ఆదివారం , 22 డిసెంబర్ 2024
dengue death
డెంగ్యూ కారణంగా మరణించిన మహిళ

జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి?

పల్లెలను వదలని పాడు జరాలు

కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది

నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం

జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు

రాజధాని ‘శ్రద్ధ’ ప్రజారోగ్యం పై ఏదీ?

కరువు దరువుకు తోడు ప్రభుత్వ ఆదరువు లేక అల్లాడుతున్న మన పల్లెలపైన పాడు జరాలు పగబట్టినాయి. కడప జిల్లాలోని పలు పల్లెలు పాడు జరాల బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50కి పైగా ప్రాణాలు జ్వరాల కారణంగా గాల్లో కలిసిపోయినట్లు అనధికార సమాచారం.

ప్రజారోగ్యం పట్టని ఏలికలు పెద్దాసుపత్రిని అలంకారప్రాయంగా మార్చడంతో బడుగు జీవులు ప్రయివేటు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇదే అదునుగా ప్రయివేటు ఆసుపత్రులు అందిన కాడికి దోచుకుంటూ పేదల జేబులు గుల్ల చేస్తున్నాయి. దీనికి తోడు కడప జిల్లాలో ప్లేట్లెట్స్ (రక్తకణాలు) ఎక్కించే సౌకర్యాలు అందుబాటులో లేకపోవటంతో ప్రాణభయంతో రోగులు పొరుగు జిల్లాలకు పరుగు తీస్తున్నారు.

కడప జిల్లా మొత్తంలో ఒక రిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించే సౌకర్యం ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో వస్తున్న రోగులకు సేవలు అందించడానికి వీలు కావడం లేదు.

జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు మూడు నుండి నాలుగు వేల మంది ఈ వైరల్ జ్వరాల బారిన పడుతున్నట్లు అంచనా. వీరిలో చాలా మంది ‘టైఫాయిడ్’, ‘డెంగూ’ లక్షణాలతో చికిత్స కోసం వస్తున్నట్లు ప్రొద్దుటూరుకు చెందిన ఒక పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రయివేటు వైద్యుడు తెలిపారు. గత రెండు నెలలుగా ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఆ వైద్యుడు చెప్పారు. తన దగ్గరికి చికిత్స కోసం వచ్చే రోగులలో వంద మందిలో ఇరవై మంది రక్తకణాలు (ప్లేట్లెట్స్) తగ్గిపోవడం అనే సమస్యతో బాధపడుతున్నారన్నారు. వీరిలో కొంతమందికి నిర్ణీత మోతాదులో యాంటీ బయాటిక్స్, రక్తకణాలు పెరిగే దానికి అవసరమైన మాత్రలు ఇచ్చినప్పటికీ పరిస్తితి మెరుగుపడకపోవడంతో కర్నూలు, తిరుపతి ఆసుపత్రులలకు రెఫర్ చేస్తున్నామన్నారు. ఇలా ఎందుకు చెయ్యాల్సి వస్తోంది అని ప్రశ్నిస్తే ‘రోగికి రక్తకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ మందులకు మెరుగయ్యే పరిస్తితి లేకపోతే అది ఒక్కోసారి విషమ పరిస్థితికి దారి తీయవచ్చు. అటువంటి సమయంలో రోగికి తప్పనిసరిగా రక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది. ఇటువంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కడప జిల్లాలో ప్లేట్లెట్స్ ఎక్కించే సౌకర్యం కలిగిన ఆసుపత్రులు లేవు. అందుచేత ముందు జాగ్రత్తగా రోగులను అటువంటి సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నాం’ అన్నారు.

చదవండి :  కడప బెంగుళూరు విమాన సర్వీసు రద్దు

జిల్లా నుండి ప్రతి రోజూ కనీసం సుమారుగా ఐదు వందల మంది జ్వర పీడితులు మెరుగైన వైద్యం కోసం పొరుగున (దూరాన) ఉన్న కర్నూలు (201 KM), తిరుపతి (142 KM), వేలూరు (250 KM)లకు తరలిపోతున్నారు. వీరిలో సింహభాగం రక్తకణాలు తగ్గుతున్నాయనే కారణంగా వెలుతోంటే కొంతమంది వ్యాధి లక్షణాలకు భయపడి ముందు జాగ్రత్తగా పెద్దసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కమలాపురం, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోకవర్గాలకు చెందిన రోగులు ఎక్కువగా కర్నూలును ఆశ్రయిస్తుంటే, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, పులివెందుల, కడప ప్రాంతాలకు చెందిన రోగులు తిరుపతి, వేలూరులను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల ఖాజేపేట మండలంలోని తిప్పాయపల్లి అనే గ్రామంలో చాలా మంది జ్వరాల కారణంగా నెల రోజులపాటు ఆసుపత్రులకు పరిమితమైపోవడంతో ఊరు మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఈ విషయం కొద్ది రోజుల కిందట వివిధ పత్రికల జిల్లా పేజీలలో వార్తాంశం అయ్యిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తిప్పాయపల్లి చుట్టుపక్కల గ్రామాలదీ అదే పరిస్థితి. గత వారంలో ఇదే మండలానికి చెందిన బీచువారిపల్లి అనే గ్రామంలో ఒక విద్యార్థి డెంగూ కారణంగా ప్రాణాలు వదిలాడు. బీచువారిపల్లి దగ్గరలో ఉన్న మిడుతూరులో సైతం ఇప్పుడు ఇలాంటి పరిస్తితే కనిపిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో అనేక పల్లెటూర్లలో ప్రజలు జ్వరాలతో విలవిలలాడుతున్నారు.

ఇదే అదనుగా జిల్లాలోని పలు ప్రయివేటు ఆసుపత్రులు, ల్యాబులూ రోగులను దోచుకుంటున్నాయి. వ్యాధి తీవ్రతతో బాధపడుతున్న రోగులు ఈ దోపిడీతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పొరుగూర్లలోని పెద్దాసుపత్రులు కూడా ఈ రోగుల పట్ల అదే వైఖరిని అవలంభిస్తున్నాయి. కడపకు చెందిన ఒక ప్రయివేటు ల్యాబు ఓనరు ఈ దోపిడీ గురించి ఇలా అంటున్నారు “రోగుల దగ్గర మేము కొద్దిగా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నది వాస్తవమే. లక్షల రూపాయలు వెచ్చించి ల్యాబు పెడితే దానికి పేషెంట్స్ రెఫర్ చేయాలంటే డాక్టర్లకు కమీషన్ ఇవ్వాల్సిందే. లేదంటే వారు రోగులను రెఫర్ చేయరు. వారు అలా చేయకపోతే మేము నష్టపోతాం. కాబట్టి మాకు వేరే మార్గం కనిపించడం లేదు” అని. రక్తకణాల సంఖ్యను నిర్ధారించే పరీక్షల విషయంలో కొంతమంది వైద్యులు 50 శాతం కమీషను తీసుకుంటున్నారనేది నిజం. అంతిమంగా అటు ఆసుపత్రులు. ఇటు ల్యాబులు రోగుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. సగటున ఒక్కో రోగి ఈ జ్వరాల బారి నుండి బయట పడటానికి కనీసం పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రోజువారీ కూలీ, వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్న అధిక శాతం రోగులు ఈ దోపిడీ కారణంగా అప్పుల పాలవుతున్నారు. మరికొంతమంది ఏకంగా ప్రాణాలనే పణంగా పెడుతున్న దుస్థితి కనిపిస్తోంది.

చదవండి :  ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారు

డెంగ్యూ వ్యాధి ‘గ్రూప్‌-బి ఆర్టోవైరస్‌’ అనే వైరస్‌ వల్ల సంక్రమిస్తుంది. ఎడిస్‌ ఈజిప్టై అనే రకం దోమ కుట్టడం వల్ల ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ వ్యాధి ఉన్న రోగిని కుట్టిన ఈ దోమ మరొకరిని కుట్టడం ద్వారా ఒకరి నుండి ఒకరికి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 16 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మధ్య ఉంటే ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువుంటుంది. ఎడిస్‌ ఈజిప్టై దోమ చనిపోయేదాక కుడుతూ డెంగ్యూను వ్యాపింప జేస్తుంది. దోమ కుట్టిన 5 నుంచి 6 రోజులకు జ్వరం ప్రారంభ మవుతుంది. దోమ కుట్టిన 4 నుంచి 15 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుంది.

గత రెండు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా జ్వరాల వ్యాప్తి తీవ్రంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు మెరుగుపరిచేందుకు కానీ, పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు గానీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే సమయంలో ప్రయివేటు దోపిడీకి ముకుతాడు వేయాల్సిన జిల్లా యంత్రాంగం చేష్టలుడిగిపోయింది. కనీసం ప్రజలకు జ్వరాల విషయంలో అవగాహన కల్పించేందుకు కానీ, దోమల వ్యాప్తిని నివారించేందుకు కానీ అధికారులు పెద్దగా చొరవ తీసుకున్న సందర్భం లేదు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్భాటంగా చేపట్టిన ప్రచార కార్యక్రమాలు ప్రజల ముంగిల్లకు చేరకుండా పత్రికల శీర్షికలకు మాత్రమే పరిమితవుతున్నాయి.

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

ఒక మీడియా గ్రూపుకు ప్రధాన విలేఖరిగా పనిచేస్తున్న శ్రీను మాటల్లో చెప్పాలంటే “జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా ఇప్పటికే సుమారు వంద మంది వరకు జ్వరాల కారణంగా చనిపోయుంటారు. ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంటే పత్రికలు కూడా ఈ విషయానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఫలితంగా జ్వరాల బారిన పడుతున్న ప్రజల రోదన అరణ్యరోదనగా మిగిలిపోతోంది. ” ఇక ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాదరెడ్డి ఏమన్నారంటే “జిల్లావ్యాప్తంగా జ్వరాల బారిన పడి ఇప్పటికే సుమారుగా 56 మంది వరకూ చనిపోయారు. ఈ విషయంపై ప్రజల్లో ధైర్యం కల్పించి వ్యాధి పట్ల అవగాహన పెంచే దానికి చర్యలు చేపట్టాల్సిన జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రజా ప్రతినిధిగా నేను ఈ విషయమై పత్రికల ద్వారా కూడా అధికారులకు విజ్ఞప్తి చేశాను. అయినా స్పందన లేదు” అని.

పుష్కరాలు, పండుగలు, రాజధాని చట్టూ తిప్పి తిప్పి శంకుస్థాపనలు చెయ్యడంలో తీరిక లేకుండా ప్రభుత్వం ఉంటే… ఆ ఉత్సవాలకు ఏర్పాట్లు చెయ్యటంలో తల మునకలుగా ఉన్న అధికారులకు, ఆ ఏర్పాట్ల భజన హోరేత్తిస్తున్నమీడియాకు అందునా రాయలసీమలోని ఒక జిల్లాలో ప్రజలు సతమతమవుతోంటే పట్టించుకునే తీరిక ఎక్కడిది? అయినా పసిపిల్లలను ప్రభుత్వాసుపత్రులలో ఎలుకలు తింటుంటే లేని చలనం జ్వరాల విషయంలో ఉంటుందా?

ఇదీ చదవండి!

రాజధాని శంకుస్థాపన

కడప జిల్లాపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది: గేయానంద్

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం సీమ ప్రజలంతా పోరుబాటకు సిద్ధం కావాల ప్రొద్దుటూరు: కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం అలవికాని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: