కడప విమానాశ్రయం ఈనెల 14న ప్రారంభం కానుందని ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందిందని ఒక దినపత్రిక ఇవాళ కథనాన్ని ప్రచురించింది. నగరం నుండి విమానాశ్రయానికి దూరాన్ని సూచిస్తూ సూచికలు ఏర్పాటు చేయటం కూడా ఇందుకు నిదర్శమని ఆ పత్రిక పేర్కొంది. ఆ కథనం ప్రకారం ‘విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలని విమానాశ్రయ అధికారులను జిల్లా కలెక్టర్ సూచించినట్లు కూడా సమాచారం. జిల్లా కలెక్టరుకు ప్రభుత్వం నుంచి విమానాశ్రయం 14న ప్రారంభించనున్నట్లు మౌఖిక సమాచారం అందినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రపౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజులు విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రానున్నట్లు కూడా అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ముం దున్న సమాచారం ప్రకారం అయితే ఈ నెల 12, 13 తేదీల్లో చంద్రబాబు నాయుడు జిల్లాకు రావాల్సి ఉంది. ఈ మేరకు సాంఘిక శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు కూడా వెల్లడించారు. అయితే ఆయన పర్యటన 14వ తేదికి మారనట్లు జిల్లా కలెక్టరుకు కూడా సమాచారం అందినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టు ప్రారంభం 14వ తేదీన నిర్ణయించడంతో ఆయన పర్యటన కూడా ఆమేరకు మారిందని చెప్పవచ్చు.’
కడప విమానాశ్రయానికి సంబంధించి టర్మినల్ భవనం, రన్‌వే, ఏరోనాటికల్, ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), ప్రహరీ నిర్మాణం అప్రోచ్ రోడ్ విద్యుత్ సౌకర్యం తదితర పనులన్నీ పూర్తి అయ్యాయి. విమానాశ్రయానికి అవసరమయ్యే పలురకాల పరికరాలు కూడా ఇక్కడికి చేరాయి. కొంతమేరకు సిబ్బంది నియామకంతో పాటు డైరెక్టర్‌ను కూడా నియమించారు. డైరెక్టర్ విమానాశ్రయం ఏర్పాట్లకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తు వచ్చారు.
గతంలో కూడా మన పత్రికాలూ, చానల్లూ పలుసార్లు కడప విమానాశ్రయం ప్రారంభోత్సవం పేర భారీగా కథనాలు ప్రచురించాయి. కానీ వీటికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంతవరకూ వెలువడలేదు.
పత్రిక కథనం కనీసం ఈసారైనా నిజం కావాలని కోరుకుందాం. అలాగే ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన హామీ మేరకు విమానాశ్రయ విస్తరణకు చర్యలు చేపట్టాలని కోరుకుందాం!