ విదుషీమణి అయినా భర్త చాటుగానే ఉండేది. నేను చెబుతుంటే రాయడం, నేను దిద్దిన తరువాత ఫెయిర్ చేయడం, వీటిలోనే ఆమెకు ఆనందం ఎక్కువ. కవిత్వం రాయగలిగే స్థాయి ఉన్నా నా పనులకే తన సమయాన్ని కేటాయించేది. ఆమె తనువు చాలించడంతో నేను పూర్తిగా అచేతనుణ్ణయిపోయానం’టూ గద్గద స్వరంతో చెప్పే అయ్యగారిని చూస్తే కడుపు తరుక్కుపోయేది. డెబ్బై ఆరేళ్ల వయసులో ‘నేను ఉన్నప్పుడు నా విలువ మీకు తెలియదు. వెళ్లిపోయిన తరువాతే బాగా తెలుస్తుంద’న్నారు ఓ సందర్భంలో.

నా కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. నాకే కాదు. తెలుగు సాహిత్య లోకానికంతటికీ ఆ సరస్వతీ పుత్రుని విలువ తెలియదేమో అనిపిస్తుంది ఇప్పుడు. అయ్య, అమ్మల స్మృతులే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా గడుపుతున్న మా కుటుంబ సభ్యుల జ్ఞాపకాలు ఎందరితో ఎన్ని విధాల పంచుకున్నా అంతమంటూ ఉండదు.

– డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: