కాంగ్రెస్ పార్టీని వీడి నేనెప్పుడు పోయా
కడప : ‘కాంగ్రెస్ పార్టీని వీడి నేనెప్పుడు పోయా.. నేను పోలేదు. జగనే రాజీనామా చేసిపోయారు. ‘ అని ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు వరదరాజులురెడ్డి అన్నారు.
ఆదివారం ఇందిరాభవన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకుని తాను ఉండలేనని, ఆత్మగౌరవం ఉన్న చోటే ఉంటానని స్పస్టంచేశారు.
జగన్ వర్గంలోకి పోయారు కదా అని ప్రశ్నించగా.. ఎందుకు, అక్కడికి పోయానో.. ఎందుకు తిరిగి వచ్చానో చెబుతాను. ఆ విషయాన్ని సోమవారం ఇక్కడే (ఇందిరాభవన్) విలేకరుల సమావేశం పెట్టి చెబుతాను. చాలా విషయాలు ఉన్నాయన్నారు.
అనంతరం అక్కడే మిగిలిన ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీల బంధువుల కిడ్నాప్ విషయం ప్రస్తావించారు. నేను పార్టీని ఎప్పుడు వీడిపోయా.. నేను పోలేదు. కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పారు. జగన్‌తో గడపాలని వెళ్లానే తప్ప పార్టీని వీడలేదన్నారు. అధిష్ఠానం ఎవరిని అభ్యర్థిని చేస్తే వారి గెలుపునకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ ఉన్నారు.