
నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా – అన్నమయ్య సంకీర్తన
పదకవితా పితామహుని ‘కడపరాయడు’ ఎవరినో తలపోస్తూ కోపిస్తున్నాడని కలహాంతరియైన నాయిక ఇట్లా వాపోతున్నది.
వర్గం : శృంగార సంకీర్తన
రాగము: హిందోళవసంతం
రేకు: 0214-2
సంపుటము: 8-80
నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా
మీనుల వినుమంటేను వేసరేవుగాక ॥పల్లవి॥
కప్పుర మిచ్చితిఁ గాక కవకవ నవ్వితినా
రెప్పల మొక్కితిఁగాక రేసు రేచేఁనా
ముప్పిరినెవ్వతెచేనో ముందువాడివచ్చి
దప్పితో నొక్కటొక్కటే తలచేవుగాక ॥నేనుసేసే॥
చిగురందిచ్చితిఁగాక చేగోరు దాఁకించితినా
మొగమోటనుంటిఁగాక ముంచికైకోనా
మగువ యెవ్వతెచేనో మర్మాలు తొరలి వచ్చి
పగటులనూరకే భ్రమసేవుగాక ॥నేనుసేసే॥
రతులఁ గూడితిఁ గాక రాజసము చూపితినా
సతమై యుండితిఁగాక సాదురీతిని
గతియై శ్రీవేంకటేశ కడపలోఁ గూడితివి
మతి నెవ్వతోఁ దలఁచి మలసేవుగాక ॥నేనుసేసే॥