ఈ చావుకు నేను భయపడడం లేదు – సొదుం జయరాం

సొదుం జయరాం

ఈ చావుకు నేను భయపడడం లేదు – సొదుం జయరాం

ఈ చావుకు నేను భయపడడం లేదు

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా మరణానికి భయపడకుండా, మిత్రుల ఆత్మీయత మరియు ఆదరణ తనని ఎలా నిలబెడుతున్నాయో చెబుతూ సొదుం జయరాం గారు రాసిన వ్యాసమిది. నవ్య వార పత్రికలో ప్రచురితమైన ఈ వ్యాసం నేడు ఆయన జయంతి సందర్భంగా కడప.ఇన్ఫో పాఠకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం.

“మనీ ఈజ్ ది సిక్స్త్ సెన్స్” అంటాడు సోమర్సెట్ మామ్. మనిషి కనీస అవసరాలకైనా డబ్బు అవసరం. వ్యాధిగ్రస్తుడైన మనిషికి డబ్బుంటే మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. డబ్బుకు లభించనివి మరికొన్ని వున్నాయి — ఆత్మీయత, ఆదరణ. నాకు డబ్బు లేకున్నా మంచి ట్రీట్మెంటే కాదు, ఆదరణ, ఆత్మీయత కూడా లభించాయని అనుకుంటున్నాను.

పోయిన సంవత్సరం నవంబరులో అనుకుంటాను. బయాప్సీ టెస్ట్లో నాకు కాన్సరు అని డాక్టరు నిర్ధారించాడు. వెంటనే హైదరాబాద్ వెళ్లమని సలహా ఇచ్చాడు. చావుకు నేను భయపడలేదు. వయసు డెబ్బై సంవత్సరాలు. కష్టాలూ, సుఖాలూ అన్నీ చూచాను. మనిషికి చావన్నది అనివార్యం. Death is a deep sleep. చావడానికి భయపడడమెందుకు అనిపించింది. కాకపోతే హాస్పిటల్కు వెళ్లడానికి ఆర్థిక సమస్యలు.

తక్షణం బయలుదేరడానికి మరో సమస్య కూడా ఎదురయింది. మండలంలోని ఉపాధ్యాయులు నాకు ఒక సన్మానం ఏర్పాటు చేశారు. పాపం వాళ్లకి నా కాన్సర్ విషయం తెలియదు. అప్పటికే కరపత్రాలు వేశారు. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సన్మానం కోసమని నాలుగైదు రోజులు ఆగవలసి వచ్చింది. ఈలోగా డబ్బు చూచుకోవచ్చు అన్నది నా ఆలోచన.

“హైదరాబాదు వెళ్తున్నాను. కొంచెం డబ్బు సర్దు” అన్నాను కథక మిత్రుడు పద్మనాభరెడ్డికి.

“ఓకే. అది సరే. ఏ హాస్పిటల్లో చేరాలనుకుంటున్నావు?” అన్నాడు.

“ఏమీ అనుకోలేదు” అన్నాను.

“ఏమీ అనుకోకపోతే ఎట్లా జయరాం? కార్లో కూర్చో. ప్రొద్దుటూరుకు పోదాం. అక్కడ ఆలోచిద్దాం” అన్నాడు.

కార్లో పద్మనాభరెడ్డి ఇంటికి వెళ్లిన తర్వాత ఒక లేడీ డాక్టరుకు ఫోన్ చేశాడు రమ్మని. ఆమె పేరు శారద. పద్మనాభరెడ్డి కుటుంబానికి సన్నిహితురాలు. ఆమె హైదరాబాద్లో ఒక సర్జన్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది. ఒక ఉత్తరం కూడా రాసింది — ఆపరేషన్ ఫీజు తగ్గించుకోమని.

వస్తూ వస్తూ మాజీ ఎమ్మెల్యేను కలిశాను. ఆయన కొంత డబ్బు సర్దుబాటు చేశాడు.

చదవండి :  చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

“హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఫోన్ చెయ్యి. నేను వస్తాను. సి.ఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత ఆర్థిక సహాయం అందేటట్లు చూస్తాను. డబ్బుకోసం దిగులుపెట్టుకోకు” అన్నాడు.

పద్మనాభరెడ్డి, వీరశివారెడ్డి (ఎమ్మెల్యే) గార్ల ఆత్మీయ స్పర్శ కొండంత బలం ఇచ్చింది.

ఇంటికొచ్చేసరికి ఊహించని విధంగా మరో ఐదువేలు సిద్ధంగా వుంది. నేను కాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్నానని తెలిసి, అడక్కుండానే ఒక అభిమాని పంపిన డబ్బు అది. ఎనిమిదేళ్ల కిందట టెన్త్ పాసైన ఒక అబ్బాయి నా సహాయం అర్థిస్తే చిన్న ఉద్యోగం ఇప్పించాను. అప్పటినుంచి అతను నాకు కన్పించడం లేదు. నాకూ ఆ అబ్బాయి జ్ఞాపకం లేదు. ఆ సమయానికి అతనికి ఎలా తెలిసిందో ఏమో — నా అవసరం తెలిసి డబ్బు పంపాడు. ఆ అబ్బాయి ఆత్మీయతకు నా కళ్లు చెమ్మగిల్లాయి.

నన్ను హైదరాబాదుకు సాగనంపడానికి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కు నా అన్నవాళ్లు చాలామందే వచ్చారు. అందరి ముఖాల్లోనూ నేను ఏమవుతానో అన్న దిగులు. అందరూ నాకోసం దిగులుపడుతూ వుంటే ఏ దిగులూ లేకుండా మామూలుగా ఉన్నవాణ్ని నేనే.

హైదరాబాదులో డాక్టరు శారదగారు చెప్పిన సర్జన్ని కలిశాను. ముందు మెడికల్ టెస్ట్స్ చేయించుకు రండి, తర్వాత ఆపరేషన్ విషయం ఆలోచిద్దాం అని ఏఏ టెస్ట్స్ అవసరం అన్నది రాసి ఇచ్చాడు. ఆ టెస్ట్స్ అన్నీ పూర్తి చేసేసరికి ఐదువేల రూపాయలు అయింది. ఇంత మొత్తం అవుతుందని నేను ఊహించలేదు. హాస్పిటల్ అనుభవాలు బొత్తిగా లేనివాణ్ని. ఏడు పదుల నా జీవితంలో ఏనాడూ హాస్పిటల్లో పేషెంటుగా వుండలేదు. ఔట్ పేషెంట్గా కూడా వుండలేదు.

జ్వరమో, పులకరమో వస్తే దాని మానాన అది పోవలసిందే తప్ప మందులూ మాకులూ వాడినవాణ్ని కాదు. సరే… సర్జన్ ఈ టెస్టులన్నీ చూచి తొందరగా ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉందన్నాడు. ఆపరేషన్ కోసం అతను డబ్బు దండిగానే డిమాండు చేశాడు. అతనికి మంచి సర్జన్‌గా పేరున్నమాట వాస్తవమే కాని, హాస్పిటల్ వాతావరణం నాకు నచ్చలేదు. అక్కడ ఆపరేషన్ చేయించుకోకూడదన్న నిర్ణయానికి వచ్చాను.

ప్రొద్దుటూరులో పద్మనాభరెడ్డికి ఈ విషయం ఫోన్ చేశాను. సరే, వేరే హాస్పిటల్లో జాయిన్ అవ్వు అని చెప్పాడు. వాకబు చేస్తే “ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్” పేరు చెప్పారు. నా దగ్గర మూడు నాలుగు వేలు మాత్రమే డబ్బున్నది. తర్వాత సంగతి ఓపిగ్గా ఆలోచించుకోవచ్చులెమ్మని ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్కు వెళ్లి ఇన్‌పేషెంటుగా జాయిన్ అయ్యాను. నా దగ్గరున్న డబ్బు అడ్వాన్సుకూ, కన్సల్టేషన్ ఫీజుకూ సరిపోయింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో బెడ్ ఇచ్చారు.

చదవండి :  ఆ రోజుల్లో రారా..

మా అబ్బాయి ఇంద్రసేన (కజిన్ బ్రదర్ కొడుకు) కామ్రేడ్ శివరామిరెడ్డికీ, కేతు విశ్వనాధరెడ్డికీ ఫోన్ చేసి నేను హాస్పిటల్లో వున్న విషయం చెప్పాడు. మరుసటి రోజే శివరామిరెడ్డిగారు, కేతు విశ్వనాధరెడ్డిని వెంటబెట్టుకుని హాస్పిటలుకు వచ్చాడు. ఆయన వయసు 85 సంవత్సరాలు. వృద్ధాశ్రమంలో వున్నాడు. ఓపిక చేసుకుని నన్ను చూడటానికి వచ్చిన ఆయన ఆత్మీయతకు నా గుండె ఆర్ద్రమయింది.

“హాస్పిటల్లో చేరావు. బాగానే వుంది. డబ్బు ఎలా ఏర్పాటు చేస్తున్నావు?” అన్నాడు.

నా సమాధానం ఒక చిరునవ్వు! నా జీవితం ప్రణాళికాబద్ధమైనది కాదు. అంటే రేపటి విషయం ఆలోచించే తత్వం కాదు. కాసేపు ఆ మాటా, ఈ మాటా మాట్లాడి వెళ్తూ —

“జయరాం! నిశ్చింతగా బెడ్మీద వుండు. హాస్పిటల్ బిల్లు ఎంతవుతుందో నేను వచ్చి చెల్లిస్తాను” అంటూ విశ్వాసంతో వెళ్లిపోయాడు.

ఆ ఆప్యాయతకు మరోసారి కళ్లు చెమ్మగిల్లాయి.

సి.టి. స్కానింగ్, ఎక్స్‌రే లాంటి చాలా టెస్ట్స్ చేయించుకోవాల్సిన అవసరం వుందన్నాడు ఆంకాలజిస్టు. ఆల్రెడీ చేయించుకున్నానని చూపెట్టాను.

“ఇవి లాభం లేదు. ఇక్కడే చేయించుకోవాలి” అన్నాడు.

నా పని “రెడ్డొచ్చె మొదలాడు” అన్నట్లయింది. మళ్లీ నాలుగైదు వేలు అనవసరంగా తగలెయ్యాలంటే బాధ కలిగింది. తప్పదు. డబ్బు ఎట్లాగా అని ఆలోచిస్తున్నాను. చిత్రం! సరిగ్గా అప్పుడే మా ఊరి నుంచి ఒక మనిషి వచ్చి ఎనిమిదివేల రూపాయలు ఇచ్చాడు.

డబ్బు ఎక్కడిదీ అని విచారిస్తే, ఐ.సి.ఎల్ ఫ్యాక్టరీలో ఒక అబ్బాయి ఐదువేలు, మా ఆవిడ అప్పుచేసి మూడు వేలు కలిసి ఆ మొత్తం అని తెలిసింది. ఫ్యాక్టరీలో పనిచేసే అబ్బాయి పేరు నల్లబల్లె వీరారెడ్డి. వాళ్ల నాన్న నారాయణరెడ్డి నాకు చాలా ఆత్మీయుడు. కాని, ఆయన చనిపోయి పది సంవత్సరాలు అయింది. మా ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయతను ఆ అబ్బాయి మరచిపోలేదు. హాస్పిటల్లో వున్నానని తెలిసి నాకు పంపమని డబ్బు ఇంటికి పంపాడట. పిల్లతెమ్మరలాంటి ఆ అబ్బాయి ఆత్మీయత నా వళ్లు పులకరింపచేసింది.

వెంటనే కృతజ్ఞతలు తెలుపుతూ ఫోన్ చేశాను. ఆ అబ్బాయి సమాధానంగా —

చదవండి :  కొల్లాయి గట్టితే నేమి? : రారా సమీక్ష

“మీ ఆరోగ్యం బాగుపడాలి. మాకు అదే పదివేలు” అన్నాడు.

ఆరోజే మా మాజీ ఎమ్మెల్యే (ప్రస్తుత ఎమ్మెల్యే) వీరశివారెడ్డిగారు నన్ను పరామర్శించడానికి హాస్పిటలుకు వచ్చాడు. రావడమే కాదు, సర్జన్‌ను కలిసి మాట్లాడాడు. సి.ఎం రిలీఫ్ ఫండ్‌కు కావలసిన అప్లికేషన్ ఫారం తయారు చేయించుకుని తీసుకెళ్లాడు. నిజానికి సి.ఎం రిలీఫ్ ఫండ్ అప్పట్లో రాలేదు. మరుసటి నెలలో రెండవ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అది ఉపయోగపడింది.

ఏది ఏమైతేనేం… డబ్బు పంపడం ద్వారా, ఫోన్ల ద్వారా పరామర్శించడం మూలంగానూ చాలామంది తమ ఆత్మీయతను వెల్లడించుకున్నారు. ఇంతమంది ఆత్మీయుల్ని సంపాదించుకున్నందుకు, నా జన్మ సాఫల్యమైనట్లు అనిపించింది. అమితమైన సంతోషం కలిగింది.

చివరగా ఒక విషయం చెప్పాలి. ఆత్మీయత అన్నది ఆర్థికంగా ఆదుకోవడం ఒక్కటే కాదు. ఆర్థికాంశంలో ఇమడని ఆత్మీయత కూడా వుంటుంది. అదికూడా చెప్తాను.

కాన్సరు వ్యాధితో బాధపడుతున్నా నేను సిగరెట్లు మానుకోలేదు. సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా ఆసుపత్రి బయటికి వచ్చి దగ్గర్లోనే వున్న టీ బంకుల్లో కూర్చొని టీ తాగి తృప్తిగా సిగరెట్ పీల్చి మళ్లీ వెళ్లి బెడ్మీద పడుకునే వాణ్ని. ఒకరోజు నా వార్డులోని ఓ సిస్టర్ నా వద్దకొచ్చి —

“నీకంటే వెనుక వచ్చిన వారికి ఆపరేషన్లు జరిగాయి. నీకు వారం రోజులైనా ఆపరేషన్ ఎందుకు చేయలేదో తెలుసా తాతగారూ…” అంది.

“ఎందుకు చేయలేదో మీరు చెప్పాలి సిస్టర్” అన్నాను.

“సిగరెట్లు తాగి తాగి నీ లంగ్స్ మరీ బలహీనంగా వున్నాయి. పైగా బ్రాంకైటీస్. వాటికే ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయినా మీరు సిగరెట్లు మానుకోలేదు” అంది ఆమె బాధగా.

నేను సిగ్గుతో తల వంచుకున్నాను. ఆమె తన చేయి నా ముందుకు చాపి –

“సిగరెట్లు తాగనని మీరు నాకు ప్రామిస్ చేయాలి” అని పట్టు పట్టింది.

నేను చలించిపోయాను. ఆమెది సేవాధర్మంతో కూడిన అవ్యాజమైన ఆప్యాయత. డబ్బుతో కొలవలేని ఆత్మీయత. నేనిప్పుడు సిగరెట్ తాగేటప్పుడల్లా ఆ సిస్టర్ జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకోగాని నాకు ఆ హాస్పిటల్లో చాలామంది సిస్టర్స్ అలాంటి ఆత్మీయ స్పర్శ అందించారు.

ఇలా రకరకాలుగా లభించిన ఆత్మీయతే చరమాంకంలో వున్న నాకు గొప్ప సంతృప్తి. ఊరట.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: