నూకా రాంప్రసాద్ కథ ‘కరువు’
ఆ మేఘానికి మేమంటే ఎందుకంత చిన్నచూపో? నీళ్లో రామచంద్రా అని మేమల్లాడుతుంటే ఒక పక్క ఉధృతంగా వానలు కురిసి వరదలొస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మేఘం గిరిగీసుకుని వర్షిస్తోందని పెద్ద అనుమానం.
ఈ సంవత్సరం కూడా నైరుతీ బుతుపవనాలు మోసం చేశాయి. అదనుకు పదును పడే సూచనలు కన్పించడం లేదు. రైతుల బతుకుల్లో ప్రతికూల పవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశకు విస్తరించే తుఫాన్లుగా మారాయి.
“ఏందిరా సంటోడా, ఆలోశ్యన్లో పడ్న్యావ్ పరీచ్చల్లో పస్టో చ్చినావు గదా వుజ్జోగం వచ్చాదిలే. సద్దినీళ్ళు తాగి, సేనికానిడి కన్నాపోయి రా” మా నాన్నకు నేను ఉద్యోగం రాదేమోనన్న బెంగతో కన్పించానేమో, నాకు ఉద్యోగమే చేయాలన్న నిబంధనేదీ లేదు, వానలు కురిసి మరమ్మతులకు నోచుకోని చెరువు నిండితే మా బావిలోకి నీల్లొస్తే నాకు అదే పెద్ద ఉద్యోగం. నేనెన్ని నగరాల్లో చదువుకున్నా దేశమంతా తిరిగినా నేనెప్పటికీ అచ్చమైన పల్లె మనిషినే. పల్లెటూరి పిల్లోడినే, మా పల్లెంటే మా పొలాల వాసన అంటే ఎందుకో నాకన్నిటి కంటే ఇష్టం.
చద్ది తిని చేను దగ్గరకు బయలుదేరాను. మాకుండేది పదమూడు ఎకరాలైనా బావిలో నీళ్ళు లేకుంటే బోరులో నీళ్లుండడంతో ఏదో మూన్నాళ్లూ కాలం గడుపుకొస్తున్నాం, బోరులో కూడా నీళ్ళు తక్కువ గావడంతో నాలుగైదేండ్లుగా వరి వేయడం మానుకున్నాం.
ఆరు ఎకరాలు శెనక్కాయ విత్తనం వేసి, మిగిలిన భూమినంతా బీడుగా వదిలేసినాం. మిగతా రైతుల్తో పోల్చుకుంటే కొంతలో కొంతైనా ఫర్లేదనిపిస్తుంది.
మా శెనక్కాయ చేనులో ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడుతూ, కలుపు తీస్తున్న దృశ్యాన్ని చూసి గాని నేను వాస్తవంలోకి రాలేదు,
కలుపుతీస్తూ లయాత్మకంగా అలవోకగా పాడుతున్న కూలీల జానపదాలు, చేను పక్కనున్న రోడ్డుమీద కంకర కొట్టే సంగీతమూ వింటూవుంటే మా అమ్మ రాగి సంగటి ముద్దలు గంపలో వేసుకుని వచ్చింది. నేను వెళ్ళి కూలీలను పిలుచుకొచ్చాను భోజనానికి.
సంగటి ముద్దలు అందరమూ ఎడమ అరచేతుల్లో పెట్టుకుని సంగటి ముద్ద మధ్యలో గుంతలు చేసుకుని అందులో కూరను వేసుకుని తినడం అలవాటు. తెల్లవాయల కారమైతే సంగట్లోకి దాని రుచేవేరు. ఒక్కొక్కరు రెండున్నర ముద్దలు తింటారు.
“ఇంగ వచ్చే కొద్దీ నీళ్లు తక్కువైతాయంట. మన బోరులో గూడా నీళ్లు తగ్గుకుపోతాండాయంట. మీ అయ్య పట్టించుకునే రకం కాకపోయ. నువ్వేందన్న వుజ్జోగం చూసుకుని ఈన్నుంచి బైటపడమని చెప్పి చెప్పి సాలైంది.” నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్న అమ్మ మాటలకు గొంతులో ఎరకారం ఇరుక్కున్నట్లైంది.
“ఏం రా శేఖరూ, ఉలకవూ పలకవూ నేన్జెప్పేదేమైనా సెవికెక్కుతాంద్యా లేదా.”
ఈసారి మాట్లాడక తప్పింది కాదు.
“నీళ్లు తగ్గితే మనమేంజేస్తామ్మా. వానలు కురవకపోతే నీళ్లెట్లావస్తాయి. సుబ్బారెడ్డి వాళ్ల భూమిలో డెబ్బై ఎనభై అడుగులేసినా ఒక చుక్క నీరు కూడా పడలేదని తెల్సింది” అమ్మతో గొంతు కలిపాను.
“అందుకేరా చెప్పేది. వానలు పడవు. మనం లచ్చిందేవికి పెండ్లజెయ్యాలంటే యోర్ని అప్ప డగాల. అందరి బతుకులూ తిని సెయ్ కడుక్కున్న్యట్లుండాయ్. మీ అయ్య ఎరువులోల్లకే బాకీ కట్టలె. ఇచ్చేటోళ్లు గునికి ఈరేమో. కక్కల్యాక మింగల్యాక వుండాడు మీ అయ్య. నువ్వేమో “భూమి భూమి” అని కలవరిచ్చావ్. యింగేం వుపయోగం లేదబ్బీ, వుజ్జోగమో పాడో ఏదో ఒకటి చూసుకుంటేనే.”
అమ్మ మాటలకు జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయాను. చెల్లెలు లక్ష్మి పెండ్లి గురించి అప్పుల్లో కూరుకుపోయిన ఇంటి పరిస్థితి గురించి తెలీని పట్టించుకోని అమాయకుడినేమీ కాదు. ఏదో ఆశ సీజన్‌లో నాలుగు చినుకులు పడ్డాయని. అమ్మను పలకరించడం ఇష్టం లేక దూరంగా వెళ్ళి పిచ్చి మొక్కలు ]పీకుతూ గట్టు మీద కూర్చున్నాను.
ఆకాశానికేసి “గంట రెండైంటాది” అని అమ్మ చెప్పగానే ఎర్రటి ఎండలోనే ఇంటికి నడిచాను.
మా ఇంటి ముందు పెద్ద వేపచెట్టు, దానికింద విశాలమైన అరుగు ఉంది. మా ఇంటి దగ్గరకొచ్చేసరికి అరుగుమీద కూర్చుని ఉన్నారు నానా రకాల మనుషులు.
నా చిన్నప్పుడు మా ఇంటి అరుగుమీద భారత భాగవత రామాయణాలు చర్చింపబడుతుండేవి, మా అబ్బ (నాన్న నాన్న) ఊరి పెద్దోళ్లంతా కలిస్తే సందడి సందడిగా కళగా ఉండేది. మా అమ్మ పూటకెన్నికాఫీ గ్లాసులు కడిగేదో.
గుండె బరువంతా దించేసుకున్న వాళ్లు అరుగు మీదే వేపచెట్టు నీడలో చల్లగా పడుకునేవారు, నేను వెల్లి అరుగుమీద కూర్చున్నాను.
“ఈ దఫా చెనిక్కాయ్ ఇత్తనోల్లు మారాజులే. వానలు పడేదిల్య మనం బతికేదిల్య” వెంకట్రెడ్డి మామ దిగులుగా అన్నాడు.
“అందరి పరిస్థితి అట్నే ఉందిలే ఎంకట్రెడ్డీ, వాన ఇంత మోసం చేస్తాదని ఎవరనుకున్నారు. మేమేసిన ఆరుతడికే నీళ్లు తక్కువైనాయి, చేసేదేముంది. ఎట్లైతే అట్టగాని” నిండా మునిగిన వాడికి చలేముందన్నట్లు మాట్లాడినాడు మా నాన్న.
తలకింద చెయ్యి పెట్టుకుని పడుకుని వింటున్న సుబ్బయ్య తాత లేచి కూర్చుని “ముందు గాల్నె అదనుకు సినుకు రాలె. ఎట్టనో ఉన్నట్టుండి ఆడోళ్లు ప్యాన్నీల్లు సల్లినట్లు న్యాల తడ్సింది. దాంతో మనోల్లంతా తొందరపడి బేగిన దుక్కి దున్ని ఇత్తనమేసిరి. ఇంగంతే సంగతులు – ఇత్తనమేసి , సాతికార్తెకు నెలదాటింది. ఇప్పుడన్న ఒక్క పదును మానైనా సినుకు రాల్రే మేలె” సుబ్బయ్య తాత మాటలకు రామాంజనేయులనే యువకుడు అడ్డుపడి “శెనిక్కాయ్ ఎట్టుంది కలుపు తీపిచ్చినావా?” అసందర్భంగా ప్రశ్నించాడు. సుబ్బయ్య తాతకు బళ్లు మండింది.
“ఏం వాయ్. రామాంజిగా, అవలాయ్ గుంద్యా చెనిక్కాయ్‌తో పాటు అందరూ ఎండిపోతాంటే చెనిక్కాయెట్టుందంటావ్. పంట ఎదుగుదలేల్యాకుంటె కలుపెట్టలే పిచ్చావ్వాయ్ నేన్జే పిచ్చుకోవాల ముందు గుండు. నీ కంతా ఎగసెక్కెమె. సిమెంటు పాట్టరీలోకి పనికి పోబట్టి నీకు దిక్కు తెల్చేతట్టుగా లేదే.”
రామాంజిగాడు _మారు మాట్లాడకుండా అరుగు వెనక చిన్న పిల్లలు బంగరాలు తిప్పుతుంటే అక్కడికెళ్లి నిల్చున్నాడు,
“పప్పు పురుగుపడ్తాంది, మనూర్లో ఇత్తనమిత్తనోళ్లంతా పప్పు అమ్మేసినారు” అన్నాడు నాన్న.
అమ్మడమే మంచిదన్నట్లు చూసారు అరుగు మీద వాళ్లంతా.
“పోయిన. దఫా చెనికట్టెన్నా మిగిలింది, బొందు పెరికి పసులకైనా పెడ్తిమి. ఈ దఫా అదీ ల్యాకపాయె బాడుగల్యాక ఉండిన ఒకకాడి ఎద్దులమ్ముకుంటి. ఈ ఎనుములకు యాన్నుంచి గడ్డి త్యావాల్నో” ఆకాశం వైపు దిక్కులు చూస్తూ అన్నాడు వెంకట్రెడ్డి మామ.
వానలు రావు!
అప్పులు తీరవు!
శుభకార్యాలు జరగవు…!
గంగమ్మ జాతరలు కప్పల ఊకేగింపుల మీద నమ్మకం కుదరక మానేసినారు. సంవత్సరానికెప్పుడో తినే మాంసం కూడా మరచిపోయినారు. “తాతలు తాగిన నేతుల సంగతి” పునరావృతం చేసుకోవడం తప్ప చేసేదేమీ లేదు.
“రేయ్ అబ్బీ శేఖరూ?” పిలిచాడు సుబ్బయ్య తాత. సమాధానంగా నవ్వాను.
“రేయ్, కిట్టకాల్వ గురించి మన రైతులంతా కలెట్టరాఫీసుకాడ గొడవ పన్న్యారంటా, నీకేమైనా తెల్సింద్యా. అవున్రా శేఖరూ, మన నీళ్లు మనకిడిసే దానికే ఆల్లకేందిరా నొప్పి అట్టాటప్పుడు ఈ పాజెట్టని ఇన్ని నీళ్లు ఇడుస్తామని గెవర్నమెంటోళ్లు లెక్కగట్టి సెప్పిరి కదా, మర్చిపోయినారా అప్పుడే” అన్నాడు తాత.
నిజమే తాత, కె.సి. కాల్వ గురించి రైతులంతా కలెట్టర్‌తోనే గొడవ పెట్టుకున్నారు. గోదావరి, కృష్ణానదుల్లో నీళ్లు ఎప్పుడూ ఉంటాయని గోదావరి తీర ప్రాంతాలకు వచ్చే వరదనీరు కేవలం ఒక రోజు వరదనీరు సరిపోతాయని కలెక్టర్‌తో చెప్పినారు. కృష్ణా మిగులు జలాలను మనకు మళల్లించడంలో ఆలస్యం జరుగుతోందని మన రైతులంతా ధర్నా చేసినారు. నీళ్ల కోసం నిరాహారదీక్షలు చేసి ఆస్పత్రిపాలైన నాయకులంతా అధికార మత్తులో ఉండి మనల్ని మరిచిపోయినారని తీవ్రంగా నినాదాలు చేసినారు తాతా. పేపర్ల నిండా ఈ వార్తలే తాతా” జరిగిన విషయం వివరించాను.
“ప్రాజెట్టులు దండిగా ఉండాయంటగదరా మనకు” అన్నాడు సుబ్బయ్యతాత జిబ్బాచొక్కాలోంచి బీడీ తీసుకుంటూ.
“ఆం ఉండాయిలే, సొమ్మొకనిది సోకొకనిది. డ్యాములన్నీ మనై. నీళ్ళన్నీ వాళ్లకే పోతాయి. ఎవరికో తాగే దానికోసం మనకు గుక్కెడు నీళ్ళు తాగేదానికి గతిలేదు. పేరుకే అన్నీ ఉండాయని. సంవత్సరం పొడుగుంత కాల్వకు నీళ్ళిడిస్తే గౌర్నమెంటోళ్ల సొమ్మేంపోయింది”. పకపక నవ్వాడు వెంకటెడ్డి మామ.
“చెనిక్కాయ్ ఈ సారెంతుంటాదో రేటు” అందరి వైపు చూస్తూ అన్నాడు మానాన్న.
“ముందు నీకు రేటు కొచ్చింది తొందర.
మేమంతా పంటల్ల్యాక సచ్చాంటి. కొడుకు పుట్టకతలికే గుడ్డలు కుట్టించినాడంట నీయట్టాటోడు. పంటల్లేవు కూల్లులేవు. మీ ఇంటి సంగతే తీసుకో, ఎన్నిమందల ఆవులు జీవాలు ఉన్నాయి. ముద్ద పప్పు గడ్డ పెరుగు మీరిప్పుడు తింటాండారా. కాఫీ నీళ్లే మర్చిపోయినాం. యింగమజ్జిగ కత సెప్పబట్టుదు” నిట్టూర్చాడు వెంకట్రెడ్డి మామ.
మానాన్న ఏమీ మాట్లాడలేదు. తిరిగి వెంకట్రెడ్డి మామ మళ్ళీ అందుకున్నాడు.
“అప్పోసొప్పో జేసి పంట బేచ్చిమి. బేసినాక పొరబాట్న వానొచ్చి పంట పండిందనుకో. చేతి కాడికొచ్చిన పంట నోటి కాడికి అందకుండా పోతాది”.
“నిజమే మామా, నువ్వు చెప్పేది. దేశంలో అన్ని విధాల మోసపొయ్యేది రైతే. ఎవడైతే ఒక వస్తువును తయారు చేస్తాడో ఆ వస్తువు ధర నిర్ణయించే అధికారం వాడికే ఉంటుంది. విత్తనాలు కొనుక్కోవడానికి డబ్బు వడ్డీకి తెచ్చుకుని, ఎరువులకోసం పెళ్లాం పిల్లోళ్ళ చెవుల్లోకి గూడా లేకుండా ఇంట్లో బంగారంతా కుదువపెట్టి పంటను నమ్ముకుంటాడు. మన బోటి రైతులంతా ఎరువుల దగ్గరే బాగా మోససోతున్నాం. పంట చేతికొచ్చిన తర్వాత; దళారీల చేతుల్లో పడకుండా ఉండలేం. దళారీళను కాదంటే ఇండ్లల్లోనో గోడౌన్లల్లోనో ముగ్గిపంట పాడైపోవాల్సిందే, పట్టించుకునే మొగోడుండడు. చివరకు బలపాలు తయారుచేసే వాడు గూడా ధర నిర్ణయిస్తున్నాడు. రైతు నిర్ణయించిన ధరకే ఎందుకభ్యంతరం చెప్తారో” ఉపన్యాసంలా ముగించాను.
“అవున్రా అబ్బీ, మనం పెట్టిన రేటుకే దేశం కొనుగోలు చేసే రోజు రావాల్రా”
“అ పడమర జూడండి, మబ్బు పట్టినట్టుంది” అంటున్న మానాన్న మాటలను సుబ్బయ్య తాత పట్టించుకోకుండా,
“ముప్పై ఏండ్లుగా పడ్డానే ఉంది. మబ్బు. అది మబ్బుగాదురా మన బెమ, ఆకాశం మెరుచ్చాందంటే అక్కడ్యాన్నో పడేదానికి. మనంశెని నా కొడుకులం మన క్యాడపడ్తాది రా, వానా మీ నాయన్నే అడుగు, మీ నాయన పుట్టినప్పట్నుంచి మనూరి శెరువు ఎన్ని దపాలు నిండినాదో”. సుబ్బయ్య. తాత – ఒంటిమీదున్న తువ్వాలు తలకింద పెట్టుకుని ఒరిగి పడుకున్నాడు.
మానాన్న సాయంత్రం “మబ్బుపట్టిందని చెప్పినమాట నిజం కాలేదు. రాత్రి భోజనం చేసి అమ్మతో కరవుదండకం చదివించుకుని పడుకున్నానే గాని నిద్ర పట్టలేదు. అమ్మ చెప్పింది నాకిప్పుడు బాగా స్పష్టమవుతోంది.
సుబ్బయ్య తాత వానలు రావంటాడు. వాన మాటే ఎత్తవద్దంటాడు. అమ్మ సంగతి సరే సరి! మట్టి మీద మమకారంతో ఇక్కడే ఉంటే శెనిక్కాయ పంటలా నా బతుకూ ఎండిపోకతప్పదు.
ఇది ఎడారి స్వప్నం. ఎటుచూసినా కరువు. అణువణువూ మహా ఎడారిగా మారుతున్న కరవు భావన.
కరవు… కరవు… కరవు…
(ఆదివారం ఆంధ్రప్రభ 15 జూన్ 1997)