![‘కడపను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యండి’](https://kadapa.info/wp-content/uploads/2014/05/kadapa_rly_stn-850x333.jpg)
‘కడపను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యండి’
జిల్లాలోని అన్ని పార్టీల నాయకులూ ఐక్యంగా ముందుకు వస్తే సీమాంధ్రకు రాజధానిగా కడప నగరాన్ని చేయాలని ఉద్యమం చేపడతా’మని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అజయ్‌కుమార్‌వీణ స్పష్టం చేశారు.
నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప జిల్లాను రాజధానిగా చేసేందుకు అన్ని వనరులున్నాయని- లేనిది చిత్తశుద్ధి మాత్రమేనన్నారు.
కడప జిల్లా వెనుకబడిన ప్రాంతమైన ఎన్నో వనరులున్నాయని వివరించారు. విశాల అటవీ ప్రాంతమున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాదన్నారు. విశాఖపట్టణం నుంచి తడ వరకు సముద్రతీరం ఉందని, అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే జల ప్రళయాల సమయంలో సమస్య తప్పదని హెచ్చరించారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కడపకు చేరువలోనే ఉన్నాయని- ఇదెంతో అనుకూలాంశమని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కడప నగరాన్ని విస్తరింప చేసేందుకు జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు తరలిరావాలని అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. రాజధానిని గుర్తించే కేంద్ర కమిటీ రెండో దశలో కడప జిల్లాకు రానుందని ఈమేరకు అందరం ఏకమై ఒకే మాటపై ఉందామన్నారు.
ఇటీవల కడప నగరానికి వచ్చిన జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మద్దతూ లభించిందని వెల్లడించారు.