Vidya Sagar Rao

సీమపై విషం కక్కిన తెలంగాణా మేధావి – 2

తెలంగాణకు చెందిన ఆర్ విద్యా సాగర్ రావు కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వారు మంచి మేధావి, వక్త కూడా. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంలోనూ సిద్ధహస్తులు. వారు ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు కూడా. తెరాసకు సలహాదారుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు.

రావు గారు ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో ఈ రోజు ‘నీటి యుద్ధాలు నిజమేనా?’ అని ఒక వ్యాసం రాశారు. వారు రాసిన వ్యాసంలో సీమపై తనకున్న అక్కసును మరొక్కసారి వెళ్ళగక్కారు.

రావు గారు రాసిన వ్యాసం

*** ***  ***  ***   **

‘నీటి యుద్ధాలు’ నిజమేనా?

ఇటీవల ముఖ్యమంత్రి తనకు వినతి పత్రం సమర్పించడానికి వచ్చిన అనంతపురం రైతులతో ‘రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు’ తప్పవని శెలవిచ్చారు. అంతకు ముందు ఒకసారి పత్రికా విలేఖర్ల సమావేశంలో ‘రాష్ట్ర విభజనతో నీటి సమస్యలు ఏర్పడతాయని’, బాహాటంగానే ప్రకటించారు. తాను సమైక్యవాదినని, రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకినని అనేక చర్యల ద్వారా యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి, అధిష్ఠానం తెలంగాణ ప్రకటించాక అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర పక్షపాతి, అందునా మరీ ముఖ్యంగా రాయలసీమ పక్షాన వ్యవహరిస్తున్నాడనుకోవడానికి ఇంక వేరే ఆధారాలు అవసరం లేదు. ‘నీటి యుద్ధాలు’ తెలంగాణ ఏర్పడితే వచ్చినా రాకపోయినా ముఖ్యమంత్రి ‘నీటి యుద్ధాలు వస్తాయి – సీమాంధ్ర ఎడారి అవుతుంది’ లాంటి మాటలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నది మాత్రం పచ్చి నిజం. 8 కోట్ల ప్రజలకు నాయకత్వం వహిస్తున్న ఒక పెద్ద మనిషి వాస్తవాలను మరుగుపరచి, కనీసం తన దగ్గర పనిచేస్తున్న ఇంజనీర్లను సంప్రదించకుండా ఇలా దారుణంగా మాట్లాడటం సమంజసం కాదు. తన విపరీత ఆలోచనలు ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయన్న భావం కలగకపోవడం శోచనీయం.

ఇంతకీ వాస్తవ పరిస్థితులేమిటి? గతంలోకి వెడితే – సీమాంధ్ర ప్రాంతం మదరాసు రాష్ట్రంలో, ‘తెలంగాణ’ హైదరాబాదు రాష్ట్రంగా ఉండేవన్నది నిర్వివాదాంశం. 27, 28 జూలై 1951 నాడు ప్రణాళికా సంఘంలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర సమావేశంలో కేంద్ర జల విద్యుత్ సంఘం సమర్పించిన కృష్ణా-గోదావరి జలాల వినియోగం పత్రాన్ని పరిశీలించి, దాని ఆధారంగా రాష్ట్ర ప్రతినిధులతో చర్చించి, ఆమోదం పొందిన అనంతరం నీటి కేటాయింపులు జరిపినట్లు బచావత్ ట్రిబ్యునల్ నివేదికలో పొందుపరచిన అంశాలను బట్టి స్పష్టమవుతోంది. ఆనాటికి అమలులో ఉన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల ద్వారా 450 టీఎంసీల వినియోగమవుతున్నదని తెలుస్తున్నది. అందులో రాయలసీమకు చెందిన కె.సి. కాలువలో 10 టీఎంసీలు, బెజవాడ ఆనకట్ట ద్వారా 200 టీఎంసీల వినియోగం, వెరసి సీమాంధ్రలో 210 టీఎంసీల వినియోగం అవుతోందని ఆ పత్రం వెల్లడించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల జాబితా ఇస్తూ తుంగభద్ర డ్యామ్, మద్రాసు వంతు వినియోగంగా 65 టీఎంసీలు చూపించింది. ఇక భవిష్యత్తులో కట్టబోయే ప్రాజెక్టుల వినియోగానికి వస్తే తుంగభద్ర ఎగువ కాలువకు 25 టీఎంసీలు, పులిచింతలకు 100 టీఎంసీలు, కృష్ణా పెన్నార్ ప్రాజెక్టుకు 825 టీఎంసీలుగా చూపడం జరిగింది. అంటే 1951 నాటికి మద్రాసు ప్రభుత్వం మొత్తం కృష్ణా వినియోగానికి గాను 210+65+950 = 1225 టీఎంసీలు, అందులో రాయలసీమకు 10+65+825 = 900 టీఎంసీల అవసరాన్ని మద్రాసు ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఎదుట పెట్టింది. అయితే కృష్ణా బేసిన్‌లో మొత్తం లభ్యమయ్యే నీరు 1715 టీఎంసీలు.

ఈ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని మద్రాసు రాష్ట్రంలో అమలులో ఉన్న ప్రాజెక్టులకు 290 టీఎంసీలు, కొత్త ప్రాజెక్టులకు 470 టీఎంసీల కేటాయింపులు నిర్ధారించడం జరిగింది. అంటే 760 టీఎంసీల మొత్తం వినియోగం సీమాంధ్రకు అనుమతించడం జరిగింది. ఇదే విధంగా హైదరాబాద్, మైసూరు, బొంబాయి ప్రభుత్వాలకు కేటాయింపులు జరిపి ఆ మేరకు ఒక అంగీకార పత్రాన్ని (Agreement Mamorandam) తయారు చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మైసూరు రాష్ట్రం దీనికి అంగీకరించకపోవడంతో ఈ కేటాయింపులు అమలుకు నోచుకోలేదు. ఇదిలా ఉండగా 1951లో మద్రాసు ప్రభుత్వం ‘కృష్ణా – పెన్నార్’ పథకాన్ని ‘దశలవారీగా’ పూర్తిచేయాలని ప్రతిపాదించింది.

1952, డిసెంబర్ 8న ఖోస్లా కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ప్రణాళికా సంఘం అంతిమంగా నందికొండ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. మదరాసు కాలువ, సిద్దేశ్వరం డ్యాం ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో మరిన్ని అధ్యయనాలు చేశాక తిరిగి సమర్పించాలని సూచించింది. అదేవిధంగా ఖోస్లా కమిటీ మూడవ దశలో సిఫారసు చేసిన పులిచింతల ప్రాజెక్టు కూడా మరిన్ని క్షేత్రస్థాయి అధ్యయనాలు చేశాకే సమర్పించాలని సూచించింది. అప్పటికే మదరాసు, హైదరాబాద్ ప్రభుత్వాలు విడివిడిగా సమర్పించిన ‘నందికొండ’ ప్రాజెక్టును ఉమ్మడి ప్రాజెక్టుగా రూపొందించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీచేయడం జరిగింది. అంతిమంగా నాగార్జున సాగర్ అవతరించింది. ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాల తరువాత సిద్దేశ్వరం డ్యామ్‌కు బదులుగా శ్రీశైలం అవతరించింది.

చదవండి :  దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల

శ్రీశైలం కేవలం విద్యుత్తు ఉత్పాదన కోసమని స్పష్టం చేయడం వల్ల కావచ్చు మరేదైనా కారణం కావచ్చు ఆ డ్యాం నుంచి 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఖోస్లా కమిటీ ప్రతిపాదించిన ‘కృష్ణా-పెన్నా’ కాలువ అంతర్థానమైంది.

ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే రాయలసీమకు సాగునీరు అందించగల ‘కృష్ణా-పెన్నా’ కాలువ వివిధ కారణాల చేత మాయమైంది. దాంతో సీమ ప్రజలు పెట్టుకున్న ఆశలకు మంగళం పాడినట్టయింది.

రావు గారు భలే తెలివైన వారు. రాయలసీమకు నీటి కేటాయింపులు జరగకపోవడానికి లేదా అక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు కాకపోవటానికి కారణం ఇతర రాష్ట్రాల వాళ్ళే. ఇందులో తెలంగాణా లేదా కోస్తా ప్రాంతానికి లేదా ఆ మాటకొస్తే తెలుగు వారికెవ్వరికీ సంబంధం లేదు అని చెప్పటానికి భలే ప్రయత్నం చేశారు. మైసూరు ఒప్పుకోకపోవటంతో మదరాసు ప్రభుత్వ ప్రతిపాదన అటకెక్కింది అన్న రావు గారు ఖోస్లా కమిటీ (1953) సిఫారసులకు అనుగుణంగా ప్రతిపాదిత నందికొండ ప్రాజెక్టును ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని ప్రణాళికా సంఘం చేసిన సూచన మేరకు 1955 లో నాగార్జున సాగర్ అవతరించిందట. ఇక్కడే రావు గారు చాతుర్యం ప్రదర్శించారు – వాస్తవాలను కప్పెట్టేందుకు. 1953 లో ఆంద్ర రాష్ట్రం ఏర్పాటైంది. అంతకు ముందే కోస్తా నేతలు రాయలసీమ వాసులతో శ్రీభాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆంద్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే సీమ వాసులను వంచించి ప్రణాళికా సంఘ సూచనల పేరుతొ కోస్తా, తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకులు కలిసి నాగార్జున సాగర్ ను వెలుగులోకి తెచ్చారన్నది విస్మరించలేని వాస్తవం.

ఇదే నాగార్జున సాగర్ ను ప్రస్తుత శ్రీశైలమున్న చోట ప్రతిపాదించి ఉంటే మూడు ప్రాంతాలకు అప్పుడే నికర జలాలు దక్కేవి కావా? తమ ప్రాంత ప్రయోజనాల కోసం సీమను బలి చేసిన వారి గురించి రావు గారు ఎందుకు చెప్పలేదు? ఇక తర్వాత 1960 ఏర్పాటైన శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా కాకుండా కేవలం విద్యుచ్చక్తి ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడమన్నది నాగార్జున సాగర్ లో నీటి లభ్యతను కోల్పోకుండా చూడాలనే కుటిలయత్నంతోనే కదా!

అప్పటికే శ్రీభాగ్ ఒప్పందాన్ని విస్మరించి ఒకసారి సాగర్ పేరుతొ సీమ ఆశలపై మన్ను చల్లిన కోస్తా, తెలంగాణా నేతలు మరోసారి శ్రీశైలం నీరు దక్కకుండా చక్కగా పావులు కదిపారు. ఇదంతా చూస్తూ కూడా నోరెత్తకుండా సహకరించిన చేతగాని వాళ్ళు సీమ నాయకులు. ఎందుకంటే వారు అధికార మత్తుకు అప్పటికే బానిసలయ్యారు. సీమపై మదరాసు ప్రభుత్వానికున్న పాటి నిబద్దత కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ప్రభుత్వాలకు లేకపోయిన్దనేది నిర్వివాదాంశం.

“రాష్ట్రం విభజించినా సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉంటాయి కనుక ‘ఇచ్చిపుచ్చుకోవడం’ అక్కడే జరగాలి.” అని తీర్మానించడం రావు గారికే చెల్లింది. సీమ వాసులు ఎలా ఉండాలనేది వీరే నిర్ణయిస్తారు. ఇది చేతగాని నాయకులను నమ్ముకున్న మా ఖర్మ.

ఇకపోతే “రాష్ట్రం కలిసుంటే సీమకు ‘లేని’ నీళ్లు ఎక్కడ్నుంచి వస్తాయి? అంటే పరోక్షంగా ఇతర ప్రాంతాలకు (తెలంగాణ, కోస్తాంధ్ర) చెందిన చట్టబద్ధమైన నీటిని తన అధికారం అడ్డుపెట్టుకుని తరలిస్తామని హామీ ఇవ్వటమే కదా?” అంటూ సీమపై ఎదురుదాడికి దిగారు రావుగారు. రావు గారు భ్రమలో ఉన్నారు గాని ఆయనకు మాత్రం తెలీదా – సీమ నాయకులు ఆ ప్రాంత ప్రయోజనాల గురించి పెద్దగా ఆలోచించరని. అదేదో సామెత చెప్పినట్టు … ఒకవేళ సీమ ముఖ్యమంత్రులు అధికారం అడ్డుపెట్టుకుని చట్టబద్ధమైన నీటిని తరలలించే రకాలే అయితే శ్రీభాగ్ ఒప్పందం అమలు కాకున్డునా? సాగర్ కన్నా ముందు శ్రీశైలం బహుళార్ధక సాధక ప్రాజెక్టు కాకపోవునా? సీమ వాసులు నికరజలాలపై హక్కును కోల్పోయి మిగులు లేదా వరద జలాల కోసం దేబరించవలసి వచ్చునా? మీ లాంటి మేధావుల గారడీ మాటలకు సమాధానం చెప్పకపోవునా?  రాజధాని కర్నూలును కాదని పోవునా?

చదవండి :  కడప రుచుల కేంద్రం వన్ టౌన్ సర్కిల్

గారడీ అని ఎందుకంటున్నానంటే – నికర జలాలను హాయిగా అనుభవిస్తూ కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కళ్ళ ముందే నీటి హక్కును కోల్పోయి కూడా దైన్యంగా బతుకుతూ వరద జలాల కోసం ఆశగా చూస్తా ఉన్న ప్రాంతీయులను దోపిడీదారులని ముద్ర వేసి విషం చిమ్ముతున్న మేధావితనం మీది. అంతేనా నీళ్ళ దగ్గరికొచ్చేసరికి కోస్తా ప్రయోజనాలకోసమని మొసలి కన్నీరు కార్చేస్తున్నారు. అక్కడికేదో సీమ వాసులు కోస్తా ప్రాంతీయుల కడుపు కొడుతున్న్రట్లు…

సీమకు జరిగిన అన్యాయం గురించి ఏమాత్రం చెప్పకుండా కేవలం సాంకేతిక కారణాల వల్లే మొదటి నుండీ సీమకు నీటి కేటాయింపులు జరగలేదన్నట్లు చెబుతున్న విద్యాసాగర్ రావు గారు తెలంగాణా అనే ఏకైక అంశం గురించి కాకుండా వాస్తవాలను స్పష్టంగా చెబితే బాగుంటుంది.

ఇక వర్తమానంలోకి వస్తే నాగార్జునసాగర్ డ్యామ్, ఎడవమ కాలువ కుడి కాలువలు తయారయ్యాయి. పులిచింతల దాదాపు తయారైంది. సాగర్ ఎగువన కేవలం విద్యుత్ కోసం శ్రీశైలం నిర్మాణమైంది. పెన్నాపైన సోమశిల నిర్మాణం కూడా అయింది. ఇదిలా ఉండగా 1976లో కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలకు (మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్) సముచిత కేటాయింపు సూత్రం అవలంభించి బచావత్ ట్రిబ్యునల్ పంచింది. 75 శాతం విశ్వసనీయత ఆధారంగా కృష్ణా జలాల పరిమాణాన్ని 2060 టీఎంసీలుగా ట్రిబ్యునల్ నిర్ధారించి 800 టీఎంసీల నికర జలాలను మనకు కేటాయించడం జరిగింది.

800 టీఎంసీలకు తోడు మరో 11 టీఎంసీలు రిటర్న్ ఫ్లోస్ (Return Flows) మూలంగా జత అయ్యి మొత్తం 811 టీఎంసీలు అయ్యాయి. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఇంత పెద్ద మొత్తం వాటా లభించడం ‘రాయలసీమ’ను బచావత్ ఎదుట ‘బూచి’గా చూపించడమే కారణమని చాలా మంది రాయలసీమ వాసుల దృఢ అభిప్రాయం. ఇది పూర్తిగా అవాస్తవం. ‘బచావత్’ రిపోర్టులో ఎక్కడా ‘రాయలసీమ’ ప్రస్తావన లేదు. 1960 సెప్టెంబర్ నాటికి అమలులో ఉన్న, శాంక్షన్ అయిన ప్రాజెక్టులను మొదటి శ్రేణిలో ఉంచి వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపింది. ఇక రెండవ శ్రేణిలో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు (ఆవిరి నష్టం) చోటు చేసుకున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులన్నీ ప్రాజెక్టుల వారీగానే ప్రాంతాల వారీగా కాదు. మన రాష్ట్రంలో ప్రాంతాల వారీగా గమనిస్తే రాయలసీమకు 133.70 టీఎంసీలు, తెలంగాణకు 277.83 టీఎంసీలు, కోస్తాంధ్రకు 388.47 టీఎంసీలు లభించాయి.

దరిమిలా రాష్ట్ర ఫ్రభుత్వం కేటాయింపుల్లో స్వల్పంగా మార్పులు చేసింది. ఉదాహరణకు కె.సి. కాలువ కేటాయింపుల్లో 8 టీఎంసీలు తగ్గించి, 11 టీఎంసీల రిటర్న్ ఫ్లోస్ వాటా సీమకు బదలాయించి వెరసి 19 టీఎంసీల నీటిని చూపించి శ్రీశైలం కుడిగట్టు కాలువకు కేంద్రం అనుమతి సంపాదించడం జరిగింది. ఇప్పుడు సీమకు లభించిన నికరజలాల కేటాయింపు 144.70 టీఎంసీలు తెలంగాణ కోటా 298.96 టీఎంసీలు, కోస్తాంధ్ర వాటా 367.34 టీఎంసీలు. పరీవాహక ప్రాంతం దృష్ట్యా చూస్తే కృష్ణా బేసిన్‌లో సీమ 18.39 శాతం, తెలంగాణ 68.50 శాతం, కోస్తాంధ్ర 13.11 శాతం వైశాల్యం కలిగి ఉన్నాయి. నికర జలాల కేటాయింపు కోస్తాంధ్రకు 45.3 శాతం లభించాయి. అంటే పరీవాహక క్షేత్రం దృష్ట్యా సీమకు స్వల్పంగా వాటా తగ్గింది. తెలంగాణకు సగానికి సగం తగ్గింది. కోస్తా అత్యధికంగా లాభపడింది. కనుక నికర జలాల కేటాయింపులో దారుణంగా నష్టపోయింది తెలంగాణ ప్రాంతం. బాగా లబ్ధి చేకూరింది కోస్తాంధ్రకు. ట్రిబ్యునల్ కేటాయించింది కనుక మనం నోరెత్తడానికి వీల్లేదు. ఇకపోతే మిగులు జలాలు – ఇప్పటి దాకా వీటికెలాంటి సాధికారత లేదు.

రాష్ట్రానికి 2000, మే దాకా సంపూర్ణంగా మిగులు జలాలను అనుభవించడానికి బచావత్ ట్రిబ్యునల్ స్వేచ్ఛను కల్పించింది. ఆ స్వేచ్ఛను హక్కుగా భావించి, మిగులు జలాలను 227.50 టీఎంసీలుగా నిర్ధారణ చేసి వాటిని రాయలసీమకు 107 టీఎంసీలు, తెలంగాణకు తెలంగాణకు 77 టీఎంసీలు, కోస్తాంధ్రకు 43.50 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఆ మేరకు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మిగులు జలాల కేటాయింపుల్లో సీమకు 47.03 శాతం, తెలంగాణకు 33.85 శాతం, కోస్తాంధ్రకు 19.12 శాతం లభించాయి. ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. తెలంగాణకీ – సీమకు అత్యధికంగా లాభం చేకూరింది. అయితే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్, మిగులు జలాలను మన ప్రభుత్వం మొత్తం తనకే కేటాయించాలని చేసిన అభ్యర్థనను బేఖాతరు చేస్తూ మొత్తం మిగులు జలాలను 448 టీఎంసీలుగా నిర్ధారించి మూడు రాష్ట్రాలకూ పంచింది. అందులో 65 శాతం విశ్వసనీయతన మన రాష్ట్రానికి 45 టీఎంసీలు, సగటున లభించే నీటిలో145 టీఎంసీలు, వెరసి 190 టీఎంసీలను ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ కేటాయింపులను ఇంకా తుది తీర్పుగా ప్రకటించవలసి ఉంది.

చదవండి :  రైళ్లకూ మొహం వాచిన రాయలసీమ!

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇంకా తుది తీర్పు ప్రకటించకపోయినా ఇవే కేటాయింపులుంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేటాయింపుల్లో, రాయలసీమ ప్రాజెక్టుల్లో ఒకటైన తెలుగు గంగకు మాత్రం 25 టీఎంసీలు దక్కాయి. గాలేరు నగరి, హంద్రీ నీవాను కేటాయింపు లిస్ట్‌లో చేర్చలేదు. తెలంగాణ ప్రాజెక్టులయిన ఎస్.ఎల్.బి.సి.కి, నెట్టెంపాడు, కల్వకుర్తి, సీమాంధ్ర ఏకైక ప్రాజెక్టు అయిన వెలిగొండ, ఇవేవీ కేటాయింపులకు నోచుకోలేదు. ఇందులో కూడా తెలంగాణకే పూర్తిగా అన్యాయం జరిగింది. ఈ ట్రిబ్యునళ్ల తీర్పుల మూలంగా రాయలసీమకు అధికారికంగా లభించేది 145 టీఎంసీల నికర జలాలు, 25 టీఎంసీల మిగులు జలాలు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడితే ‘సీమాంధ్ర’ ఎడారవుతుందని, నీటి యుద్ధం వస్తుందని చెప్పడం ఏ రకంగా సబబు? న్యాయాన్యాయాల సంగతి అటుంచి రాయలసీమకు మరికొన్ని నికరజలాలు కావాలంటే ఎవరిస్తారు? మహారాష్ట్ర, కర్నాటకలు ఇవ్వవు కదా. తెలంగాణకు వచ్చిందే తక్కువ. ఏమైనా ఇస్తే గిస్తే కోస్తాంధ్ర, మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ అనుభవిస్తున్న ప్రాంతం ఇవ్వాలి. రాష్ట్రం విభజించినా సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉంటాయి కనుక ‘ఇచ్చిపుచ్చుకోవడం’ అక్కడే జరగాలి. తెలంగాణ (సాటి తెలుగు ప్రాంతంగా) కొంత ఇవ్వవచ్చు అనుకుంటే రాయలసీమ అడగనూ వచ్చు, తెలంగాణ ఇవ్వనూ వచ్చు.

ఎవరికభ్యంతరం? వాస్తవంగా చెప్పాలంటే తాగునీటి కోసం కాస్త కనికరిస్తామేమో గానీ సాగునీటి కోసం అంటే కోస్తాంధ్ర కూడా తన వాటా తగ్గించు కుంటుందా అన్నది అనుమానమే. ఇంక మిగిలిన ఏకైక పరిష్కార మార్గం కేంద్రంపై వత్తిడి చేసి ‘నదుల అనుసంధానం’ ప్రక్రియను అమలులో పెట్టి మహానది గోదావరి మిగులు జలాల నుంచి కొంత నీటిని తరలించడం కోసం ప్రయత్నించడం. ఇంకో ముఖ్యమైన విషయం – ‘బేసిన్ అవసరాలు తీరకుండా మరో బేసిన్‌కు తలరించకూడదన్నది’ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, జాతీయ జల విధానం చెబుతున్న మాటలు. మరి ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి ఇలాంటి బాధ్యతారాహిత్య అవగాహనా రాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కాదు. గతంలో రాజస్థాన్ నీటిఅవసరాలను ‘నర్మద ట్రిబ్యునల్’ బేసిన్‌కు చెందిన రాష్ట్రం కాకపోవడం చేతనే తిరస్కరించిందన్న సంగతి విస్మరించరాదు.

రాష్ట్రం కలిసుంటే సీమకు ‘లేని’ నీళ్లు ఎక్కడ్నుంచి వస్తాయి? అంటే పరోక్షంగా ఇతర ప్రాంతాలకు (తెలంగాణ, కోస్తాంధ్ర) చెందిన చట్టబద్ధమైన నీటిని తన అధికారం అడ్డుపెట్టుకుని తరలిస్తామని హామీ ఇవ్వటమే కదా? లేదా దౌర్జన్యంగా నీటిని రాజోలిబండ ఆనకట్ట, పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకు పోతుంటే చూసీ చూడనట్టు వ్యవహరిస్తూ, ఉపేక్షిస్తానని చెప్పకనే చెప్పినట్టు కదా. రాష్ట్రానికంతటికీ ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాటలేనా ఇవి? రాయలసీమ ప్రజలకు వాస్తవాలు చెప్పి, న్యాయ సమ్మతంగా వారికి మరిన్ని జలాలు సాధించే ప్రయత్నాలు చేయాలి. కేంద్రాన్ని సంప్రదించాలి లేదా తెలంగాణ, కోస్తాంధ్ర వారికి నచ్చచెప్పి ఒప్పించేందుకు కృషి చేయాలి కానీ ఇలా తప్పుడు సంకేతాలు పంపి, సీమ ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడం భావ్యం కాదు. రాష్ట్రం విడిపోకుండా, సమైక్యంగా ఉన్నా రేపు కిరణ్‌కుమార్ రెడ్డి స్థానంలో మరో తెలంగాణ వ్యక్తి లేక కోస్తాంధ్ర ప్రాంతం వ్యక్తో ముఖ్యమంత్రి అయితే ‘కిరణ్’ అనుసరించే విధానాన్నే అనుసరించడా? అధికారం ఈవేళ ఉంటుంది రేపు పోతుంది. మనం చెప్పే మాటలు, చేసే చేతలు నలుగురూ మెచ్చుకోవాలి. కనీసం మరొకరికి నష్టం చేయకూడదు.

***   ***   ***

 

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: