ఆదివారం , 22 డిసెంబర్ 2024

ఆర్‌టిపిపికి బొగ్గు కొరత

సకల జనుల సమ్మె కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం (ఆర్‌టిపిపి)పై ప్రభావం చూపుతోంది. సింగరేణి కార్మికుల సమ్మెతో బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటే పరిస్థితులు నెలకొన్నాయి. తొమ్మిది రోజులుగా ఆర్‌టిపిపికి రావాల్సిన బొగ్గు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం కనిస్తోంది. ఐదు యూనిట్లలో ఇప్పటికే ఒక యూనిట్‌లో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపేశారు.

ప్రస్తుతం ఆర్‌టిపిపిలో మూడు రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. విదేశాల నుండి బొగ్గును తెప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో నాలుగు యూనిట్లలో మాత్రమే విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. ఆర్‌టిపిపిలోని ఐదు యూనిట్లల్లో 210మెగావాట్ల చొప్పున రోజూ 1,050 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇందుకు రోజూ అన్ని యూనిట్లకు 16 నుంచి 17 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం. సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో లేకపోవడంతో మరో మూడు రోజుల్లో విద్యుత్తు కేంద్రంలో పూర్తిగా ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది.

చదవండి :  గాలిలో చక్కర్లు కొట్టిన కడప - బెంగుళూరు విమానం

ప్రస్తుతం ఆర్‌టిపిపిలో 90వేల మెట్రిక్‌ టన్నుల వరకు బొగ్గు నిల్వలున్నాయి. ఇందులో 30 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు విద్యుత్తు ఉత్పత్తికి పనికిరాదు. 60వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి వినియోగానికి ఉపయోగపడుతుంది. ఆదివారం లోపల ఆర్‌టిపికి బొగ్గు సరఫరా కాకుంటే విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం బొగ్గు తెప్పించేందుకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోతుందన్న దశలో ఇప్పుడు ఆగమేఘాలపై జెన్‌కో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగమయ్యారు. అసాధ్యమైన చర్యలకు సిద్ధపడుతున్నారు.

ఒరిస్సా రాష్ట్రంలోని మహానది నుండి కూడా బొగ్గును తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం లోపల బొగ్గు సరఫరా అవుతుందని విద్యుత్తు ఉత్పత్తికి ఎలాంటి ప్రమాదం లేదని జెన్‌కో అధికారులు అంటున్నారు. వాస్తవ పరిస్థితులను చూస్తే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆదివారం బొగ్గు రాకపోతే విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి ఆగిపోయి చీకట్లు కమ్ముకోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అవసరం మేరకు విద్యుత్తు ఉత్పత్తి లేకపోవడంతో పల్లెల్లో 15 గంటలు, మండలాల్లో ఎనిమిది, నగరాల్లో నాలుగు గంటల చొప్పున విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్న విషయం తెలిసిందే.

చదవండి :  తుమ్మేటి రఘోత్తమరెడ్డికి కేతు పురస్కారం ప్రధానం

ఆర్‌టిపిపిలో కూడా పూర్తి స్థాయిలో ఉత్పత్తి ఆగిపోతే ఈ సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదముంది. ఆర్‌టిపిపిలో విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోకుండా ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. ప్రతి నెలా బొగ్గుకు తిప్పలే ఆర్‌టిపిపిలో ప్రతి నెలా బొగ్గు సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా బొగ్గు సమస్య ఉన్నా అధికారులు మాత్రం ఛోద్యం చూస్తున్నారు. వాస్తవానికి థర్మల్‌ కేంద్రంలో 20 నుంచి 25 రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా థర్మల్‌ కేంద్రంలో బొగ్గు నిల్వలు ఉంటున్నాయి. కేవలం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలనే అధికారులు పరిమితం చేస్తున్నారు. రోజూ నాలుగు నుంచి ఐదు కోల్‌రేక్స్‌ మాత్రమే ఆర్‌టిపిపికి వస్తుంటాయి.

చదవండి :  గండికోట ను సందర్శించిన సి.ఎం. చంద్రబాబు

ఒక్కొక్క రేక్‌లో నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు మాత్రమే సరఫరా అవుతుంది. ఈ లెక్కన నాలుగు రేక్‌ల బొగ్గు వచ్చినా ఒక్క రోజు ఉత్పత్తికి కూడా సరిపోదు. రోజూ ఐదు రేక్‌లు వస్తే ఒక రోజు ఉత్పత్తిపోను మరో మూడువేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వ ఉంటుంది. ఆర్‌టిపిపిలో విద్యుత్తు ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే రోజూ ఐదు రేక్‌లలో 25రోజుల పాటు రావాల్సి ఉంటుంది. అలా వస్తే తప్ప భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశముంది. లేకపోతే బొగ్గు కొరత పీడిస్తూనే ఉంటుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: