తాకట్టు (కథ) – సొదుం జయరాం

తాకట్టు (కథ) – సొదుం జయరాం

తాకట్టు

అరుణకు పుట్టింటి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చించి చదవగానే ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఒకసారి కాదు, రెండుసార్లు చదివింది. కరుణకు పెళ్లి ఖాయమైంది. అదీ ఆ ఉత్తరంలోని వార్త. రెండు మూడు రోజుల్లో పెళ్లికి పిలవడానికని అన్నగారొస్తున్నారు. అరుణ ఆనందంతో పరవశించిపోయింది. చెల్లెలి పెళ్లి అనగానే సంతోషమే కాదు, ఒక సమస్య కళ్లముందు నిలిచింది. దాంతో చప్పున గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఆ సమస్యకు తక్షణం ఏదో పరిష్కారం కనుగొనాలి. ఆమె మెల్లగా నీలకంఠం దగ్గరికి వచ్చింది.

నీలకంఠం అరుణ రాకను గమనించలేదు. నులక మంచంలో పద్మాసనం వేసుకొని కూర్చొని తదేకంగా ఏదో పుస్తకం చదువుతున్నాడు. డిటెక్టివ్ పుస్తకం కాబోలు అనుకుంది అరుణ.

“ఏమండీ” అంది అరుణ.

నిశ్చల తపస్సమాధిలో ఉన్న నీలకంఠానికి అరుణ అస్పష్టంగా గొణిగిన ఆ మాటలు వినిపించినట్టు లేదు. అతను ఉలకనూ లేదు, పలుకనూ లేదు.

“మిమ్మల్నే” అంది మళ్లీ అరుణ.

అప్పుడతనికి కాస్త తపోభంగం అయినట్లుంది. పుస్తకం మీదనుంచి దృష్టి మరల్చి అరుణవైపు చూశాడు.

“పిలిచావా అరుణా?” అడిగాడు నీలకంఠం.

“ఒకసారి కాదు, రెండుసార్లు. ఏమిటి అంత ఇంటరెస్టుగా చదువుతున్నారు?” అడిగింది అరుణ.

నీలకంఠం మంచంమీద కొంచెం జరిగి,

“కూర్చో అరుణా, చెబుతాను” అన్నాడు.

అరుణకు చిరాకు కలిగింది. తానేదో చెప్పడానికి వస్తే పట్టించుకోకుండా ఏదో చెబుతానంటున్నాడు. తనకు వినాలని లేదు.

“అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందండీ” అంది అరుణ.

“వచ్చిన ఉత్తరం మళ్లీ వెనక్కుపోదు. తర్వాత చూద్దాం. ముందు నువ్వు కూర్చో” అన్నాడు నీలకంఠం.

అసహనంగానే అరుణ అతని పక్కన కూర్చుంది. ఆమెకది మామూలే. ఆరు నూరైనా అతని మాట నెగ్గాలి. తాను చెప్పింది ఇతరులు వినాలి. ఇతరులు చెప్పింది తాను వినిపించుకొనే అలవాటు లేదు.

నీలకంఠం మళ్లీ రెండు క్షణాలు సమాధిలోకి వెళ్లాడు. ఎట్టకేలకు నోరు తెరిచి నిశ్చలంగా, గంభీరంగా,

“మన ఇల్లు చూశావు గదా?” అన్నాడు.

అరుణ ఒక్క క్షణం అవాక్కయిపోయింది. ఆమెకు కోపం ముంచుకొచ్చింది. అతడ్ని లాగిలెంపకాయ కొడదామన్నంత కోపం ముంచుకొచ్చింది. కోపం వచ్చినప్పుడల్లా నవ్వడానికి అలవాటు చేసుకొంది. నీలకంఠం వేసిన ఆ చొప్పదంటు ప్రశ్నకు ఆమె పకపకా నవ్వింది. పడి పడి నవ్వింది.

“ఈ కొంపకు నేనొచ్చి పదేళ్లయింది. ఇందులో అణువణువూ నాకు తెలుసు. మీరు గమనించారో లేదో వంటింట్లో నాలుగు దంతెలు విరిగాయి. మరో రెండు దంతెలు చిట్లాయి. వేరుశనక్కాయలు పోసే రూములో ఒక దూలం రేపో మాపో విరిగేదేకానీ, పోట్లు పెట్టడం మూలాన విరగడానికి వీలులేక అలాగే ఉంది. మనం కూర్చున్న ఈ మొగసాలలో కూడా…”

“ఆపు అరుణా, నేనడిగింది అది కాదు.”

“ఇంకేమిటో చెప్పండి?”

“మన ఇంటికి ఆగ్నేయం వైపున ఉన్న బిడువు జాగా గమనించావా అని అడుగుతున్నాను. నువ్వేదో దండకం చదువుతున్నావు” అన్నాడు నీలకంఠం.

“గమనించకుండా ఉండడానికి నేనేమన్నా గుడ్డిదాన్నా? ఆ బిడువు జాగాలో నాలుగు జిల్లేడు చెట్లున్నాయి. రెండు ఉమ్మెత్త చెట్లున్నాయి. ఒక చిన్న రేగు చెట్టు ఉంది. ఇంకా కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి. నేనే గమనించాననడానికి సాక్ష్యం చాలా” అంది అరుణ.

“కొంచెం సీరియస్‌గా విను అరుణా. ఇప్పుడు మనం పడుతున్న ఇబ్బందులన్నింటికీ ఆ బిడువు జాగా మూలం. ఇప్పుడర్థమైందా?” అన్నాడు నీలకంఠం.

అరుణకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. అర్థం కానప్పుడు నవ్వే చాయిస్. అందుకని ఆమె మామూలుగానే పడి పడి నవ్వింది. నవ్వి—

“ఏమిటండీ మీ పిచ్చి!” అంది అరుణ.

“పిచ్చికాదు అరుణా. ఈ పుస్తకం ఒకసారి చదువు” అంటూ అరుణ చేతికి చదువుతున్న పుస్తకం ఇచ్చాడు.

అరుణ నిర్లిప్తంగా ఆ పుస్తకం అందుకొని ఒకసారి దాన్ని పరకాయించి చూసింది.

వాస్తుశాస్త్రం.

అరుణ ఒక పేజీ అట్లా తిప్పింది. ఐదే ఐదేళ్లలో పది ఎడిషన్లు వేశారు. ఎడిషన్‌కు ఐదువేలు. అంటే యాభైవేల కాపీలు. లక్షలాది మంది చదివి ఉంటారు. వాళ్లలో నీలకంఠం ఒకడు. ఈసారి ఆమెకు అతని పట్ల జాలి కలిగింది.

“సరే, ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నారు?” అంది.

“ఆ బిడువు జాగా చుట్టూ గజం ఎత్తు ప్రహరీ గోడ కడతాను. అందులో ఒక మూల బాత్రూం ఏర్పాటుచేస్తాను. దాంతో శని విరగడవుతుంది” అన్నాడు నీలకంఠం.

“ఖర్చు ఎంతవుతుంది?” అంది అరుణ.

“ఎంతోనా? పదివేలు.”

“పదివేలు ఇప్పుడు అనవసరంగా ఖర్చుపెడతారా?”

“ఆరువేలు అప్పున్నవాడికి అర్ధరూపాయ గంజాయి ఒక లెక్కలోది కాదు. బాగుపడదల్చుకున్నప్పుడు ఈ మొత్తం ఒక లెక్కలోది కాదు.”

ఆ మనిషితో వాదించి జ్ఞానోదయం కలిగించడం తన వల్ల అయ్యేపని కాదనిపించింది అరుణకు. తాము చేస్తున్నదేమో వ్యవసాయం. మూడేళ్లుగా ఇంట్లో గింజలు మంట్లో పొయ్యడం తప్ప, మంట్లో గింజలు ఇంట్లోకి రావడం లేదు. ఒక సంవత్సరం అతి వృష్టితో కరువు, మరో సంవత్సరం అనావృష్టితో ఎట్టి కరువు. కరువు పిలిస్తే పలుకుతోంది. కష్టాలు కాక మరేం ఉంటాయి? బిడువు జాగా చుట్టూ ప్రహరీ గోడ కడితే ఈయనకొక్కడికే వర్షాలు పడతాయా? ఆయన్నని లాభం లేదు. దరిద్రం నానాక చింతా అని ఊరికే అనలేదు పెద్దలు.

చదవండి :  సీమ బొగ్గులు (ముందు మాట) - వరలక్ష్మి

“నిజంగానే పని మొదలుపెడుతున్నారా?” అంది అరుణ.

“రేపే మొదలుపెడుతున్నాను. ఇటుకలు రేపు వస్తాయి. బేల్దార్లకు అడ్వాన్సులు కూడా ఇచ్చాను” అన్నాడు నీలకంఠం.

అరుణకు చెప్పలేని తామసం వచ్చింది.

“మీ ఇష్టం. మీరేం చేసుకున్నా నాకభ్యంతరం లేదు. చూడండి, వారం రోజుల్లో కరుణ పెళ్లి ఉంది. బ్యాంకులో తాకట్టులో ఉన్న నగలు విడిపించి తీరాలి. అవి విడిపిస్తేనే నేను పెళ్లికి వెళ్తాను” అంది అరుణ కటువుగా.

ఒక్క క్షణం నీలకంఠం అప్రతిభుడయ్యాడు. తేరుకొని—

“కుతికెల మీద కత్తిపెట్టినట్లు మాట్లాడకు. వారం రోజుల్లో వాటిని విడిపించడం సాధ్యమయ్యే పనేనా? తెలిసి ఉండే మాట్లాడుతున్నావా?” తీవ్రంగా అన్నాడు నీలకంఠం.

మాటకు మాట తెగులు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. చివరకు నీలకంఠం రెచ్చిపోయి అరుణ చెంప చెళ్లుమనిపించాడు. నీలకంఠం చేతికి పని చెబితే, అరుణ నోటికి పని చెప్పింది. ఏడుస్తూనే అతని జీవితానికంతా సరిపోయేటన్ని తిట్లు పెట్టింది. మంగమ్మకు మెలకువ వచ్చింది. ఆమె లేచి వచ్చినా అరుణ దండకం ఆపలేదు. ఎందుకు కొట్లాడుకుంటున్నారో మంగమ్మకు అర్థం కాలేదు. అరుణ అలా బరితెగించి మాట్లాడడం మంగమ్మకు నచ్చలేదు.

“నోరు మూస్తావా లేదా అరుణా” అంటూ మంగమ్మ కసురుకుంది.

ఇక అరుణ నోరెత్తలేదు. మంగమ్మంటే అరుణకు భయమూ, భక్తి — రెండూ ఉన్నాయి. కానీ, తనది తప్పు లేదని చెప్పడానికి మళ్లీ నోరు విప్పింది.

“కరుణ పెళ్లి రోజుల్లో ఉంది. బ్యాంకులో ఉన్న తాకట్టు నగలు విడిపించమన్నాను. ఆ మాటన్నందుకు ఎంతగా చెయ్యి చేసుకున్నాడో చూడండి” అంటూ చెంప చూపి బోరున ఏడ్చింది.

చెంపమీద వాతలు తేలాయి. మంగమ్మ హృదయం కలుక్కుమంది.

“నువ్వు మనిషివా, పశువువా?” అంది పళ్లుపటపట కొరుకుతూ.

నీలకంఠం నిట్రాయిలా నిలబడ్డాడు తప్ప నోరు మెదపలేదు. దాంతో ఇంట్లో సద్దుమణిగింది. రెండు, మూడు గంటలు ఆ ఇంట్లో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది.

అరుణ కొంచెం తేరుకున్న తర్వాత—

“అరుణా, నీ చెల్లెలి పెళ్లా? ఎవరొచ్చి చెప్పారు?” అంది మంగమ్మ.

“ఉత్తరం వచ్చింది” అంది అరుణ చీదుతూ.

“నిశ్చయతాంబూలాలప్పుడు పిలవకుండా ఏకంగా పెళ్లికి పిలవడానికి వస్తున్నాడన్నమాట, మంచిదే” అని నిట్టూర్చింది మంగమ్మ.

అరుణ అంత దూరం ఆలోచించలేదు. చెల్లెలు కరుణకు పెళ్లి అవుతోందంటే సంతోషపడింది. తాకట్టు నగలు విడిపించుకోవాలని తాపత్రయపడింది. పుట్టింటివారు తన్ను నిర్లక్ష్యం చేశారన్న భావమే కలగలేదు. మంగమ్మ మాటల్లో ఆ విషయం తట్టింది. పుండు మీద కారం చల్లినట్లయింది.

“నేనంటే పుట్టింటివారికి లెక్కలేదు. కట్టుకున్న మొగుడికీ లెక్కలేదు. నా కర్మ” అంటూ మళ్లీ సన్నగా ఏడ్వడం మొదలు పెట్టింది.

“చీటికీ మాటికీ ఆ ఏడుపు ఏమిటి? నోరు మూసుకో” అంది మంగమ్మ మళ్లీ అసహనంగా.

మంగమ్మ గదమాయింపుతో ఏడుపునైతే దిగమింగుకున్నదికానీ, బ్యాంకులో ఉన్న తాకట్టు నగల విషయం మరచిపోలేకున్నది అరుణ.

“నగలు విడిపించమని ఆయనతో మీరైనా చెప్పండత్తయ్యా” అంది అరుణ.

డోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టుకున్నట్లుగా అనిపించింది మంగమ్మకు. మంగమ్మకు ఉబ్బసం ఉంది. మధుమేహ వ్యాధి ఉంది. రోజూ పది, పదిహేను రూపాయల మందులు వాడాలి. నెలరోజులుగా మందులు వాడడం కూడా మానుకున్నది.

“నీకు పరిస్థితులు అర్థం కావా అరుణా?” అంది మంగమ్మ.

అరుణకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. నోటికి తాళం వేసినట్లుగా అయిపోయింది.

“ఇంతకూ వాడేమంటాడు?” అంది మంగమ్మ.

“ఇల్లు వాస్తు బాగా లేదని పదివేలు ఖర్చు చెయ్యబోతున్నారు. నా నగలు విడిపించాలంటే మటుకు పరిస్థితులంటారు” అంది రోషంగా అరుణ.

ఆ ఇంటికి వాస్తు బాగా లేదనడం మంగమ్మకు ముల్లులా గుచ్చుకుంది. ఆమెకు ఒక్కసారి గతం కళ్లముందు మెదిలింది. వర్తమానమూ, భవిష్యత్తూ లేనివారు గతం నెమరువేసుకుంటారు. ఆ ఇంటికి తాను కోడలుగా వచ్చిన రోజులు గుర్తుకొచ్చాయి. వంద ఎకరాల మెట్టపొలం ఉండేది. గాటన ఐదారు కాండ్ల ఎద్దులుండేవి. ఏడెనిమిది మంది జీతగాళ్లు ఉండేవారు. పాతర్ల నిండా, గాదెల నిండా గింజలుండేవి. కళ్లంలో కొండల్లాగా వాములుండేవి. సందులేకుండా వచ్చిపోయే చుట్టపక్కాలు. ఇల్లు కలకలలాడుతుండేది. నలుగురు మగ బిడ్డల్ని కన్నది. ఇద్దరు ఆడబిడ్డల్ని కన్నది. అన్ని పెళ్లిళ్లూ ఈ ఇంట్లో రంగరంగ వైభవంగా జరిగాయి. కొడుకులంతా రెక్కలొచ్చి ఎవరికొచ్చింది వారు తీసుకొని వేరుపడ్డారు. అభం శుభం తెలియని నీలకంఠంతో తాను ఉంటున్నది. ఈ ఇంటికి అప్పుడు బాగున్న వాస్తు ఇప్పుడెందుకు బాగాలేదో ఆమెకు బోధపడలేదు.

“నగలు తాకట్టు నుంచి విడిపించే మార్గం ఆలోచించు అత్తయ్యా” అంది అరుణ.

“నీకంటే పసిపిల్లలు నయం. చెబితే అర్థం చేసుకుంటారు” అంది మంగమ్మ చిరాగ్గా.

“నువ్వు ఏమైనా అను. పెళ్లికి వెళ్లాలంటే నగలు కావాలి. అవి ఏదో రకంగా విడిపించుకోవాలి గదా” అంది అరుణ మొండిగా.

చదవండి :  మన జయరాం, మన సొదుం

“పోనీ ఒక పని చెయ్యరాదూ” అంది మంగమ్మ.

అరుణకు ప్రాణం లేచి వచ్చింది.

“చెప్పండి. ఏం చెయ్యమంటారు?” అడిగింది అరుణ ఎక్కడలేని ఉత్సాహంతో.

“నీ అన్నయ్యను అడిగి ఎంతుందో అప్పుగా ఇప్పించుకోకూడదూ?” అంది మంగమ్మ.

ఈ ఆలోచన పూర్తిగా కాకపోయినా కొంచెం నచ్చింది అరుణకు. మునిగిపోయేవాడు పూచికపుల్ల దొరికినా పట్టుకుంటాడు.

“అన్నయ్య వచ్చినప్పుడు మీరే అడగండి అత్తయ్యా” అంది అరుణ.

“అలాగే లేవే” అంది మంగమ్మ.

“కరుణకు ఇప్పుడు లక్షరూపాయల కట్నం ఇస్తున్నట్టు ఉత్తరం రాశాడు. ఆ రోజుల్లో నాకు ఏమీ ఇవ్వకుండా వట్టి చేతులతో సాగనంపారు. న్యాయమైతే కరుణతోబాటు నాకూ ఎంతోకొంత ఇవ్వాలి. మనం అదేం అడగటం లేదు. అప్పుగానైనా ఇవ్వరా అత్తయ్యా” అంది అరుణ.

“చూద్దాం” అంది మంగమ్మ.

మంగమ్మకు మళ్లీ గతం జ్ఞాపకం వచ్చింది. అరుణ తనకు పరాయి పిల్లకాదు. స్వయానా తమ్ముడి కూతురు. ఆ తమ్ముడు అరుణకు పెళ్లి చెయ్యడం చేతగాక తన కాళ్ల దగ్గరికొచ్చిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. నీలకంఠానికి అరుణను చేసుకోమని అడగటానికొచ్చాడు. వచ్చి మూడు రోజులు ఇంట్లో ఉన్నాడు. అడగటానికి ధైర్యంలేదు. తానే అడిగింది –

“ఏం పని మీద వచ్చావు?” అని.

తల నేలకొంచుకొని దీనంగా అప్పుడు చెప్పాడు వచ్చిన పని. వచ్చిన పని సానుకూలమవుతుందని అతనికి ఏ కోశానా నమ్మకం లేదు.

“ఎన్ని తులాలు పెడతావు?” అంది మంగమ్మ.

“నీకు తెలియకుండా నా దగ్గర బంగారమెక్కడ ఉంది? కుతికెల దాకా అప్పుల్లో ఉన్నాను” అన్నాడు గుడ్లమీద నీరు పారాడుతుండగా.

తోడబుట్టినవాడు కంటతడి పెడితే ఆమె హృదయం వెన్నలా కరిగిపోయింది.

“సరే. ఎవరన్నా అడిగితే ఇరవై తులాల బంగారం పెడుతున్నానని చెప్పు. ఊరికే చేసుకున్నానంటే నా కుటుంబానికి నామోషీ, ఊరికే అరుణను సాగనంపడమంటే నీకు నామోషీ, అలా జరగకూడదు. పొద్దుటూరుకి వెళ్లి బంగారం కొను. నలుగురి ఎదుట కొను. డబ్బు నేనిస్తాను” అంది.

అరుణ తండ్రి నారాయణకు మంగమ్మ అక్కలాగా కనిపించలేదు ఆ క్షణాన. దేవతలాగా కనిపించింది. ఆ రోజే ఆమె ఇరవై తులాల బంగారానికి కావలసిన డబ్బుకూడా సర్దింది. పుట్లు పుట్లు పండేవి. పెసలు పండేవి. తీయకుండా ఎప్పటికీ ఐదారు పాడిపశువులుండేవి. వీటి ద్వారా వచ్చిన డబ్బే ఆమె దాపరికం. కొడుకులూ కోడళ్లూ ఆమె సంపాదన గురించి పట్టించుకొనేవారు కాదు. అట్లా జరిగిపోయింది అరుణ పెళ్లి.

అరుణను మంగమ్మ తన కోడలుగా తెచ్చుకోవడంలో కొంత స్వార్థం కూడా ఉంది. నీలకంఠం బి.ఏ. దాకా చదువుకున్నాడు. చదువుకున్న పిల్లను పెళ్లి చేసుకోవాలన్నది వాడి కోరిక. అరుణ చదువుకున్నది. సలక్షణంగా ఉంది. అంతేకాదు, తాను ముసలిముప్పున మంచానా కుంచానా పడితే ఏగడానికి అయినింటి పిల్లకున్న మమకారాలు పరాయి పిల్లకు ఉండవన్నది కూడా ఆమె ఆలోచన. ఇన్ని విధాల ఆలోచించి ఆమె అరుణను కోడలుగా చేసుకుంది.

ఆరోజు అరుణకు తాను పెట్టిన బంగారమే ఇప్పుడు బ్యాంకులో తాకట్టులో ఉంది. దాన్ని విడిపించడానికి అప్పుగానైనా సరే అరుణ అన్నయ్యను అడగటమంటే ఆమె మనసు అదోలాగా అయిపోయింది. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. ఒకప్పుడు అరుణ పెళ్లికోసం తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డవాళ్లు ఇప్పుడు కరుణ పెళ్లికి లక్ష రూపాయలు కట్నమిస్తున్నారు. నారాయణ చనిపోయాక, అనుకుంటూంటే విన్నది. ఎన్ని కష్టాలున్నా వాళ్లని ఇంతవరకూ ఏనాడూ అప్పూ పప్పూ అడగలేదు. ఇప్పుడు అరుణ అడగమని ఒత్తిడిచేస్తే ఆమె మనసు గిలగిలలాడిపోయింది. చెడి బతికినవాళ్లంటే మంగమ్మకు చెడ్డ భయం. వాళ్లు డబ్బుకిచ్చే విలువ మనుషులకు ఇవ్వరని మంగమ్మ నమ్మకం.

మూడు రోజుల తర్వాత అరుణ అన్న హరిప్రసాద్ వచ్చాడు. ఈ మూడు రోజులూ కూర్చున్నా లేచినా అరుణ తలలో తాకట్టు నగలే తొలుస్తున్నవి. నీలకంఠం తన లోకంలో తానున్నాడు. ఆయుష్షు పోయిన ఇంటికి కాయకల్ప చికిత్స చేస్తున్నాడు. ఆగ్నేయ మూల బాత్రూం కట్టించడంలోనూ, ప్రహరీ గోడ కట్టించడంలోనూ మునిగి ఉన్నాడు. మంగమ్మ ఉన్నట్టుండి ఉబ్బసం ఎక్కువై దగ్గుకుంటూ మంచం దిగలేదు.

హరిప్రసాద్ రావడమే చాలా హడావిడిగా వచ్చాడు. బాడుగ జీపు తీసుకొని పల్లెలు తిరిగి ఇన్విటేషన్లు పంచుకుంటూ ఆ ఊరికి వచ్చాడు. వెనుక గుర్రాలు తరుముతున్నట్లుగా ఉంది అతని హడావిడి. ఇంట్లోకి రాగానే ఒక్కసారే అరుణని, బావని, ముసలామెని కూడా పలకరించాడు. ఆ తర్వాత ఇన్విటేషన్లు తీసుకొని ఊర్లోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నాడు.

“కాఫీ పెడుతున్నాను. కాసేపు కూర్చొని కాఫీ తాగి ఊర్లోకి వెళ్లవచ్చు గదా” అంది అరుణ.

“పల్లెలంబడి ఇప్పటికి ఎన్నిసార్లు కాఫీ తాగానో లెక్కలేదు. మళ్లీ కాఫీ ఎందుకు? పోనీ పెట్టు. ఊర్లోకి వెళ్లివచ్చిన తర్వాత కాఫీ తాగి బయలుదేరతాను” అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండానే అతను ఊరి మీద పడ్డాడు.

అతని తొందర చూస్తే అరుణకు భయం పట్టుకుంది. అప్పు విషయం మాట్లాడడానికైనా టైం ఇస్తాడో ఇవ్వడో అని. ఈ ఆలోచన రాగానే ఆమెలో టెన్షన్ పెరిగింది. ఆమెకు ఏమీ పాలుపోలేదు. కాఫీ పెట్టి దగ్గరికి వెళ్లి—

చదవండి :  మా నాయన సన్న పిల్లోడు (కథ) - బత్తుల ప్రసాద్

“అన్నయ్య వచ్చాడు” అంది.

“నా కళ్లకు ఇంకా శుక్లాలు రాలేదు. చూస్తూనే ఉన్నాను” అంది మంగమ్మ నిర్లిప్తంగా.

“మరీ… తాకట్టు నగల విషయం…” అంది నంగి నంగిగా అరుణ.

“నగలు… నగలు… అంటూ పానం కొరుక్కుతింటున్నావు. రానీ అడుగుతాను” అంది మంగమ్మ అసహనంగా.

హరిప్రసాద్ అరగంటలో ఊరు చుట్టి వచ్చాడు. అరుణ కాఫీ ఇస్తే తాగుతూ కూర్చున్నాడు. అరుణ గబగబా మంగమ్మ దగ్గరికి వెళ్లి –

“రా అత్తయ్యా త్వరగా, మళ్లీ అన్నయ్య బయలుదేరిపోతాడు” అంది ప్రాధేయపడుతున్నట్టుగా.

మంగమ్మ ఓపిక చేసుకొని, మంచంమీద నుంచి లేచివచ్చి వాకిట్లో నిలబడింది.

“ఆరోగ్యం బాగా ఉందా అత్తయ్యా?” అన్నాడు హరిప్రసాద్.

“ఇదిగో ఇట్లా ఉన్నాను” అంది మంగమ్మ.

“బావను, అరుణను రెండు రోజులు ముందే పెళ్లికి పంపు అత్తయ్యా” అన్నాడు హరిప్రసాద్.

“వస్తారు. కానీ, ఒక ఇబ్బంది ఉంది నాయనా. అదే నీతో మాట్లాడదామని వచ్చాను” అంది మంగమ్మ.

“ఏమిటి విషయం?” హరిప్రసాద్ అడిగాడు.

“మూడు సంవత్సరాలుగా దాని నగలు బ్యాంకులో తాకట్టులో ఉన్నవి. అవి విడిపించడానికి డబ్బు నువ్వు సర్దుబాటు చెయ్యాలి. నోటు రాయిస్తాం. వచ్చే పంటలో బాకీ తీర్చుకుంటాం” అంది మంగమ్మ.

అరుణ పెళ్లికి రావడానికి ముసల్ది ఇట్లాంటి డిమాండు ముందుంచుతుందని హరిప్రసాద్ ఊహించలేదు. మొదట దిమ్మెరపోయాడు. వెంటనే తేరుకొని –

“సర్దుబాటు చెయ్యడానికి నా దగ్గర డబ్బెక్కడిది అత్తయ్యా? లక్ష రూపాయలు కట్నం ఇస్తున్నాను. ముప్పై వేలకుపైగా పెళ్లి ఖర్చులవుతున్నాయి. మరో ముప్పైవేలు బట్టల ఖర్చు. ఈ ఖర్చులు సర్దుబాటు చేసుకోవడానికే తల ప్రాణం తోకకు వస్తున్నది. నేనెక్కడ సర్దేది ఇక మీ డబ్బు” అంటూ తెగేసి చెప్పాడు.

అరుణ కళ్లముందున్న ఆశల హరివిల్లు తునాతునకలైపోయింది. ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది. దాన్ని ఎలాగో దిగమింగి రుద్ధకంఠంతో—

“పోన్లే అన్నయ్యా, పెళ్లికి మీ బావ, పిల్లలూ వస్తారు. నేను రాలేను. అనుకోకండి” అంది.

హరిప్రసాద్ కొంచెం ఇరుకునపడ్డాడు. ఎవరు వచ్చినా, రాకపోయినా పెళ్లి ఆగిపోదు. కానీ, ఆడబిడ్డ పెళ్లికి రాలేదంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. ఎంత అప్రతిష్ఠ! ఈ ఆలోచన రావడంతోనే హరిప్రసాద్ ఒక మెట్టు కిందికి దిగాడు.

“పోనీ అరుణా, ఒక పని చెయ్యి. రేపు బావను ఊరికి పంపు. షావుకారు కృష్ణయ్య తెలుసుగా. ఆయనతో చెబుతాను. మీకు ఎంత డబ్బు అవసరమో నోటు రాసి, ఆయన దగ్గర తీసుకోండి” అన్నాడు హరిప్రసాద్.

అరుణ ప్రాణం కుదుటపడింది. మంగమ్మకు మట్టుకు బాధ కలిగింది. ఆ డబ్బేదో కృష్ణయ్యతో వాడే తీసుకొని సర్దుబాటు చెయ్యవచ్చు. గట్టిగా అడిగి వసూలు చేసుకోవడానికి వీలుండదని తిరకాసు వేశాడు. సరే, గుడ్డికన్నా మెల్ల మేలు అని మంగమ్మ సరిపెట్టుకుంది.

ఇక హరిప్రసాద్ ఒక్క క్షణం అక్కడ ఉండలేదు. అతను బయలుదేరి వెళ్లిపోగానే అరుణ—

“ఇక ఆయనతో చెప్పు అత్తయ్యా, పొద్దున్నే ఆయన మా ఊరు వెళ్లాలి. డబ్బు తేవాలి. బ్యాంకులో ఎంత బాకీ ఉందో ఏమో ఒకసారి వెళ్లి కనుక్కో అత్తయ్యా” అంటూ తొందర పెట్టింది.

నీలకంఠానికి ఇవేం పట్టలేదు. ఆగ్నేయమూల బేల్దార్లు బాత్రూం కడుతున్నారు. అక్కడే గోడ నీడలో మంచం వేసుకొని తాపీగా డిటెక్టివ్ నవల చదువుకుంటున్నాడు.

మంగమ్మ అక్కడికి వెళ్లి అడిగింది:

“బ్యాంకులో మనం ఎంత బాకీ ఉన్నాం?”

“బ్యాంకులో మనం ఏమీ బాకీ లేమే” అన్నాడు డిటెక్టివ్ పుస్తకంలోంచి తల పైకెత్తి.

“నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు” అంది మంగమ్మ అయోమయంలో పడి.

“నేను అచ్చతెలుగులోనే మాట్లాడుతున్నాను. మూడేళ్లుగా మనం వడ్డీ కూడా కట్టలేకపోయాం. నగలు వేలం వేసి అప్పుకు జమ కట్టుకున్నారు. మిగిలిన పదివేలూ మొన్ననే తెచ్చాను. దాంతోనే ఈ పని చేస్తున్నాను” అంటూ బాత్రూం వైపు చూపించాడు.

నీలకంఠం చాలా తాపీగా సమాధానం చెప్పాడు. కానీ, అరుణకు తానేం సమాధానం చెప్పాలో మంగమ్మకు దిక్కు తోచలేదు. ఉన్నట్టుండి దగ్గు తెరలు తెరలుగా వచ్చింది. దగ్గుతూ అలాగే నేలమీద కూర్చుండిపోయింది.

స్వర్గీయ సొదుం జయరాం గారు కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి వీరి ప్రసిద్ధ కథలు. వీరి కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. వీరు రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి. 2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్).

 

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: