కడప: రాయలసీమ సమగ్రాభివృది కోసం ఈనెల 27 నుంచి ‘రాయలసీమ ఆత్మగౌరవయాత్ర’ను చేపడుతున్నట్లు రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్‌యూ) జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ తెలిపారు. ఆత్మగౌరవయాత్రకు సంబంధించిన గోడపత్రాలను ఆదివారం స్థానిక గీతాంజలి కళాశాలలో విద్యార్థులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ మాట్లాడుతూ శతాబ్దాలుగా కరవు కాటకాలతో రాయలసీమ అల్లాడుతోందన్నారు. సీమ నేల మీద ఆత్మహత్యలు, వలస బతుకులు శ్ర్వసాదారనంయ్యాయన్నారు. తరతరాలుగా సాగు, తాగునీరు అందక సీమ గొంతు ఎండిపోతోందని, గత 60 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాయలసీమపై వివక్ష చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాయలసీమ ప్రజలను చైతన్యవంతులను చేసేలా రాయలసీమ ఆగ్మగౌరవ యాత్రను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ యాత్రను రాయలసీమ ప్రజలంతా విజయవంతం చేయాలన్నారు.
కేంద్ర విశ్వవిద్యాలయం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని, సాగునీటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతామన్నారు. ఎయిమ్స్‌ను, హైకోర్టును సీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. వీటి సాధనకు రాయలసీమ ఆత్మగౌరవ యాత్రను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
ఈనెల 27న చిత్తూరు జిల్లా పలమనేరులో ఆత్మగౌరవ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. నవంబరు 3వ తేదీన కడపకు యాత్ర ఏరుకుంటుందన్నారు. మొత్తం 700 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని.. విద్యార్థులు, మేధావులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, జకరయ్య, విద్యార్థినీలు పాల్గొన్నారు