కడప: నగరాన్ని క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దుతామని నగరమేయర్ సురేష్‌బాబు అన్నారు. స్థానిక వైఎస్సార్ ఇండోర్ స్టేడియం ఆవరణలో సోమవారం ఈతకొలను(స్విమ్మింగ్‌ఫూల్) నిర్మాణానికి నగర మేయర్ సురేష్‌బాబు, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు సీఆర్ఐ సుబ్బారెడ్డి, డీఎస్‌డీవో బాషామొహిద్దీన్, ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఛైర్మన్ తోట కృష్ణ, కేవీఆర్ నిర్మాణరంగ సంస్థ అధినేత కె.విశ్వనాథరాజు తదితరులు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ ఈతకొలను నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దాతల సహకారంతో ఈ మొత్తాన్ని సేకరించి మార్చిలోపు నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు.
స్కేటింగ్ ఆటస్థలం ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయని, ఇండోర్ స్టేడియం సమీపంలోనే రూ.30 లక్షలతో నిర్మిస్తామని చెప్పారు. మరిన్ని క్రీడలను అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో చెస్, టేబుల్‌టెన్నిస్‌ను ఏర్పాటుచేయాలని డీఎస్‌డీవోను కోరామని చెప్పారు. క్రీడాకారులకు, వాకర్స్ కోసం కార్పొరేట్ తరహాలో క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఒలింపిక్ భవన్‌ను మార్చిలోపు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు సీఆర్ఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ క్రీడాభివృద్ధిలో జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రయత్నిస్తామన్నారు. క్రీడల అభివృద్ధికి ఒలింపిక్ సంఘం ఎప్పుడూ ముందుంటుందన్నారు. డీస్‌డీవో బాషామొహిద్దీన్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఈతకొలను అందుబాటులోకి రానుందన్నారు.