నాగులపల్లె మౌర్యకు 100వ ర్యాంకు
వేంపల్లె రిషికి 374వ ర్యాంకు
కడప : శుక్రవారం ప్రకటించిన 2017 సివిల్స్ ఫలితాల్లో మన కడపోల్లు మెరిశారు. చాపాడు మండలం నాగులపల్లెకు చెందిన నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంకు సాధించగా వేంపల్లికి చెందిన రుషికేష్‌రెడ్డి 374వ ర్యాంకును సాధించి సివిల్స్ లో కడప జిల్లా సత్తా చాటినారు.
రైతు కుటుంబానికి చెందిన మౌర్య సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత కొలువు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చంద్రఓబుళరెడ్డి, జయశ్రీ కూడా తమ కుమార్తె సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కాలేజీలో 2013లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మౌర్య మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించింది. 2015లో సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన మౌర్య ఐదేళ్లుగా సివిల్స్ పరీక్షకు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నారు.
వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాతల కుమారుడు రిషికేశ్‌రెడ్డి శుక్రవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 374 ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రిషి సివిల్స్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా కేవలం ఆన్‌లైన్ సోర్సు మాత్రమే ఉపయోగించి ప్రిపరేషన్ సాగించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు.