సిద్దేశ్వరం కడితే సీమకు సాగునీటి కొరత ఉండదు

కడప : రాయలసీమ దాహార్తిని తీర్చడానికి తగినంత నీటిని పోతిరెడ్డిపాడు వద్ద నిలువ చేసుకునే అవకాశం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా సాధ్యమవుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఛైర్మన్‌ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ‘సిద్ధేశ్వరం అలుగు మనమే నిర్మించుకుందాం’ అన్న అంశంపై సోమవారం కడపలోని వైఎస్సార్‌ పాత్రికేయ సమావేశ మందిరంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రాజెక్టుల నిర్మాణంలో సీమకు అన్యాయం జరగకుండా ఈ ప్రాంతవాసులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మించడానికి మే 31న శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఈ శంకుస్థాపనలో కడప జిల్లాకు చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి ముందుకు రానందున మనమే ఆ కార్యక్రమం చేపడదామన్నారు.

చదవండి :  కడప జిల్లాకు కొత్త కలెక్టర్

సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ సిద్ధేశ్వరం నిర్మాణానికి చేపట్టిన ఉద్యమానికి సీపీఐ మద్దతు తెలుపుతుందన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు నారాయణరెడ్డి మాట్లాడుతూ సీమకు అన్యాయం జరుగుతోందంటే కారణం ఇక్కడి నాయకులేనని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీల ద్వారానే సీమ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు వీలుంటుందని, ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 854 నుంచి 834 అడుగులకు తగ్గించడం సరికాదన్నారు. సిద్ధేశ్వరం జలాశయాన్ని నిర్మించి మన దాహార్తిని మనమే తర్చుకుందామని పిలుపునిచ్చారు.

చదవండి :  ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

సమితి కన్వీనర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మాణం, నిర్వహణ, బదిలీ (బివోటి) పథకం ద్వారా ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా నిర్మించే అవకాశం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: