పార్టీలకు అతీతంగా రాయలసీమ నాయకులు పోరాడాల్సిన అవసరం ఉంది
కడప: కడప జిల్లా విషయంలో మొదటి నుంచీ వివక్ష చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కాకుండా ఉండేందుకు పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఉక్కు పరిశ్రమ స్థాపనకు అనుకూలమైందనే వాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని తేటతెల్లమైంది.
ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన భాజపా నాయకులు విలేఖరుల సమావేశం పెట్టి మరీ ఉద్ఘాటించారు. ఆదివారం స్థానిక భాజపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా నాయకుడు కందుల రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ… జంగారెడ్డిగూడెం ఉక్కుపరిశ్రమ స్థాపించడానికి అనువైన ప్రాంతం కాదన్నారు. పరిశ్రమకు అవసరమైన ముడిసరకు అక్కడ అందుబాటులో లేదన్నారు.
వెనుకబడిన ప్రాంతమైన కడప జిల్లాలో ఉక్కుపరిశ్రమ అవసరం ఎంతైనా ఉంది. ఉక్కు పరిశ్రమకు అవసరమైన ముడిసరకు ఇక్కడ అపారంగా ఉందన్నారు. ఉక్కు పరిశ్రమ సీమ హక్కుగా పార్టీలకు అతీతంగా రాయలసీమ నాయకులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఉక్కు పరిశ్రమ కడపలోనే చేయాలని కోరేదానికి భాజపా జిల్లా నాయకులు వచ్చే వారం కేంద్ర పరిశ్రమల మంత్రి, ఉక్కుశాఖమంత్రిని కలవనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కరవుతో నిత్యం సతమయమయ్యే రాయలసీమకు రావాల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం, ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై ఒత్తిడి తేవాలని కోరారు. జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు.