చెక్కభజన

చెక్కభజన

చెక్కభజన

రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. పాటలో వేగం పెరిగే కొద్దీ అడుగులు వేగంగా కదుల్తాయి. ఇటీవలి కాలంలో చెక్కభజన బృందాల సంఖ్య తగ్గిపోయింది. చెక్కభజనను గురించిన ప్రస్తుత వ్యాసం ప్రఖ్యాత జానపద కళాకారులు కీ.శే కలిమిశెట్టి మునెయ్య సంకలనం చేసిన ‘రాయలసీమ రాగాలు’ నుండి…

చదవండి :  మా వూరి చెట్లు మతికొస్తానాయి

“రాయలసీమ లో – మరీ ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల్లో – చెక్కభజన లేదా పలకల భజన చాలా ప్రాచుర్యం పొందింది. ఈ చెక్కభజననే గ్రామీణ ప్రాంతాలలో ‘కులుకు భజన’ అని కూడా వ్యవహరిస్తారు. ఇందులో భజన చెయ్యడానికి వాడే చెక్కలు పొడవుగా ఉండే పలకలను పోలి ఉండడం వల్ల చెక్కభజననే పలకల భజన అని కూడా అంటారు. కోలాటం లాగా మూరడేసి బచ్చనకోలలకు బదులు, చేతుల్లో మూరెడు పొడవుండే తాళపు చెక్కలతో, కాళ్ళకు గజ్జెలతో వలయాకారంలో తిరుగుతూ తాళపు చెక్కలు వాయిస్తూ తాళానికి అనుగుణంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు.ఉద్దులుంటేనే కోలాటం రక్తి కడుతుంది. కాని చెక్కభజనలో ఉద్దులు లేకుండా కూడా వలయాకారంలో అడుగులు మారుస్తూ పాటలు పాడి రక్తి కట్టించవచ్చు. ఒకే చేతిలో రెండు చెక్కలను ఆడిస్తూ వాయించడం చెక్కభజనలోని సొగసు.

చదవండి :  రాయలసీమ సాంస్కృతిక రాయబారి

అయితే ఈ కళారూపంలో ఉద్దులు లేరని కాదు. అవసరానికి తగినట్లుగా వలయాకారంలో తిరిగే కళాకారులు కొన్ని సార్లు ఉద్దులు-వెలుద్దులుగా (జతలు జతలుగా) మారి ఎదురెదురుగా అడుగుమార్చి అడుగువేస్తూ ఉద్ది మార్చి ఉద్ది (ఒక అడుగులో ఒకవైపు-ఇంకొక అడుగులో రెండవవైపు) తిరుగుతూ నృత్యం చేస్తారు.

కోలాటం లాగానే పెన్నుద్దికాడైన గురువు పాటలోని ఒక్కొక్క చరణం అందిస్తే మిగిలిన వాళ్ళు అందుకుని పాడుతూ నృత్యం చేస్తారు.ఇందులో కోలాటం లాగ కోపులుండవు. కాని ఒకటవ అడుగు, రెండవ అడుగు, మూడవ అడుగు మొదలైన సంఖ్యామానంలో నృత్యరీతులు మారుస్తూ ఉంటారు. పలకల భజనలో జడకోపు తప్పనిసరిగా ఉంటుంది.

చదవండి :  కల్లు గుడిసెల కాడ - జానపదగీతం

పూర్వం చెక్కభజనలో కేవలం పురాణ సంబంధమైన, భక్తి పాటలే పాడేవారు. ప్రస్తుతం చెక్కభజనలో భక్తి, పౌరాణిక, శృంగార, హాస్య సంబంధమైన పాటలు పాడుతూ వస్తున్నారు.

ఆనాడు తిత్తి, మద్దెల, కంజీర చెక్కభజనకు వాయిద్యాలుగా ఉపయోగించేవారు. ఇప్పుడు హార్మోనియం, డోలు, కంజీర, తబలా వాయిద్యాలుగా వాడుతున్నారు.”

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *