
కడప లేదా కర్నూలులో రాజధాని ఏర్పాటు చెయ్యాలి
జూన్ 2న కడప కలెక్టరేట్ వద్ద ధర్నా
రాయలసీమలో రాజధానిని ఏర్పాటుచేయాలని కోరుతూ రాయలసీమ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదిన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఫ్రంట్ కమిటీ పేర్కొంది. బుధవారం స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కమిటీ నాయకులు, రాష్టబ్రిసి మహాసభ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, డిపిపి అధ్యక్షుడు సంగటి మనోహర్, ఎస్సీ,ఎస్టీ రైట్స్ ఫోరం అధ్యక్షుడు జెవి రమణ, సంపత్‌కుమార్, కళాధర్, సత్తార్‌లు మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న రాజధానిని కోల్పోయి నష్టాలకు గురయ్యామన్నారు.
రాష్ట్రం విడిపోయి విభజన అనంతరం రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనను చంద్రబాబునాయుడు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ వాసులను దృష్టిలో ఉంచుకుని రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేసేందుకు కృషి చేయాలన్నారు.
పేద, మద్యతరగతి, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి జరగాలంటే రాయలసీమ జిల్లాలైన కర్నూలు కానీ, కడపలోకానీ రాజధానిని ఏర్పాటుచేయాలన్నారు.. కడప జిల్లాలో పలు ప్రభుత్వ ప్రాంతీయ కార్యాలయాలున్నాయని గుర్తుచేశారు. ఎల్ఐసీ, భవిష్యనిధి, విద్యా, వైద్య తదితర శాఖలన్నీ ఇక్కడే విస్తరించినట్లు వివరించారు.
రాష్ట్రంలోని 13 జిల్లాలో ఎనిమిది జిల్లాలు కడప జిల్లాకు సమీపంలో ఉన్నాయన్నారు. సహజవనరులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో కడప జిల్లాను రాష్ట్ర రాజధానిగా చేయాలని వారు డిమాండు చేశారు. జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు ఉద్యమబాట పట్టాలని పిలుపునిచ్చారు.
రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయనిపక్షంలో ఉద్యమాలు తీవ్రతరం అవుతాయన్నారు. ఈకార్యక్రమంలో భాస్కర్, శ్రీను పాల్గొన్నారు.