నరులారా నేడువో నారసింహ జయంతి — అన్నమాచార్య సంకీర్తన
నరులారా నేడువో నారసింహ జయంతి |
సురలకు ఆనందమై శుభము లొసగెను ||
సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివారం
మందు సంధ్యాకాలమున ఔభళేశుడు |
పొందుగా కంభములో పొడమి కడప మీద
కందువ గోళ్ళ చించె కనక కశిపుని ||
నరమృగరూపము నానాహస్తముల
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచె
గురుతర బ్రహ్మాండ గుహలోనను ||
కాంచనపు గద్దెమీద గక్కున కొలువైయుండి
మించుగ ఇందిర తొడమీద బెట్టుక |
అంచె శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుండై
వంచనసేయక మంచి వరాలిచ్చీ నిదివో ||