100 మందికి ప్రత్యక్ష ఉపాధి
కేంద్ర ప్రభుత్వం ‘పవర్ ఫర్ ఆల్’ పథకంలో భాగంగా గాలివీడు వద్ద 500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ‘సహజవనరులు మరియు పునరుత్పాదక’ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైదరాబాదులో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఈ ప్రాజెక్టులో భారత ప్రభుత్వం 50 శాతం, ఏపి జెన్‌కో 41 శాతం, నెడ్‌క్యాప్ 9 శాతం పెట్టుబడులు పెడతాయి. కడప జిల్లా గాలివీడు వద్ద తూర్పుగుంట పంచాయతీలోని మూడు వేల పైచిలుకు ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన స్ధల సేకరణ చేపట్టాలని జిల్లా అధికారులను ప్రభుత్వం కోరింది.
దీంతో జిల్లా రెవిన్యూ యంత్రాంగం 3,606 ఎకరాల స్ధలాన్ని గుర్తించి ప్రభుత్వానికి పంపించింది. ఇందులో 1868 ఎకరాలు డీకేటీ ఉండగా మరో 1738 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వం భూమి ఉన్నట్లు సమాచారం. భూసేకరణ పనులు వేగవంతం కావడంతో ఇక సోలార్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా త్వరితగతిన మొదలువుతాయని జిల్లావాసులు ఆశిస్తున్నారు.
ఈ సోలార్ విద్యుత్ ఉత్పాదన కేంద్రం పూర్తిస్తాయిలో ఏర్పాటు జరిగితే దానిని నిర్వహించేందుకు సుమారు 100 మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే 100 మందికి ప్రత్యక్షంగా మరో వందమందికి పరోక్ష ఉపాధి దొరుకుతుందన్నమాట!
రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది:
1000 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ పార్కు (NTPC) – నంబులపూలకుంట, అనంతపురం జిల్లా
4000 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన తాప విద్యుత్ కేంద్రం – విశాఖపట్నం జిల్లా
1000 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ పార్కు – పాణ్యం, కర్నూలు జిల్లా