సొప్పదంటు ప్రెశ్నలు (కథ) – వేంపల్లి రెడ్డినాగరాజు

“నాయినా, నాయినా” అని పరిగెత్తుకుంటా వొచ్చె మా పిల్ల నాకొడుకు నిన్న తెల్లార్తో జలదాట్లో నీల్లు పోసుకుంటాంటే.

“ఏంటికిరా అట్ల గస పోసుకుంటావొస్తివి ?” అనడిగితి సబ్బుతో వొల్లు రుద్దుకుంటా.

“నీ సెల్లు పోను మోగుతాంది, అది చెప్తామనే వొస్తి ” అని చెప్పె.

“సరేపా, వస్తాండాగనీ” అంటి చెంబుతో నీల్లు మింద కుమ్మరిచ్చుకుంటా.

“ఇబ్బుడికి రొండుతూర్లు మోగిండాది” అనె వాడు ఆట్నించీ ఎల్లబారకుండానే.

“అట్లనా , ఎవురు చేసినారో చూస్తివ్యా”? అనడిగితి.

“ఆ, చూసినా, ‘ ప్రెసాద్ ఐద్రాబాద్ ‘ అని పడింది పేరు” అని చెప్పె.

“సరేపా, మాట్లాడతా ” అని ఇంట్లోకొచ్చి ప్రెసాద్ కు పోన్ చేస్తి.

“ఏం బ్బీ, రొండుతూర్లు చేసినా ఎత్తలేదు , బిజీగా వున్నెట్లుండావే?” అనడిగె ఆయప్ప.

“నీల్లు పోసుకుంటాంటిలేన్నా” అని చెప్తి టవల్ తో తుడుసుకుంటా.

“రాత్తిరి చానా సేపు మేలుకోనుంటివేమో, ఇంగా నిద్దర లేసిండావో , లేదో అనుకుంటి” అనె నవ్వతా.

“ఎనిమిది గంటల పొద్దయితాంది, ఇంగా పొణుకుంటే ఎట్లన్నా” అంటి.

“వూరికే అంటిలే, ఏమనుకోగాకు” అనె ఇంగోతూరి నవ్వతా.

“బాగుండావు గదన్నా?, ఆయక్కా, పిల్లోల్లు అంతా ఎట్లుండారు?” అనడిగితి.

“మా వాల్లాంతా బాగుండారుబ్బీ, మీ పెండ్లాం , పిల్లోల్లు బాగుండారు గదా” అనె.

“ఔ న్నా, చాన్నాల్లకు గుర్తొచ్చినట్లుండానే ?” అనంటి కొంచిం నిష్టూరంగా.

“నిజమేబ్బీ, సుట్టాలింటికి మీ జిల్లాకే వొచ్చినా, ఈడికి నువ్వుండే వూరు దెగ్గిరేగదా , అది గమనానికొచ్చి పోన్ చేస్తి” అని చెప్పె.

“ఇబ్బుడు నువ్వు యాడుండావున్నా ?” అనడిగితి.

“అనంతపురంలో వుండే మా చెల్లెలోల్లింటికి నిన్న సందకాడ వొచ్చినా”అని చెప్పె.

“అట్లయితే మా వూరికి రాగుడదాన్నా , ఎట్లా ఇంత దూరం వొచ్చినావు ” అంటి.

చదవండి :  యంగముని వ్యవసాయం (కథ) - ఎన్. రామచంద్ర

“ఇంగోతూరి ఆదివారం పూట ఎబ్బుడన్నా తీరిగ్గా వొచ్చినబ్బుడు గ్యారంటీగా వొస్తాలేబ్బా, ఈ దినం నువ్వు ఆపీసుకు పోవల్లనేమో, నిన్ను ఇబ్బంది పెట్టేదేంటిగ్గనీ” అనె ఆయప్ప.

“వానెక్కా, నువ్వు మా వూరికి వొస్తే అదే బాగ్యంగనీ , ఆపీసుకు ఈపూట శెలవ పెట్టేస్తా, ఇంగేం మాట్లాడకుండా రాన్నా,నీ కోసరం ఎదురు చూస్తాంటా” అని
చెప్తి.

“సరేలే , వొచ్చేటట్లయితే, మల్లా చెప్తా ” అనె .

” ఆ రామాయనాలన్నీ సాలిచ్చున్నా, ఇంగేం మాట్లాడకుండా బస్సెక్కి వొచ్చై, నీ కోసరం ఎదురు చూస్తాంటా, పది గంటలకు బస్సుంది చూడు” అని చెప్తి.

“అంతగా బలవంతం చేస్తాండావ్, వస్తాలేబ్బా” అనె ప్రెసాదన్న.

” మ్మే , ఐద్రాబాదు ప్రెసాదన్న వొస్తాండాడు, ఈ పొద్దు ఆపీసుకు పొయ్యేది లేదుగనీ ,ఆయప్పకోసరం ఏందన్నా ‘స్పెసల్ ‘ చెయ్యి ” అని చెప్తి నా బాశాలికి.

“ఎన్ని గంటలకు వొస్తాడు?” అనెడిగె ఆయమ్మి కాపీ లోటా అందిస్తా.

” మద్యానం అన్నం టయానికి వొచ్చేస్తాడు” అని చెప్తి వుడుకుడుగ్గా వుండే కాపీ వూదుకుంటా తాగుతా.

“చికిన్ తెస్తావా, మటన్ తెస్తావా?” అనె.

” అట్టాటివన్నీ ఆయప్ప దినామూ తినేటివేలేమ్మే, రాగిపిండి రోంత ఎక్కువగా ఏసి సంగటి గెలికి, కారంకారం వుండేటట్లు గోవాకు వూరిమిండి నూరు, అట్లే ఎర్రగడ్లు, పండుమిరగ్గాయలు గుడా వూరిమిండి నూరు, బో ఇస్టంగా తింటాడు” అని చెప్తి.

“కరెంటు గుడా పోతా వొస్తావుంది గదబ్బా, బజారుకు బిరీనా పొయ్యి గోవాకు రొండు కట్టలు, మిరక్కాయలు త్యాపో” అనె.

” మ్మే, చెప్పడం మర్చిపోయినా, అట్లా యాడన్నా మిక్సీలో రుబ్బేవు, రోట్లో నూరు , ‘ బో ‘ రుచిగా వుంటుందని ఆయప్ప నాతో చానాతూర్లు చెప్పినాడు, అట్నే
అగ్గి నిప్పుల మింద వంకాయి కాల్చి బజ్జీ గుడా చెయ్యి ” అని గెట్టిగా చెప్తి.

చదవండి :  బొమ్మ బొరుసు (కథ) - వేంపల్లి రెడ్డి నాగరాజు

“సరేలే, అట్లనే నూరుతాగనీ” అనె నా బాశాలి.

“నాయినా, ప్రెసాదన్నా ఎవురు?” అనెడిగె మా మాటలు ఇంటాండిన మా పిల్ల నాకొడుకు.

“ఆయప్ప నా ఫ్రెండులేరా” అని చెప్తి.

” వాల్లది యావూరు?” అని మల్లా అడిగె.

“మన కడప జిల్లానే, కలసపాడు, ఇబ్బుడు ఐద్రాబాదులో వుండాడు ” అంటి బజారుకు పొయ్యేదానికి చొక్కా తొడుక్కుంటా.

“ఏం పని చేస్తాడు ?” అని ఇంగో కొసినీ ఏశె.

“ఆయప్ప ‘ చెయ్యి తిరిగిన రచయిత ‘ అని అంటి.

“అట్లంటే ఏంది?, ఏం చేస్తాడో చెప్తేకదా ” అని మల్లా అడిగె.

“మెట్టితో కొడతా, కిందా పైనా మూసుకోని బుక్కెత్తుకోని సదువుకో పో వాయ్, తలకాయి తినగాకు” అని కసురుకుంటి .

“పిల్లోడు గదబ్బా, ఏందన్నా అడిగితే అర్తమయ్యేటట్లు చెప్పల్లగనీ ఈడెగిరి ఆడ దుంకితే ఎట్ల?” అనె నా పెండ్లాం వానికి సపోర్టుగా వస్తా.

“అంతగాయితే నువ్వే ఇలావరీగా చెప్పు ,బిరీనా బజారుకు పొయ్యొస్తా, లేటుగాపోతే మల్లా గోవాకు దొరుకుతుందో లేదో ” అని గబగబా ఎల్లబార్తి.

సరిగ్గా వొంటిగంటకాడ ప్రెసాదన్న రాయదుర్గం బస్స్టాండులో బస్సు దిగె. అవీ, ఇవీ మాట్లాడుకుంటా ఆటోలో ఇంటికి పోతిమి.

“కాల్లూ, మొగం కడుక్కోన్నా , అన్నం తినే టయిం అయ్యింది , రోంత తినేసి మల్లా తీరుబడిగా మాట్లాడుకుందాం” అంటి టవాలు అందిచ్చి జలదాటికల్లా చూపిస్తా.

చదవండి :  శ్రుతి (కథ) - డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

“కొంచెంసేపిటికి తట్టలముందు కుచ్చుంటిమి.

“వుడుకుడుకు ముద్దా, గోవాకు వూరిమిండీ, వంకాయి బజ్జీ బలే వుండాయిబ్బా , ఇవి తింటాంటే మల్లా మాయమ్మా, మా పల్లీ గెమనానికొస్తాండాయి  నాగరాజూ,అని”

బో బాగ చేపిచ్చినావు అంటా ప్రెసాదన్నా మెచ్చుకుండె లొట్టలేసుకోని తింటా.

“కొంచింసేపు పొణుకోన్నా, మంచం వాల్చిస్తా” అనడిగితి.

” మద్యానం పొణుకునే అలవాటు లేదులేబ్బా” అని మా పిల్లోన్ని దెగ్గిరికి పిల్చె.

వాడు దెగ్గిరికి పోంగానే ఏం పేరు , ఏం సదువుతాండాదూ, ఏ ఇస్కూలు అన్నీ అడిగె.

” మా వాడు అన్నిటికీ జవాబులు చెప్పంగానే ” ఔప్పా వొచ్చినబ్బుటుండీ గమనిస్తాండా , నువ్వేంటికి అదే పనిగా నా చెయ్యి కల్లానే చూస్తాండావే?” అనెడిగె అనుమానంగా చూస్తా.

“నీ చొక్కా రట్ట పైకెత్తి వొగతూరి చెయ్యి చూపిచ్చు అంకుల్” అనె మా వాడు పుల్ షర్టు ఏసుకోనుండే ప్రెసాదన్నతో .

ఆ మాట వింటానే ఈ నాకొడుకు ఏంటికిబ్బా ఆయన్నను ఇట్ల అడిగిండాడు , ఇబ్బుడాయప్ప ఏమనుకుంటాడొ , ఏంపాడో, అనుకుంటా ప్రెసాదన్న కల్లా చూస్తి.

“దేనికి నాయినా?” అనెడిగె ఆయప్ప నగుతా పుల్ షర్టు రట్ట పైకెత్తి చెయ్యి చూపిస్తా.

” మా నాయిన నువ్వేం పని చేస్తావని అడిగితే ‘ చెయ్యి తిరిగిన రచయిత ‘ అని చెప్పిండాడు, నీ చెయ్యి యాడ తిరిగిందో చూస్తామని” అనె వాడు అమాయకంగా మొగం పెట్టి.

ఆ మాట ఇంటానే ఆయన్న గెట్టిగా నవ్వేసె. ఇట్లా సొప్పదంటు ప్రెశ్నలడిగే మా పిల్ల నాకొడుకుతో ఎట్ల ఏగల్లనో మీరే చెప్పండిప్పా…

– వేంపల్లి రెడ్డినాగరాజు

ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా, రాయదుర్గం(పోస్ట్), అనంతపురం(జిల్లా)
చరవాణి: 9985612167

ఇదీ చదవండి!

dada hayat

సెగమంటలు (కథ) – దాదాహయత్

సెగమంటలు కథ  మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: