రాయలసీమలో 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో మూడు ప్రాంతాలను పోల్చి చూసినట్లయితే జీవనప్రమాణాలు బాగా దిగజారాయని,నిరాదరణకు గురయిన ప్రాంతం తెలంగాణా కాదనీ రాయలసీమేనని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది.
రాష్ట్ర అభివృద్ధి పై దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అవలంభించిన దృక్ఫధాన్నే శ్రీ కృష్ణ కమిటీ కూడా ప్రతిబింబించడం గమనార్హం! గ్రామీణ ప్రాంతాల్లో ఆ దశాబ్దకాలంలో ఆదాయంలో మార్పులను గమనించినట్లయితే తెలంగాణలో సంపన్న వర్గాల్లోనే ఆదాయ వృద్ధి కనిపించింది. అదే కాలంలో పేదలు, అణగారిన వర్గాల వారి ఆదాయం బాగా క్షీణించింది. కోస్తాంధ్రాలో సంపన్నుల ఆదాయంలో క్షీణత కనిపించింది.
ఒక ప్రాంతంలోని ఆర్థిక అసమానతలు ఆ ప్రాంతంలోని వర్గాల మధ్య అశాంతికి కారణమవుతాయి. తెలంగాణలో.. ఉన్నవారు, లేనివారి మధ్య పెరుగుతున్న అసమానతల కారణంగా ప్రత్యేక రాష్ట్ర ఆందోళన మరింత తీవ్రం అవుతుంది. ఫలితంగా కొన్ని వర్గాల వారు, రాజకీయ పార్టీలు ఈ ఆందోళనకు జనాన్ని పావులుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. తెలంగాణ అంశాన్ని పేదరికం, నిరాదరణ, సాధికారికత కోణంలో చూస్తే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాంతాల వారీగా వృద్ధి రేటును పరిశీలిస్తే ఆర్థిక పురోగతిని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోల్చితే తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా 1993-94 నుంచి అత్యధిక వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో చూసినప్పటికీ.. రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య జిల్లా స్థూల ఉత్పత్తి (డీడీపీ)లో పెద్దగా తేడాలు లేవు. ఆర్థిక వృద్ధి, అభివృద్ధి అంశాల్లో తెలంగాణ ప్రాంతం (హైదరాబాద్ మినహాయించి).. కోస్తాంధ్రాతో సమానంగానే ఉందని శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడించింది. లేదా కోస్తాంధ్రా కంటే కాస్తంత మాత్రమే దిగువన ఉందని పేర్కొంది. వివిధ ఆర్థిక, అభివృద్ధి సూచికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని తెలిపింది.
మొత్తం మీద చూస్తే నిరాదరణకు గురయిన ప్రాంతం తెలంగాణ కాదని, రాయలసీమ అని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రధాన ప్రాంతాలు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రాల్లో ఆర్థికవృద్ధి, అసమానతలు, అభివృద్ధి తదితర అంశాలను శ్రీకృష్ణ కమిటీ నివేదికలో కూలంకషంగా చర్చించారు.
ఆర్థిక అసమానతలు, వృద్ధిరేటులు తదితర అంశాలను పోల్చడానికి అనువర్తిత ఆర్థిక పరిశోధన జాతీయ మండలి (ఎన్‌సీఏఈఆర్) మానవ అభివృద్ధి సర్వేలను, కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ రూపొందించిన గణాంకాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ విభాగాలు రూపొందించిన గణాంకాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది.
నివేదికలోని ముఖ్యాంశాలు.. కొన్ని సూచికలను బట్టి గమనించినట్లయితే తెలంగాణ వెనకబడి ఉంది. అందుకు ఆర్థిక వ్యవస్థాగతాంశాలు ఒక కారణం కాగా ఆర్థిక కార్యకలాపాలను హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా కేంద్రీకరించడం మరో కారణం. తెలంగాణ ప్రాంతంలో వాణిజ్యబ్యాంకుల సేవలు మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువ. పంచాయితీల స్థాయిలో ఆర్థిక వికేంద్రీకరణ కూడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువ.
వైద్య విద్యా వసతులు, సేవారంగంలో ఉపాధి వంటివి హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా కేంద్రీకృతమవడంతో తెలంగాణలోని మిగతా ప్రాంతంలో సేవలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోని ఈ అసమానతలను వెంటనే తొలగించాల్సిన అవసరముంది. 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో తెలంగాణ, రాయలసీమల్లో అసమానతలు పెరిగాయి. కోస్తాంధ్రాలో ఆదాయ అసమానతలు తగ్గాయి. అన్ని ప్రాంతాల్లోనూ రైతుల ఆదాయం దాదాపు స్థిరంగా ఉండగా, వ్యవసాయ కార్మికుల ఆదాయం మాత్రం తెలంగాణలో బాగా పడిపోయింది. కోస్తాంధ్రాలో గణనీయంగా పెరిగింది. ఎస్సీ, ఎస్టీలు, అల్పసంఖ్యాక వర్గాల వారి ఆదాయం తెలంగాణలో పడిపోగా, కోస్తాంధ్రాలో బాగా పెరిగింది.
రాష్ట్ర అభివృద్ధి పై దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అవలంభించిన దృక్ఫధాన్నే శ్రీ కృష్ణ కమిటీ కూడా ప్రతిబింబించడం గమనార్హం! శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో వెల్లడైన అంశాల ఆధారంగా తెలంగాణా కంటే ముందుగా రాయలసీమ అభివృద్ధి పైననే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారంచాల్సిన అవసరం ఉంది.