- ఆడ చిరుత దొరికింది
- మగచిరుత కోసం మరో బోను ఏర్పాటు
- పులిని చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా
గండికోట: కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా జీవాలపై దాడి చేస్తోన్న క్రూరజంతువులు చిరుతపులులే అని తేలిపోయింది. గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుతపులి ఒకటి చిక్కింది. దీన్ని ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఆడ చిరుతగా గుర్తించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి, సిద్ధవటం, ముద్దనూరు ప్రాంతాల అటవీ అధికారులు ఇటీవల గండికోట సమీపంలో ఒక బోనును ఏర్పాటు చేశారు. ఇందులో ఎరగా ఒక మేకపిల్లను ఉంచారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మేక అరుపులు వినివచ్చిన చిరుత బోనులో చిక్కింది.
శుక్రవారం ఉదయం దీన్ని గమనించిన స్థానిక అటవీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డీఎఫ్‌వో శివశంకర్‌రెడ్డి, జమ్మలమడుగు అదనపు ఎస్పీ అప్పలనాయుడు, ఎస్‌ఐ కుళాయప్ప, రేంజర్ రవీంద్రారెడ్డి, ఎఫ్‌బీవో నారాయణస్వామి తదితరులు బోనులో చిక్కిన చిరుతను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ ఇది ఆడ చిరుత అని, ఒకటిన్నర్ర సంవత్సరం ఉంటుందని తెలిపారు.
గండికోట పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న ఆడ చిరుతను పట్టుకున్నామని, మగ చిరుతను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. వన్యమృగాలను చంపకుండా వాటిని సంరక్షించుకోవలసిన బాధ్యత ఉందన్నారు. ఎవరైనా చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా విధిస్తామన్నారు. చిరుత పులుల దాడిలో గొర్రెలను కోల్పోయిన గొర్రెల కాపరులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.
మధ్యాహ్నం మత్తు మందు ఇచ్చి అక్కడి నుంచి పులిని తిరుపతి జంతుప్రదర్శనశాలకు తరలించారు.
నాలుగు నెలలుగా భయం భయం
చారిత్రాత్మక ప్రదేశమైన గండికోట పరిసర ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయని చూసిన ఒకరిద్దరు గ్రామస్థులు భయపడి గండికోటలోని ధాన్యాగారం, ఎదురుగా సమీపంలోని కొండలో పులి ఉందని ప్రచారం చేశారు. గ్రామంలోని కొందరు తాము పులిని చూశామని చెప్పడంతో రాత్రి, పగలు ఒంటరిగా పొలాలు, తోటల వద్దకు రైతులు వెళ్లాలంటే భయపడ్డారు. గత నాలుగు నెలలుగా పులి ఈ ప్రాంతంలో సంచరిస్తోందని, గొర్రెలు, మేకలను తింటోందని గొర్రెల కాపరులు, గ్రామస్థులు కలిసి అధికారులకు విన్నవించారు.
గండికోటకు పులులు ఎక్కడ వస్తాయంటూ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పట్లో పాదముద్రలను పరిశీలించిన అధికారులు గండికోటలో తిరుగుతోంది హైనా అని ధ్రువీకరించి చిరుతపులి తిరిగే అవకాశం లేదని కొట్టిపారేశారు.
ఏదిఏమైనా ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.